వర్షార్పణం
ABN , First Publish Date - 2021-05-06T05:29:19+05:30 IST
అకాల వర్షం మరోసారి రైతులను అతలాకుతలం చేసింది. జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్, బొప్పాపూర్, గొల్లపల్లి, తిమ్మాపూర్, కోరుట్లపేట గ్రామాల్లో 200 క్వింటాళ్ల వరకు ధాన్యం తడిసింది.

- తడిసిన వెయ్యి క్వింటాళ్ల ధాన్యం
- జోరుగా వరికోతలు
- కల్లాల్లో నిండుతున్న ధాన్యం
- జిల్లాలో యాసంగి దిగుబడి 4.17 లక్షల మెట్రిక్ టన్నులు
- అకాల వర్షాలతో అన్నదాతల ఆందోళన
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
వరి కోతలు జోరందుకున్నాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పెరిగిపోతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొనుగోలు స్పీడందుకోకపోవడం, రవాణా అనుకున్న మేరకు కొనసాగకపోవడంతో రైతులు అకాల వర్షాలకు నష్టపోతున్నారు. జిల్లాలో 236 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి యాసంగి దిగుబడి 4.17 లక్షల మెట్రిక్ టన్నుల్లో 3.50 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలనే లక్ష్యంగా పౌరసరఫరాల శాఖ పెట్టుకుంది. ఇప్పటివరకు 223 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా 178 కేంద్రాల్లోనే కొనుగోళ్లు సాగుతున్నాయి. కొనుగోళ్లు అనుకున్నంత వేగంగా జరగడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా వడగళ్ల్ల వర్షం నష్టానికి గురిచేస్తున్నాయి. బుధవారం అకాల వర్షం మరోసారి రైతులను అతలాకుతలం చేసింది. జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్, బొప్పాపూర్, గొల్లపల్లి, తిమ్మాపూర్, కోరుట్లపేట గ్రామాల్లో 200 క్వింటాళ్ల వరకు ధాన్యం తడిసింది. రుద్రంగి మండల కేంద్రంలో కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని చూసిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ముస్తాబాద్ మండల కేంద్రంతోపాటు వివిధ గ్రామాల్లో ధాన్యం తడిసిపోయింది. వీర్నపల్లి మండలంలో గర్జనపల్లి, లాల్‌సింగ్ తండా, రంగంపేట, వీర్నపల్లి గ్రామాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. అకాల వర్షానికి జిల్లాలోని వివిధ గ్రామాల్లో దాదాపు వెయ్యి క్వింటాళ్ల వరకు ధాన్యానికి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం ముస్తాబాద్ మండలంలో గూడెం, నామాపూర్, పోత్గల్, తెర్లమద్ది, కొండాపూర్, గంభీరావుపేట మండలం సముద్రలింగాపూర్, నర్మాల మల్లారెడ్డిపేట, మల్లుపల్లె, చందుర్తి, రుద్రంగి, ఎల్లారెడ్డిపేట మండలాల్లోనూ వడగండ్ల వర్షానికి రైతులు నష్టాన్ని చవిచూశారు. యాసంగి దిగుబడి ఆశాజనకంగా ఉండడంతో రైతులు అనందంలో ఉన్నా వడగళ్ల వర్షం భయపెడుతోంది.
ధాన్యం కొనుగోలు 31,780 మెట్రిక్ టన్నులు
జిల్లాలో యాసంగిలో 1.65 లక్షల ఎకరాల్లో వరిసాగు చేశారు. దీని ద్వారా 4.17 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇందులో పౌర సరఫరాల శాఖ 3.50 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు 4255 మంది రైతుల నుంచి 31,780 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇందులో ఐకేపీ ద్వారా 6,966 మెట్రిక్ టన్నులు, సింగిల్ విండోల ద్వారా 24,094 మెట్రిక్ టన్నులు, డీసీఎంస్ ద్వారా 1313మెట్రిక్ టన్నులు, మెప్మా ద్వారా 298 మెట్రిక్ టన్నులు, మార్కెట్ యార్డుల ద్వారా 1108 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. 28507 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని గోదాములకు తరలించారు. తూకం వేయకుండా రైతులు ఆరబెట్టుకున్న ధాన్యం భారీగానే ఉంది. జిల్లాలో ప్రస్తుతం 4255 మంది రైతుల నుంచి రూ.60 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేయగా రూ.11.07 కోట్లు చెల్లించారు. కొనుగోళ్లు వేగవంతం చేయకపోతే అకాల వర్షాలకు నష్టపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు.