న్యూ ఇయర్‌ వేడుకలకు సిద్ధం

ABN , First Publish Date - 2021-12-31T05:17:38+05:30 IST

నూతన సంవత్సరం వేడుకలకు జిల్లా వ్యాప్తంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

న్యూ ఇయర్‌ వేడుకలకు సిద్ధం

 - పొంచి ఉన్న కరోనా, ఒమైక్రాన్‌ ముప్పు

- జాగ్రత్తలు పాటించాలంటున్న నిపుణులు, వైద్యులు

కరీంనగర్‌ కల్చరల్‌, డిసెంబరు 30:  నూతన సంవత్సరం వేడుకలకు జిల్లా వ్యాప్తంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. గృహాలలో రంగుల హరివిల్లులను దింపడానికి మహిళలు రకరకాల రంగుల కొనుగోళ్ళలో నిమగ్నమైతే యువతీ యువకులు, విద్యార్థులు తమ ఆత్మీయులకు శుభాకాంక్షలు తెలుపడానికి గ్రీటింగ్‌కార్డులు కొంటున్నారు. మరికొందరైతే తమ గృహాల్లో, స్నేహితుల ఇండ్లలో విందులు, వినోదాలు నిర్వహించే ఏర్పాట్లలో పడ్డారు. వ్యాపార సంస్థలు, గృహాలను, హోటళ్లను విద్యుద్దీపాలతో అలంకరించుకుంటున్నారు. వేడుకలను అందరి మధ్య జరుపుకోవడానికి పలు ప్రాంతాల్లో ఉన్న కుటుంబ సభ్యులు ఒక్క చోట చేరుకుంటున్నారు. కేకులు కట్‌చేయడం ఆనవాయితీ కాగా పలు బేకరీలు విభిన్న కేకులను సిద్ధం చేశాయి. 

- మాస్కులు తప్పనిసరి.. 

కరోనా సెకండ్‌వేవ్‌ తీవ్రత అనంతరం ఉత్పన్నమైన ఒమైక్రాన్‌తో పాటు కరోనా ముప్పు కూడా పొంచి ఉన్నందున అవకాశాలను అదనుగా తీసుకొని విశృంఖలంగా వ్యవహరిస్తే ప్రమాదాలు తప్పవని ఆయా రంగాల నిపుణులు, వైద్యులు హెచ్చరిస్తున్నారు. జాగ్రత్తలు విధిగా పాటించాల్సిందేనని స్ఫష్టం చేస్తున్నారు. మాస్కులు తప్పనిసరి ధరించాలని పోలీసులు, వైద్యులు చెబుతున్నారు. 

-  భారీ బందోబస్తు...

మద్యం షాపులకు రాత్రి 12 వరకు అనుమతి ఇవ్వడంతో పాటు లైసెన్స్‌డ్‌ హోటళ్లలో వేడుకలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు. ప్రధాన కూడళ్లతో పాటు రహదారుల వెంబడి పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి మందుబాబులు, పోకిరీల భరతం పట్టనున్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీల సందర్భంగా వాహనాలు, వ్యక్తిగత సంబంధ ఋజువు పత్రాలు వెంబడి ఉంచుకోవాలని సూచిస్తున్నారు. 

Updated Date - 2021-12-31T05:17:38+05:30 IST