ఎమ్మెల్సీ ఎన్నికలకు సిద్ధం
ABN , First Publish Date - 2021-12-09T06:47:28+05:30 IST
ల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు అధికారులు ఏర్పాట్లు చేపడతున్నారు. కలెక్టర్ గుగులోతు రవినాయక్, ఎస్పీ సింధుశర్మ అధికారులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు.

- జగిత్యాల, కోరుట్లలో పోలింగ్ స్టేషన్లు
- ఏర్పాట్లు చేపడుతున్న అధికారులు
జగిత్యాల, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు అధికారులు ఏర్పాట్లు చేపడతున్నారు. కలెక్టర్ గుగులోతు రవినాయక్, ఎస్పీ సింధుశర్మ అధికారులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. ఈ నెల 10వ తేదీన ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పోలింగ్‌ను పారదర్శకంగా, ప్రశాంతంగా పూర్తి చేయడానికి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జిల్లాలో రెండు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం, కోరుట్ల మండల పరిషత్ కార్యాలయంలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.
జిల్లాలో 366 మంది ఓటర్లు
జగిత్యాల జిల్లాలోని 18 మండలాలు, 5 మున్సిపాలిటీల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా 366 మంది ఓటరు జాబితాలో ఉన్నారు. ఇందులో 158 మంది స్త్రీలు, 208 మంది పురుషులు ఉన్నారు. జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, ధర్మపురి, రాయికల్ పట్టణాలకు చెందిన మున్సిపల్ కౌన్సిలర్లు 134 మంది, 18 మంది జడ్పీటీసీ సభ్యులు, 210 మంది ఎంపీటీసీ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అదే విధంగా ఎక్స్అఫీషియో సభ్యులుగా నమోదు చేసుకున్న ఇతర సభ్యులు సైతం ఓటు హక్కును వినియోగంచుకునే అవకాశం ఉంది. జగిత్యాల పోలింగ్ స్టేషన్లో 220 మంది ఓటర్లుండగా ఇందులో 96 మంది పురుషులు, 124 మంది మహిళలున్నారు. కోరుట్ల పోలింగ్ స్టేషన్లో 146 మంది ఓటర్లుండగా 62 మంది పురుషులు, 84 మంది మహిళలున్నారు. జగిత్యాల పోలింగ్స్టేషన్లో 75 మంది మున్సిపల్ కౌన్సిలర్లు, 12 మంది జడ్పీటీసీ సభ్యులు, 130 మంది ఎంపీటీసీ సభ్యులు, 3 మంది ఎక్స్అఫిషియో సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అదే విధంగా కోరుట్ల పోలింగ్స్టేషన్లో 59 మంది మున్సిపల్ కౌన్సిలర్లు, 6 గురు జడ్పీటీసీ సభ్యులు, 80 మంది ఎంపీటీసీ సభ్యులు, ఒక్కరు ఎక్స్ అఫిషియో సభ్యుడు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
రెండు పోలింగ్ స్టేషన్లు
జిల్లాలోని జగిత్యాల, కోరుట్లలో పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. జగిత్యాల పోలింగ్ స్టేషన్లో జగిత్యాల, జగిత్యాల రూరల్, రాయికల్, మల్యాల, కొడిమ్యాల, పెగడపల్లి, వెల్గటూరు, గొల్లపల్లి, ధర్మపురి, బుగ్గారం, బీర్పూర్, సారంగపూర్‌కు చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుంది. కోరుట్ల పోలింగ్ స్టేషన్లో కోరుట్ల, మెట్పల్లి, మల్లాపూర్, ఇబ్రహీపట్నం, కథలాపూర్ మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికకు కరీంనగర్ కలెక్టర్ రిటర్నింగ్ అధికారిగా ఉంటారు. జగిత్యాలకు అడిషనల్ కలెక్టర్ స్థాయి అధికారిని అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా నియమించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రం, రిసెప్షన్ కేంద్రం, కౌంటింగ్ కేంద్రం కరీంనగర్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల భవనాన్ని అధికారులు ప్రతిపాదించారు. బ్యాలెట్ బాక్స్‌లను భద్రపరచడానికి స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేశారు. పోలింగ్‌కు 72 గంటల ముందు నుంచి ఇతరులు జిల్లాలో ఉండకుండా జాగ్రత్తలు వహిస్తున్నారు. నిర్ణీత గడువు సమయం నుంచి మద్యం అమ్మకాలను నిలిపివేశారు. జిల్లాలోని మద్యం దుకాణాలను మూసివేశారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను రాజకీయ పక్షాలు, అభ్యర్థులు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
పోలింగ్ స్టేషన్లోకి ఓటర్లు సెల్‌ఫోన్ తీసుకవెళ్లడాన్ని నిషేధించారు. ఓటర్లు తప్పనిసరిగా గుర్తింపు కార్డు వెంట తీసుకవెళ్లాల్సి ఉంటుంది. భారత ఎన్నికల సంఘం ఆమోదించిన జాబితాలో గల ఏదేని ఒక ఫొటో గుర్తింపు కార్డు ఉంటేనే ఓటు వినియోగించుకునేలా అధికారులు అనుమతి ఇస్తారు.
కొవిడ్ నిబంధనలు అమలు
పోలింగ్ కేంద్రాల్లో కొవిడ్ నిబంధనలు పక్కాగా అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం, శానిటైజర్లు వినియోగించడం, థర్మామీటరుతో టెంపరేచర్ పరీక్షించడం, డిస్పోజల్ గ్లౌస్‌లను అందుబాటులో ఉంచడం, భౌతిక దూరం పాటించడం, పోలింగ్ స్టేషన్‌ను శానిటైజ్ చేయడం వంటివి చేస్తున్నారు. కొవిడ్ పాజిటివ్ ఓటర్లు వచ్చినట్లయితే పీపీఈ కిట్స్ ధరించడం, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం వంటివాటిపై అధికారులు దృష్టి సారిస్తున్నారు.
పకడ్బందీగా పోలింగ్‌కు చర్యలు
- గుగులోతు రవినాయక్, కలెక్టర్
జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల మండల పరిషత్ కార్యాలయ భవనాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్లలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించనున్నాం. భారత ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా, పకడ్బందీగా, ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి సిద్దంగా ఉన్నాం.