కేసీఆర్‌ ఉక్కుపాదం పెట్టినా ప్రజలకు నా మీద ప్రేమ తగ్గలేదు

ABN , First Publish Date - 2021-10-18T05:51:45+05:30 IST

‘కేసీఆర్‌ ఉక్కుపాదం పెట్టినా హుజూరాబాద్‌ నియోజకవర్గ ప్రజలకు నా మీద ప్రేమ తగ్గలేదు’ అని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ అన్నారు.

కేసీఆర్‌ ఉక్కుపాదం పెట్టినా ప్రజలకు  నా మీద ప్రేమ తగ్గలేదు
హుజూరాబాద్‌ మండలం పోతిరెడ్డిపేటలో ప్రజలకు అభివాదం చేస్తున్న బీజేపీ నేత ఈటల రాజేందర్‌

- తడిసిన ప్రతి గింజను ప్రభుత్వం కొనాలి

- మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌

హుజూరాబాద్‌, అక్టోబరు 17: ‘కేసీఆర్‌ ఉక్కుపాదం పెట్టినా హుజూరాబాద్‌ నియోజకవర్గ ప్రజలకు నా మీద ప్రేమ తగ్గలేదు’ అని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ అన్నారు. ఆదివారం హుజూరాబాద్‌ మండలం పోతిరెడ్డిపేట, వెంకట్రావ్‌పల్లి, సిర్సపల్లి, రాంపూర్‌, రంగాపూర్‌, బోర్నపల్లి, ఇప్పల్‌నర్సింగాపూర్‌లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలన్నారు. ప్రభుత్వానికి వడ్లు కొనడానికి చేత కావడం లేదన్నారు. మంత్రులంతా ఇక్కడ ఉండి సిగ్గుమాలిన పనులు చేస్తున్నారన్నారు. తాను అభివృద్ధి చేయలేదు అనడం పచ్చి అబద్ధమని, ఉద్యమ ద్రోహులు ఇక్కడికి వచ్చి ఉద్యమకారుడి మీద విమర్శలు చేస్తున్నారన్నారు. తన రాజీనామాతోనే హుజూరాబాద్‌లో అన్ని వస్తున్నాయన్నారు. రాష్ట్రంలో బాగా డబ్బులున్న మాట నిజమే అయితే ఎందుకు నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. తన రాజీనామాతో దళితులకు, మహిళలకు న్యాయం జరిగిందన్నారు. తాను గల్లి లీడర్‌ను కాదని, తెలంగాణ గర్వించే బిడ్డగా ఉంటానని మాట ఇస్తున్నానన్నారు.

ఫ ప్రశ్నించే వాడు ఉండకూడదని కేసీఆర్‌ ఆలోచన

- బీజేపీ మధ్యప్రదేశ్‌ ఇన్‌చార్జి మురళీధర్‌రావు

కుటుంబ పాలన ఉండాలంటే ప్రశ్నించే వాడు ఉండకూడదనేది కేసీఆర్‌ ఆలోచన అని బీజేపీ మధ్యప్రదేశ్‌ ఇన్‌చార్జి మురళీధర్‌రావు అన్నారు. హుజూరాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని బోర్నపల్లిలో ఈటల రాజేందర్‌తో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం అంతా హుజూరాబాద్‌లోనే పని చేస్తుందన్నారు. ఈటల రాజేందర్‌ హుజూరాబాద్‌ ప్రజల మీద నమ్మకంతో కేసీఆర్‌ మీద యుద్ధం ప్రకటించారన్నారు. ప్రజాస్వామ్య విలువలు కాపాడడం కోసం, కుటుంబ పాలన అంతం కోసం ఈటల రాజేందర్‌ గెలిపించాలన్నారు. కేసీఆర్‌ను ఎదిరించే పార్టీ బీజేపీ అన్నారు.

Updated Date - 2021-10-18T05:51:45+05:30 IST