కలగానే పెద్దపల్లి బస్ డిపో
ABN , First Publish Date - 2021-08-15T06:15:49+05:30 IST
పెద్దపల్లి బస్‌డిపో ఏర్పాటు కలగానే మిగిలిపోతోంది.
- జిల్లాగా ఏర్పడినా ఊసే లేదు
- పట్టించుకోని ప్రజాప్రతినిధులు
- నెరవేరని దశాబ్దాల కల
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
పెద్దపల్లి బస్‌డిపో ఏర్పాటు కలగానే మిగిలిపోతోంది. పెద్దపల్లి జిల్లా కేంద్రం కావడం, లోక్‌సభ నియోజకవర్గ కేంద్రంగా ఉండడం, రైల్వే జంక్షన్ ఉన్నా కూడా ఇక్కడ ఆర్టీసీ బస్ డిపో మాత్రం ఏర్పాటు కావడం లేదు. మూడు దశాబ్దాలుగా ఇక్కడ బస్ డిపోను ఏర్పాటుచేయాలని జిల్లా ప్రజానీకం కోరుతున్నా ప్రభుత్వం గానీ, ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదు. రెండుసార్లు ఇక్కడ బస్ డిపో ఏర్పాటుకు మంజూరైనా రద్దుచేసి ఒకసారి గోదావరిఖనిలో, మరొకసారి మంథనిలో డిపోను ఏర్పాటుచేశారు. జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు గోనె ప్రకాశరావు, సోమారపు సత్యనారాయణ ఆర్టీసీ చైర్మన్లుగా పదవీ బాధ్యతలు నిర్వహించినప్పటికీ పెద్దపల్లిలో బస్ డిపోను ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాక ముందు తెలంగాణ ప్రాంతంలో 97 బస్ డిపోలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా మెదక్ జిల్లా నర్సాపూర్‌లో, నారాయణపేట్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని కోస్గిలో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఆర్టీసీ బస్ డిపోలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం జిల్లాలో గోదావరిఖని, మంథనిలో ఆర్టీసీ బస్ డిపోలు ఉన్నాయి. పెద్దపల్లి పట్టణం జిల్లాకు మధ్యలో ఉంటుంది. ఇక్కడ ఉన్న రైల్వే జంక్షన్‌లో న్యూఢిల్లీ వైపునకు, సికింద్రాబాద్, చెన్నై వైపునకు వెళ్లేందుకు అనేక ఎక్స్‌ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లు ఆగుతుంటాయి. కానీ పెద్దపల్లిలో బస్ డిపో లేని కారణంగా వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేందుకు, ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత 3 దశాబ్దాలుగా ఇక్కడ బస్ డిపోను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉన్నది. రెండుసార్లు బస్ డిపో మంజూరైనా స్థలం లేదనే కారణంగా రద్దు చేశారని ప్రజలు చెబుతున్నారు.
పట్టించుకోని ప్రజాప్రతినిధులు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాలు, రాజన్న సిరిసిల్ల, వేములవాడ పట్టణాలు పక్క పక్కనే ఉన్నా కూడా ఆర్టీసీ బస్ డిపోలను ఏర్పాటు చేశారు. కరీంనగర్‌లో రెండు డిపోలను నడిపిస్తున్నారు. పెద్దపల్లి నుంచి గోదావరిఖని 25 కిలోమీటర్లు, మంథని 32 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. అయినా కూడా ఇక్కడ బస్ డిపో ఏర్పాటు చేయడం లేదు. పెద్దపల్లి జిల్లాగా ఏర్పాటై 4 సంవత్సరాల 10 నెలలు గడుస్తున్నది. కానీ ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వైఎస్‌ఆర్ సీఎంగా ఉన్నప్పుడు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు ఆర్టీసీ చైర్మన్‌గా పని చేశారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రామగుండం మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఆర్టీసీ చైర్మన్‌గా పనిచేశారు. కానీ వీరిద్దరు కూడా జిల్లాకేంద్రంలో బస్ డిపో ఏర్పాటు కోసం కృషి చేయలేదనే విమర్శలున్నాయి. పెద్దపల్లి ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచిన దాసరి మనోహర్‌రెడ్డి సైతం ఇక్కడ బస్ డిపో ఏర్పాటుకు కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. అయినా ఇక్కడ బస్ డిపో ఏర్పాటు కావడం లేదు. బస్ డిపో లేకపోవడంతో ధర్మారం మీదుగా జగిత్యాల జిల్లాకు వెళ్లేందుకు, కాల్వశ్రీరాంపూర్, ఓదెల, ఎలిగేడు, జూలపల్లి, తదితర మండలాల్లోని గ్రామాలకు వెళ్లేందుకు ప్రజలు ఆటోల్లోనే ప్రయాణిస్తున్నారు. అడపా, దడపా గోదావరిఖని డిపో బస్సులు నడుస్తున్నాయి. కరీంనగర్‌లో ఉన్న రెండు డిపోల్లో ఒక దానిని మూసి వేసి, ఆ డిపోను పెద్దపల్లి ఏర్పాటు చేస్తే ఆర్టీసీకి పెద్దగా నష్టమేమి ఉండదని ప్రజలు అంటున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి ఆర్టీసీ బస్సు డిపోను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.