శాంతి భద్రతలకు ప్రథమ ప్రాధాన్యం

ABN , First Publish Date - 2021-08-10T06:20:41+05:30 IST

కమిషనరేట్‌ పరిధిలో శాంతి భద్రతలకే ప్రథమ ప్రాధాన్యం ఇస్తామని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు.

శాంతి భద్రతలకు ప్రథమ ప్రాధాన్యం
మాట్లాడుతున్న సీపీ

- తరచూ నేరాలకు పాల్పడే వారిపై పీడీ యాక్టు 

- సిబ్బందిపై అవినీతి ఆరోపణలు వస్తే వేటే 

- ‘ఆంధ్రజ్యోతి’తో రామగుండం సీపీ చంద్రశేఖర్‌రెడ్డి

కోల్‌సిటీ, ఆగస్టు 9: కమిషనరేట్‌ పరిధిలో శాంతి భద్రతలకే ప్రథమ ప్రాధాన్యం ఇస్తామని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. నూతన పోలీస్‌కమిషనర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. రామగుండం కమిషనరేట్‌ ప్రాంతం పరిశ్రమలకు నిలయమని, ఎన్నో వేల మంది ఉపాధి పొందుతున్నారని, శాంతి భద్రతల పరంగా కీలకమైనదన్నారు. మొదట కమిషనరేట్‌ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితును అవగతం చేసుకుంటానని, ఏయే ప్రాంతాల్లో ఏ తరహా నేరాలు జరుగుతున్నాయనే విషయంపై పరిశీలిస్తానని సీపీ పేర్కొన్నారు. సాంఘిక దురాచారాలు అయిన గంజాయి రవాణా, వాడకం, గుట్కా, జూదం, గ్యాబ్లింగ్‌లపై కఠిన చర్యలు తీసుకుంటామని, వీటిని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదన్నారు. భూ వివాదాలకు సంబంధించి గొడవలు పడితే సహించేది లేదని, తీవ్ర నేరాలు జరుగకుండా కట్టడి చేస్తామన్నారు. వివాదాలకు ప్రాథమిక దశలోనే పరిశీలన చేస్తామని తీవ్రత ఎక్కువగా కాకుండా న్యాయస్థానాల ద్వారా పరిష్కారమయ్యేలా సూచన చేస్తామన్నారు. పోలీస్‌ స్టేషన్‌లలో భార్యభర్తల గొడవలు, ఇతర సివిల్‌ విషయాలు, భూ వివాదాలపై కౌన్సెలింగ్‌ నిర్వహి స్తామే తప్ప సెటిమెంట్లకు తావులేదన్నారు.   షీ టీమ్‌లు మరింత సమర్థవంతంగా పని చేసేలా చూస్తామన్నారు. పోలీసులు సివిల్‌ వివాదాలు, కోర్టుల పరిధిలోని వివాదాల్లో తలదూర్చితే కఠినచర్యలు తీసుకుంటామన్నారు. సిబ్బంది, అధికారులు అవినీతికి పాల్పడితే ఉపేక్షించేది లేదని, వేటు వేస్తామన్నారు. పద్దతులు మార్చుకోకుండా తరచూ నేరాలకు పాల్పడే వారిపై పీడీ యాక్టు నమో దు చేస్తామన్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రతి సోమవారం గ్రీవెన్స్‌ సెల్‌ ఏర్పాటు చేస్తామని, ప్రజలకు అందుబాటులో ఉండనున్నట్టు చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. 

Updated Date - 2021-08-10T06:20:41+05:30 IST