నేరాలను అరికట్టేందుకు ‘ఆపరేషన్ చబుత్రా’
ABN , First Publish Date - 2021-07-08T06:26:00+05:30 IST
జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎస్పీ సింధు శర్మ ఆధ్వర్యంలో నేరాలను అరికట్టేందుకు ఆపరేషన్ చబుత్రా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

- జగిత్యాలలో అమలు చేస్తున్న పోలీసులు
- అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు
- పట్టుబడ్డ యువకులతో పాటు తల్లిదండ్రులకు కౌన్సెలింగ్
జగిత్యాల టౌన్, జూలై 7: జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎస్పీ సింధు శర్మ ఆధ్వర్యంలో నేరాలను అరికట్టేందుకు ఆపరేషన్ చబుత్రా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అర్ధరాత్రి రోడ్లపై అనవసరంగా తిరుగుతూ, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారికి చెక్ పెట్టేందుకు చర్యలు చేపట్టారు.
- యువతే లక్ష్యంగా..
శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు చర్యలు చేపడుతుంటే మరో వైపు ఆకతాయి యువకులు మద్యం, గంజాయి మత్తులో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. అర్ధరాత్రి ఫ్యాషన్‌గా బైకులపై తిరుగుతూ ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఫుట్ పాత్‌లు, ప్రధాన కూడళ్లు, వీదుల్లో జులాయిలుగా అనుమానాస్పదంగా తిరుగుతూ చట్ట వ్యతిరేక పనులు చేస్తున్నారు. ఇలాంటి ఆకతాయి యువకుల పనిపట్టేందుకు జిల్లా పోలీస్ శాఖ ఆపరేషన్ చబుత్రా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. చట్టవ్యతిరేక పనులు చేసే యువతను పట్టుకుని వారికి, తల్లిదుండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు.
- అర్ధరాత్రి తర్వాత స్పెషల్ డ్రైవ్‌లు..
జిల్లా కేంద్రంలో ఇటీవల రెండు రోజలు వ్యవధిలో అర్ధరాత్రి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న ఓ యువకుడిపై 10 మంది దాడి చేశారు. పట్టణ పోలీసులు వారిని గుర్తించి కేసులు నమోదు చేశారు. ఈ ఘటన జరిగిన మరుసటి రోజే పట్టణంలోని గాంధీనగర్‌లో ఓ ఇంటి ముందు కొంత మంది యువకులు అడ్డాలు పెట్టడం దీనిని వ్యతిరేకించిన వ్యక్తిని అడ్డాలు పెట్టిన యువకులు నెట్టివేయడంతో ఆ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనలను సీరియస్‌గా తీసుకున్న ఎస్పీ అర్ధరాత్రి స్పెషల్ డ్రైవ్‌లు చేపట్టేలా చర్యలు తీసుకున్నారు. పోలీస్ శాఖలో హైదరాబాద్ ప్రాంతంలో అమలవుతున్న ఆపరేషన్ చబుత్రా కార్యాక్రమాన్ని జిల్లా కేంద్రంలో చేపట్టారు. జిల్లా కేంద్రంలోని పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇక అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు పోలీస్ బలగాలు రహదారులపై పహారా కాస్తూ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే యువకులకు చెక్ పెట్టనున్నారు.
- పట్టు బడ్డ 30 మంది యువకులు..
ఆపరేషన్ చబుత్రా కార్యాక్రమాన్ని చేపట్టిన జగిత్యాల పోలీసులకు తొలిరోజు ఆదివారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత 30 మంది యువకులు పోలీసులకు పట్టుబడ్డారు. వీరంతా 35 సంవత్సరాల లోపు యువకులు కావడం, ర్యాష్ డ్రైవింగ్‌లు చేయడం, ప్రధాన కూడళ్ల వద్ద అడ్డాలు వేసే వారే ఉన్నారు. పట్టుబడ్డ యువకుల బైక్‌లతో పాటు, సెల్‌పోన్లను సీజ్ చేశారు. పట్టణ న్యూసెన్స్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మరుసటి రోజు వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు.
యువకులు భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దు
సింధు శర్మ, ఎస్పీ, జగిత్యాల జిల్లా
అసాంఘిక కార్యకలాపాలకు ఎవరూ పాల్పడవద్దు. ముఖ్యంగా యువకులు తమ బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దు. తల్లిదండ్రులు పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలి. జగిత్యాల పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆపరేషన్ చబుత్రా అమలులో ఉంది. పోలీసుల ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్‌లు ఉంటాయి. న్యూసెన్స్ ఆక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేస్తాం.