కొనసాగుతున్న ఇంటింటి సర్వే

ABN , First Publish Date - 2021-05-14T05:28:23+05:30 IST

కరోనా వ్యాధి లక్షణాలుగల వారిని గుర్తించేందుకు జిల్లాలో ఇంటింటి సర్వే కొనసాగుతున్నది.

కొనసాగుతున్న ఇంటింటి సర్వే
జూలపల్లిలో ఇంటింటా సర్వే చేస్తున్న అధికారులు, ఆరోగ్య కార్యకర్తలు(ఫైల్‌)

- జిల్లా వ్యాప్తంగా 425 బృందాల ఏర్పాటు

- జిల్లాలో 2,954 మందికి కరోనా లక్షణాలు

- ఇప్పటివరకు 2,06,617 గృహాల్లో పూర్తి

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

కరోనా వ్యాధి లక్షణాలుగల వారిని గుర్తించేందుకు జిల్లాలో ఇంటింటి సర్వే కొనసాగుతున్నది. ఇప్పటివరకు 2954 మందికి వ్యాధి లక్షణాలున్నాయని సర్వేలో తేలింది. వీరందరికి కరోనా మందుల కిట్లను అందజేశారు. వీరికి పరీక్షలు చేయకున్నా మందులు వాడాలని సూచిస్తున్నారు. జిల్లాలోని రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌, మంథని, పెద్దపల్లి, సుల్తానాబాద్‌ మున్సిపాలిటీలతో పాటు 266 గ్రామపంచాయతీల పరిధిలో ఈ సర్వేను చేపడుతున్నారు. గ్రామ కార్యదర్శి, ఏఎన్‌ఎం, ఆశా వర్కర్‌, అంగన్‌వాడీ టీచర్లను కలిపి సర్వే బృందాలుగా నియమించారు. జిల్లా వ్యాప్తంగా 425 బృందాలను ఏర్పాటు చేశారు. క్షేత్రస్థాయిలో సర్వేను మండల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్‌ కమిషనర్లు పర్యవేక్షిస్తున్నారు. వెయ్యి కుటుంబాలకు ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. వీరంతా తమకు కేటాయించిన ఇళ్లళ్లకు వెళ్లి ఎంత మంది నివసిస్తున్నారు..? ఎవరెవరికి వ్యాధి లక్షణాలున్నాయి..? ఎవరైనా కరోనాతో బాధపడుతున్నారా..? తదితర వివరాలను సేకరిస్తున్నారు. జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలతో బాధపడుతున్న వారికి ముందస్తుగా కరోనా కిట్‌ను అందజేస్తున్నారు. కిట్‌లో ఉండే మందులను వాడాలని సూచిస్తున్నారు. 14 రోజుల వరకు బయటకు వెళ్లవద్దని చెబుతున్నారు. వారంతా ఇంటింటికి తిరుగుతున్నారు. నాలుగు రోజులుగా ఎండలు దంచుతుండడంతో సర్వేలో జాప్యం జరుగుతున్నది. జిల్లాలో ఇప్పటివరకు 2,06,617 గృహాలకు వెళ్లి సర్వే చేశారు. ఈ సర్వేలో 2,954 మందికి కరోనా వ్యాధి లక్షణాలు ఉన్నట్లుగా గుర్తించారు. జిల్లాలో గత నెలరోజుల నుంచి కరోనా పెద్దఎత్తున విజృంభిస్తున్నది. గురువారం 365 మందికి కరోనా సోకగా, ఐదుగురు మృతిచెందారు. కేసుల సంఖ్య 16,185కు చేరింది. ఇందులో 130మందికి పైగా మరణించగా, 3వేల మందికి పైగా వివిధ ఆసుపత్రులు, హోంఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. కరోనా టెస్టులను తగ్గించడంతో కేసులు బయటపడడం లేదు. రోజుకు జిల్లా ఆసుపత్రి పెద్దపల్లి, ఏరియా ఆసుపత్రులు గోదావరిఖని, మంథనిలో 100కు మించకుండా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 50కి మించకుండా పరీక్షలు చేయాలని నిబంధన విధించింది. దీంతో కేసుల సంఖ్య తెలియడం లేదు. అయినా కూడా సెలవు దినాల్లో మినహా రోజుకు 350 నుంచి 500 వరకు కేసులు నమోదవుతున్నాయంటే వైరస్‌ వ్యాప్తి తీవ్రత జిల్లాలో బాగానే ఉన్నది. అదుపులోకి రావడంలేదు. గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో రోజుకు 150 నుంచి 200 మంది వరకు కరోనా బారినపడుతున్నారు. ఇక్కడ మరణాలు కూడా ఎక్కువగానే సంభవిస్తున్నాయి. దీనిని కంట్రోల్‌ చేయడానికి ఇంటింటి సర్వే చేపట్టారు. ఈ సర్వేలో వ్యాధి లక్షణాలు ఉన్న వారందరికీ కరోనా కిట్లను అందజేస్తున్నారు. మరో మూడు, నాలుగు రోజుల్లో సర్వే పూర్తి కానున్నదని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ ప్రమోద్‌ కుమార్‌ తెలిపారు. 

Updated Date - 2021-05-14T05:28:23+05:30 IST