నోట్లు, ఓట్లు, సీట్లే టీఆర్‌ఎస్ టార్గెట్
ABN , First Publish Date - 2021-12-26T05:49:14+05:30 IST
టీఆర్‌ఎస్ నాయకులు నోట్లు, ఓట్లు, సీట్లే ప్రధాన ఎజెండాగా పనిచేస్తున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ అన్నారు.

- బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్
గణేశ్‌నగర్, డిసెంబరు 25: టీఆర్‌ఎస్ నాయకులు నోట్లు, ఓట్లు, సీట్లే ప్రధాన ఎజెండాగా పనిచేస్తున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ అన్నారు. శనివారం నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కల్లబొల్లి మాటలతో రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్ రైతులను తప్పుదోవ పట్టిస్తున్నందున రాబోయే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఇంటికి వెళ్లక తప్పదన్నారు. ధాన్యం కొనుగోలు చేయక రాష్ట్ర రైతాంగం ఇబ్బందులు పడుతుంటే ఎమ్మెల్సీలను గెలిపించుకునేందుకు తమ పార్టీ ప్రజాప్రతినిధులను గోవా టూర్‌లకు తీసుకెళ్లారన్నారు. పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతుంటే ఓవైపు ధాన్యం కొనుగోలు చేయాలంటూ రాష్ట్ర మంత్రివర్గం ఢిల్లీ వెళ్లడం సిగ్గుచేటని, రైతుల ఆందోళన పక్కదారి పట్టించి సొంత పనులు చేసుకునేందుకే మంత్రులు ఢిల్లీ టూర్ అని విమర్శించారు. యాసంగిలో వరిధాన్యం సాగు చేయమంటూ కేంద్రానికి లేఖ రాసి ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం, ధాన్యం కొనుగోలు చేయాలంటూ కేంద్రాన్ని డిమాండ్ చేయడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. ఒప్పందం మేరకు బియ్యం సరఫరా చేయలేక నాలుగుసార్లు గడువు పొడగించిన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రాన్ని బదనాం చేసేందుకు ఐకేపీ కేంద్రాలను ఎత్తివేసిందని ఆరోపించారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదాన్ని అటకెక్కించిన ముఖ్యమంత్రికి కనువిప్పు కలిగించేందుకు బీజేపీ ఆధ్వర్యంలో నిరుద్యోగుల కోసం దీక్ష చేపట్టబోతున్నామన్నారు. అధికారం చేపట్టిన తొలినాళ్లలో రాష్ట్రంలో 1,95,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయంటూ అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటన ఏమైందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు తాళ్లపల్లి శ్రీనివాస్, వాసుదేవరెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ దుబాల శ్రీనివాస్, సౌత్ జోన్ అధ్యక్షుడు నాగసముద్రం ప్రవీణ్‌కుమార్, కార్పొరేటర్లు కాసర్ల ఆనందం, కచ్చు రవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు సోమిడి వేణుప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.