కరోనా ఘోష

ABN , First Publish Date - 2021-05-18T05:40:43+05:30 IST

కరోనా దాటికి పల్లెలు, పట్టణాలు వణికిపోతున్నాయి. మరణఘోషను వినిపిస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొవిడ్‌ మొదలైన నాటి నుంచి అఽధికారిక లెక్కల ప్రకారమే 339 మంది మృతి చెందారు. సెకండ్‌ వేవ్‌లో ఈ నెల 17 రోజుల్లోనే 122 మంది మరణించారు. నిత్యం పది మంది వరకు మృతి చెందుతున్నారు.

కరోనా ఘోష

- ఆగని  మరణాలు 

- అధికారిక లెక్కల ప్రకారం 17 రోజుల్లో 122 మంది మృతి

- అనధికారికంగా రెండింతలు 

- జిల్లాలో 342 మంది మృతి

- తాజాగా బాలింత సహా ఐదుగురి మృతి

- కరోనాకు తోడు బ్లాక్‌ఫంగస్‌ భయం 

- జిల్లాలో ఇద్దరికి నిర్ధారణ 

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

కరోనా దాటికి పల్లెలు, పట్టణాలు వణికిపోతున్నాయి. మరణఘోషను వినిపిస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొవిడ్‌ మొదలైన నాటి నుంచి అఽధికారిక లెక్కల ప్రకారమే 339 మంది మృతి చెందారు. సెకండ్‌ వేవ్‌లో ఈ నెల 17 రోజుల్లోనే 122 మంది మరణించారు. నిత్యం పది మంది వరకు మృతి చెందుతున్నారు. లెక్కకు రానివి రెండింతలు ఉంటాయి. కొవిడ్‌ బారిన పడి హైదరాబాద్‌, కరీంనగర్‌ ఇతర ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ చనిపోయిన వారి సంఖ్య రికార్డుల్లోకి ఎక్కడం లేదు. కరోనా పరీక్షలు తగ్గించినా రోజు 36 శాతం వరకు పాజిటివ్‌ రేటు ఉంటోంది. వయస్సుతో నిమిత్తం లేకుండా మరణాలు సంభవిస్తున్నాయి.  రోజురోజుకు వైరస్‌ తీవ్రత పెరుగుతున్న చర్యలపై దృష్టి పెట్టకపోవడంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కొవిడ్‌ టెస్టులు తగ్గించడంతోపాటు కరోనా వచ్చిన వారు ఇళ్లలో ఉండకుండా తిరుగుతున్నారు. కనీసం వారిపై నిఘా పెట్టడం లేదు. మరోవైపు ఆక్సీజన్‌ కొరత బెడ్లు దొరకక విలవిల్లాడుతున్నారు. వెంటిలేటర్లు లేకపోవడంతో ఎంతోమంది చనిపోతున్నారు. కుటుంబీకులు, బంధువుల ఆర్థనాదాలు నిత్యం వినిపిస్తున్నాయి. జిల్లాలో కరోనా బాధితులు ఎక్కువగా భయానికి తోడు సకాలంలో వైద్యం అందకనే చనిపోతున్నారు. కరోనా మొదటి దశలో వయసు పైబడినవారు మాత్రమే ఇబ్బంది పడగా ప్రస్తుతం రెండో దశలో చిన్నారులు, యువకులు, వృద్ధులను సైతం మింగేస్తుంది. 

హృదయవిదారకం

మహమ్మారి ప్రభావంతో జిల్లాలో హృదయవిదారక మరణాలు సంభవిస్తున్నాయి. చందుర్తి మండలానికి చెందిన 29 సంవత్సరాల బాలింత కరోనాతో సోమవారం కరీంనగర్‌ ఆసుపత్రిలో మృతి చెందింది. పది రోజుల క్రితం మూడో కాన్పులో మగబిడ్డకు జన్మనిచ్చింది. కరోనా పాజిటివ్‌ రావడంతో కరీంనగర్‌లోని ఒక ప్రైవేట్‌ ఆస్పత్రిలో ప్రసవం చేశారు. ఆ తర్వాత కరోనా నుంచి కోలుకుంటుదన్న దశలో పరిస్థితి విషమించింది. కరీంనగర్‌లోని కార్పొరేట్‌ ఆస్పత్రిలకు వెళ్లగా బెడ్స్‌ ఖాళీ లేకపోవడంతో చివరకు కరీంనగర్‌ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు.  అప్పటికే పరిస్థితి విషమించడంతో మృతి చెందింది. ఇదిలా ఉంటే ముస్తాబాద్‌ మండలానికి చెందిన దేవయ్య అనే వృద్ధుడు జ్వరం, దగ్గుతో బాధపడ్డాడు. కరోనా వచ్చిందని తాను చనిపోతానని ఆందోళనతో ఉరేసుకున్నాడు.  చందుర్తిలో హోటల్‌ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న ఇంటి పెద్దతోపాటు కుటుంబ సభ్యులకు కరోనా సోకింది. చికిత్స పొందుతూ సిరిసిల్ల ఆస్పత్రిలో మృతి చెందాడు. చందాలు పోగుచేసి అంత్యక్రియలు చేశారు. 

 ఆగని కన్నీటి ధార  

కుటుంబాల్లో కన్నీటి ధారలు ఆగడం లేదు. కళ్లెదుటే ఆత్మీయులను కోల్పోయి తల్లడిల్లుతున్నారు.  ఒకే కుటుంబంలో వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. భార్యాభర్తలు, తండ్రీకొడుకు, తల్లీకొడుకు మృత్యువాత పడుతుండడంతో ఆ కుటుంబాలు తీరని దుఃఖంలో మునిగిపోతున్నాయి.  రుద్రంగి మండల కేంద్రంలో ఒకే ఇంటికి చెందిన ఊరటి భూమయ్య మల్లవ్వ దంపతులు ఇద్దరు కరోనాకు బలయ్యారు. చందుర్తి మండలం లింగంపేటలో ఒకే కుటుంబంలో నలుగురు కరోనా బారిన పడగా తమ్ముడు నారాయణ, అక్క లక్ష్మి మృతి చెందింది. ఇల్లంతకుంట మండలం గూడపుపల్లె గ్రామంలో తల్లి నర్సయ్య, కొడుకు చంద్రయ్య 15 రోజుల వ్యవధిలో మృతి చెందారు. కోనరావుపేట మండలం వెంకట్రావుపేటలో తల్లి రాజమ్మ, కొడుకు సత్తయ్య వారం రోజుల్లోనే మృతి చెందారు. బోయినపల్లి మండలం గుండన్నపల్లి గ్రామంలో ఒకే ఇంటిలో దంపతులు కాంతవ్వ, వీరేశంతోపాటు కొడుకు లక్ష్మణ్‌ మృతి చెందారు. అదే మండలంలో దుండ్రపెల్లిలో భార్యాభర్తలు మరణించారు. సిరిసిల్లలో అన్నదమ్ములు, భార్యభర్తలు మృతి చెందిన విషాద సంఘటనలు ఉన్నాయి. 

బ్లాక్‌ ఫంగస్‌ భయం

కరోనాతోనే కష్టాలు వెల్లదీస్తుంటే ప్రజలను మళ్లీ బ్లాక్‌ ఫంగస్‌ భయపెడుతోంది. జిల్లాలో కరోనా బారినపడి కోలుకున్న వారు 19,539 మంది ఉన్నారు.  కరోనా నుంచి కోలుకోవడానికి వాడిన స్టెరాయిడ్‌ మందులతో దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారిలో బ్లాక్‌ఫంగస్‌ బయటపడుతుండడంతో ఆందోళనలు మొదలయ్యాయి.  జిల్లాలో ఇద్దరికి బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలు బయటపడ్డాయి.  చందుర్తి మండలంలో ఒకరు, వేములవాడకు చెందిన మరో మహిళకు బ్లాక్‌ఫంగస్‌ లక్షణాలు ఉండడంతో హైదరాబాద్‌లో ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రోగ నిరోధక వ్యవస్థను అదుపు చేయడానికి వాడిన మందులతో కళ్లు, ముక్కు చుట్టూ ఎర్రబారడం, నొప్పి రావడం, పంటినొప్పి, చూపు మందగించడం, ముఖంలో ఒకవైపు నొప్పి, తిమ్మిరి, వాపు వంటి లక్షణాలు ఉంటే బ్లాక్‌ఫంగస్‌గా అనుమానించవచ్చని వైద్యులు పేరొకంటున్నారు. 

తాజాగా 223 మందికి పాజిటివ్‌

 జిల్లాలో సోమవారం 600 మందికి రాపిడ్‌ పరీక్షలు చేయగా 223 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. ఏడుగురు మృతి చెందారు. వేములవాడకు చెందిన 50 సంవత్సరాల వ్యక్తి, 80 సంవత్సరాల వృద్ధురాలు, గంభీరావుపేటకు చెందిన 70 సంవత్సరాల వృద్ధుడు, 60 ఏళ్ల వృద్దుడు, తంగళ్లపల్లి మండలానికి చెందిన 80 ఏళ్ల వృద్దుడు, ముస్తాబాద్‌కు చెందిన 55 ఏళ్ల వ్యక్తి సిరిసిల్ల ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సిరిసిల్లకు చెందిన 50 ఏళ్ల వ్యక్తి హైదరాబాద్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. జిల్లాలో ఇప్పటి వరకు 23,971 మంది కొవిడ్‌ బారిన పడగా 19,539 మంది కోలుకున్నారు. 4043 మంది చికిత్స పొందుతున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 339 మంది మృతి చెందారు. 


భవిష్యత్‌ ఆలోచిస్తే భయంగా ఉంది

- జెజ్జంకి సబిత, తిప్పాపూర్‌, ఇల్లంతకుంట మండలం

మా జీవితంలోకి మరొకరు వస్తున్నారానే సంతోషం ఎంతో కాలం నిలువలేదు. ఇంతలోనే కరోనా మహమ్మారి నాభర్త వెంకటేష్‌ను బలితీసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకొని 18 నెలలే గడిచాయి. ఇద్దరం పనిచేసుకొని బతికే వాళ్లం. భవిష్యత్‌ గురించి ఆలోచిస్తే భయంగా ఉంది. ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. పనిచేసుకుంటేనే పూట గడుస్తుంది. ఎన్నో ఆశలతో బతుకుతున్న మా జీవితాలను కరోనా ఛిద్రం చేసింది.


ఇంటికి పెద్దదిక్కును కోల్పోయాం 

- మాడిశెట్టి మహేష్‌, ఎన్గల్‌, చందుర్తి 

మా తండ్రి ఆనందంతో కలిసి హోటల్‌ నడుపుతూ కుటుంభాన్ని పోషించుకుంటున్నాం. కుటుంబంలో నలుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. సిరిసిల్ల ఆస్పత్రిలో మృతిచెందాడు. మృతదేహాన్ని గ్రామానికి తీసుకురానివ్వకుంటే సిరిసిల్లలోనే చందాలు పోగు చేసి అంత్యక్రియలు చేశారు. రూ.3 లక్షల దాకా చికిత్స కోసం అప్పులు చేశాం. ఇప్పుడు అప్పులతో ఇబ్బందులు పడుతూ కాలం వెల్లదీస్తున్నాం.


Updated Date - 2021-05-18T05:40:43+05:30 IST