జగిత్యాలలో ‘నో హెల్మెట్‌- నో పెట్రోల్‌’

ABN , First Publish Date - 2021-02-08T06:08:56+05:30 IST

జగిత్యాల జిల్లా వ్యాప్తంగా సోమ వారం నుంచి వాహనచోదకులకు హెల్మెట్‌ లేకుంటే పెట్రోలు బంకుల్లో పెట్రోలు విక్రయించరు.

జగిత్యాలలో ‘నో హెల్మెట్‌- నో పెట్రోల్‌’
హెల్మెట్‌ ధరించని వాహనదారుడికి పెట్రోల్‌ పోస్తున్న దృశ్యం (ఫైల్‌)

- పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్‌ రవి ఆదేశాలు


జగిత్యాల, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): జగిత్యాల జిల్లా వ్యాప్తంగా సోమ వారం నుంచి వాహనచోదకులకు హెల్మెట్‌ లేకుంటే పెట్రోలు బంకుల్లో   పెట్రోలు విక్రయించరు. వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలలో వాహనదారులు తీవ్రంగా గాయపడుతున్నారు. హెల్మెట్‌ ధరించని వాహన దారులు ప్రమాదాల్లో ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. దీన్ని నివా రించేందుకు జిల్లా కలెక్టర్‌ రవి ఆదేశాలతో అధికారులు, పెట్రోల్‌ బంకుల నిర్వాహకులు ‘నో హెల్మెట్‌- నో పెట్రోల్‌’ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు.


దీనిపై ఇటీవలే జిల్లా కలెక్టర్‌ రవి, అదనపు కలెక్టర్‌ రాజేశం జిల్లాలోని బంకు యజమానులు, అధికారులకు నిబంధలనపై పూర్తి అవగాహన కల్పించారు. దీనికి తోడు జిల్లా సివిల్‌ సప్లై అధికారి చందన్‌ కుమార్‌ తన బృందంతో కలిసి ప్రతి పెట్రోల్‌ బంకులో ‘హెల్మ్‌ట్‌ లేకుండా పెట్రోల్‌ పోయబడదు’ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. మరో వైపు మైనర్లు వాహనాలు నడపకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ రవి అధికారులకు సూచించారు. ప్రతి పెట్రోల్‌ బంక్‌లో సీసీ కెమెరాల ఏర్పాటు చేసి, ప్రతీ పదిహేను రోజులకొకసారి పెట్రోల్‌ పోసే విధానాన్ని పరిశీలించనున్నారు.   


వాహనదారుల భద్రత కోసమే

- గుగులోతు రవి, కలెక్టర్‌, జగిత్యాల

వాహనదారుల భద్రత కోసమే.. ‘నో హెల్మెట్‌ - నో పెట్రోలు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. దీనిపై ప్రజలకు అవగాహణ కల్పించడానికి ప్రయత్నిస్తు న్నాము. ఇప్పటికే రోడ్డు భద్రత నిబంధనలు అతిక్రమించిన వ్యక్తులపై కేసులు నమోదు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని విధిగా అమలు చేసే విధంగా పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలోని బంకుల యజమానులకు, వాహన చోదకులకు అవగాహన కల్పించాం. బంకుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, నిరం తరం పర్యవేక్షిస్తాం. నిబంధనలు అతిక్రమించే బంకు యజమానులు, వాహన చోదకులపై చట్ట పరంగా చర్యలు తీసుకుంటాం. 

Updated Date - 2021-02-08T06:08:56+05:30 IST