నేడో.. రేపో రాజీనామా

ABN , First Publish Date - 2021-05-05T06:17:13+05:30 IST

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ తన శాసనసభ్యత్వానికి, టీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలనే నిర్ణయానికి వచ్చారని తెలిసింది.

నేడో.. రేపో రాజీనామా

- హుజురాబాద్‌లో విస్తృత అభిప్రాయాలు సేకరించిన ఈటల

-  బహిష్కరణ వేటుకు సిద్ధమవుతున్న పార్టీ 

- సస్పెన్షన్‌ కోరుతూ కేసీఆర్‌కు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేల లేఖ 

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ తన శాసనసభ్యత్వానికి, టీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలనే నిర్ణయానికి వచ్చారని తెలిసింది. నేడో, రేపో ఆయన ఈ విషయాన్ని ప్రకటించే అవకాశమున్నదని సమాచారం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆయనను మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేసిన తర్వాత పార్టీలో, పదవిలో ఉండాలో వద్దో తేల్చుకోవడానికి ఆయన తన నియోజకవర్గమైన హుజూరాబాద్‌కు వచ్చారు. 

అనుచరులు, అభిమానులతో సమావేశం

మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు క్షణం తీరికలేకుండా టీఆర్‌ఎస్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు, వివిధ కుల సంఘాలు, ప్రజా సంఘాల నాయకులతో విస్తృతంగా మాట్లాడారు. వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా అది మీ అభీష్టానానికి అనుగుణంగానే ఉంటుందని మాత్రమే చెప్పినట్లు సమాచారం. 

ఎన్‌ఆర్‌ఐలతో వర్చువల్‌ సమావేశం

ఇందులో భాగంగానే నియోజకవర్గంలో ఉన్న ఈటలతో ఎన్‌ఆర్‌ఐలు  వర్చువల్‌ సమావేశం నిర్వహించారు. 60 మంది ఎన్‌ఆర్‌ఐలు ఈ సమావేశంలో పాల్గొని కొత్త పార్టీని పెట్టి ముందుకు సాగాలని, వేరే పార్టీల్లో చేరవద్దని సూచించారు. మంత్రివర్గం నుంచి తొలగించిన తీరును గర్హిస్తూ తామంతా అండగా ఉంటామని వారు ఈటలకు సూచించారు. ఈ సందర్భంగా  బీజేపీ, టీఆర్‌ఎస్‌ అవసరాల రీత్యా కలిసి పనిచేసే అవకాశాలున్నాయని, ఆ పార్టీలో చేరక పోవడమే మంచిదని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉప ఎన్నికలుగానీ, ఇతర ఎన్నికలుగానీ జరిగే అవకాశాలున్నపుడు మాత్రమే దానికంటే నెల ముందు శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు పోవాలని చెప్పారు. ఎన్నిక విషయంలో ఇప్పుడే రాజీనామా చేసి ప్రభుత్వానికి ఎక్కువ సమయం ఇవ్వవద్దని సూచించారు. అన్ని వర్గాల వారితో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటానని వారికి ఈటల స్పష్టం చేశారు.  

వివిధ రకాల సూచనలు

ఈటలను కలిసిన కొందరు ఇప్పటికీ టీఆర్‌ఎస్‌ నేతలు, కేసీఆర్‌పై మెతకతనంగా వ్యవహరించడం బాగా లేదని, ప్రభుత్వం వైపు నుంచి కక్ష్యసాధింపు చర్యలు సాగుతుంటే  ఇలా వ్యవహరించడం వేరే సంకేతాలిస్తున్నాయని అన్నట్లు తెలిసింది. మరికొందరు పార్టీలోనే ఉండి తనగొంతు వినిపించాలని, ఒకవేళ పార్టీ బహిష్కరిస్తే శాసనసభ్యుడిగా కొనసాగాలని సూచించారని సమాచారం. ఈ వాదనను అక్కడే ఉన్న మరికొందరు తిరస్కరిస్తూ పార్టీకి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని, ఉప ఎన్నికల్లో తమ సత్తా చూపించాలని అన్నట్లు తెలిసింది. 

జిల్లా ఎమ్మెల్యేలు, టీఆర్‌ఎస్‌ నాయకుల విమర్శలు

ఈ సమయంలోనే హైదరాబాద్‌లో జిల్లాకు చెందిన శాసనసభ్యులు, టీఆర్‌ఎస్‌ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈటలపై విమర్శలు చేశారు. తన బర్తరఫ్‌ నేపథ్యంలో నిర్వహించిన రెండు మీడియా సమావేశాల్లో ఈటల మాట్లాడిన మాటల సత్యదూరమని, ఆయనకు కేసీఆర్‌ ఇవ్వాల్సినంత ప్రాధాన్యం ఇచ్చారని, ఆయనే పార్టీ లైన్‌ తప్పి ప్రభుత్వం చేపట్టిన పలు పథకాల గురించి, ఇతర అంశాల గురించి వ్యతిరేకంగా మాట్లాడారని విమర్శించారు. మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌ మీడియా సమావేశంలో ఈటల వ్యవహార శైలిని దుయ్యబట్టారు. మీడియా సమావేశాల్లో విమర్శలను సంధించడానికి మాత్రమే పరిమితం కాకుండా ఈటల రాజేందర్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని కోరుతూ ఉమ్మడి జిల్లా పరిధిలోని మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ కొందరు ఎమ్మెల్యేలు కేసీఆర్‌కు లేఖ రాశారని సమాచారం. కేసీఆర్‌తోపాటు పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్‌కు కూడా ఈ లేఖను పంపించినట్లు తెలిసింది. ఈటల వ్యవహారంలో మొదటి నుంచి ప్రణాళికాబద్ధంగానే నిర్ణయాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈటలను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలనే డిమాండ్‌తో లేఖ రాయడం కూడా ఒకటని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.  ఈటలకు పార్టీకి రాజీనామా చేసే అవకాశమే ఇవ్వకుండా ఆయనను బుధవారం బహిష్కరించాలని చెబుతున్నారు. ఈ విషయాలన్నీ తెలుసుకున్న ఈటల రాజేందర్‌ తన నిర్ణయానికి ఎక్కువ రోజులు వేచి చూడకుండా బుధవారమే ఏదో ప్రకటన చేసే అవకాశముందని అనుకుంటున్నారు. 

Updated Date - 2021-05-05T06:17:13+05:30 IST