మున్సిపల్‌, జీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2021-08-21T06:20:50+05:30 IST

రాష్ట్రంలో మున్సిపల్‌, గ్రామపంచాయతీలలో పనిచేసే కార్మికులకు పీఆర్సీ తరహాలో ప్రత్యేక నిర్ణయాత్మక వేతన విధానం అమలు చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబు అన్నారు.

మున్సిపల్‌, జీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
హుజూరాబాద్‌లో మాట్లాడుతున్న సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబు

- వేతన సవరణ విధానం అమలు చేయాలి

- సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబు

- హుజూరాబాద్‌లో కార్మికుల ర్యాలీ

హుజూరాబాద్‌, ఆగస్టు 20: రాష్ట్రంలో మున్సిపల్‌, గ్రామపంచాయతీలలో పనిచేసే కార్మికులకు పీఆర్సీ తరహాలో ప్రత్యేక నిర్ణయాత్మక వేతన విధానం అమలు చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబు అన్నారు. శుక్రవారం హుజూరాబాద్‌ పట్టణంలోని సాయిరూప గార్డెన్‌లో గ్రామపంచాయతీ, మున్సిపల్‌ ఉద్యోగ, కార్మికుల శంఖా రావం సభ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు హాజరయ్యారు. మొదట డిపో క్రాస్‌ నుంచి అంబేద్కర్‌ చౌరస్తా వరకు ర్యాలీగా వచ్చి అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో సాయి బాబు మాట్లాడుతూ మున్సిపల్‌, గ్రామపంచాయతీ కార్మికులు దయనీయ స్థితిలో బతుకుతున్నారన్నారు. ఏ ఆధారం లేని అట్టడుగు కార్మికులు అతి తక్కువ వేతనాలు పొందుతున్నారన్నారు. 75ఏళ్లలో నిర్లక్ష్యం, నిరాధారణకు గురయ్యారన్నారు. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ కార్మికులకు పీఆర్సీ తరహాలోనే ప్రత్యేక తరహా, నిర్మాణాత్మక వేతన విధానం అమలు చేస్తామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పి నెలలు గడుస్తున్నా ఇంత వరకు ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు కార్మిక వర్గానికి శాపంగా మారాయన్నారు. ఏళ్ల తరబడి వెట్టి చాకిరీ  చేస్తున్న సఫాయి కార్మికులకు ప్రభుత్వం సమాన పనికి సమాన వేతనం అందించాలని డిమాండ్‌ చేశారు. కరోనా సమయంలో అనేక మంది కార్మికులు మృత్యువాత పడ్డారన్నారు. మున్సిపల్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ మాట్లాడుతూ బడుగులు, పేద కార్మికుల బతుకులు మారడం లేదన్నారు. గ్రామపంచాయతీలలో  మల్టీపర్పస్‌ విధానం రద్దు చేయాలన్నారు. బిల్లు కలెక్టర్లు, కారోబార్లకు ప్రత్యేక హోదా కల్పించాలన్నారు. పీఆర్సీ ప్రకారం పెరిగిన వేతనాలు కార్మికులకు వర్తింపజేయాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కమర్‌అలి, గ్రామపంచాయతీ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు గణపతిరెడ్డి,  రాష్ట్ర నాయకులు రమ, భూపాల్‌, ఎర్రబెల్లి, ముత్యంరావు, వెంకటయ్య, నాగమణి, బండారి శేఖర్‌, రమేష్‌, కొప్పుల శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-21T06:20:50+05:30 IST