టీఆర్‌ఎస్‌లోకి ముద్దసాని కశ్యప్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-06-22T06:54:31+05:30 IST

మాజీ మంత్రి దివంగత ముద్దసాని దామోదర్‌రెడ్డి తనయుడు, కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు కశ్యప్‌రెడ్డి హైదరాబాద్‌లో మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.

టీఆర్‌ఎస్‌లోకి ముద్దసాని కశ్యప్‌రెడ్డి
ముద్దసాని కశ్యప్‌రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న మంత్రి హరీశ్‌రావు, పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు

- కండువా కప్పి ఆహ్వానించిన మంత్రులు

కరీంనగర్‌, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మాజీ మంత్రి దివంగత ముద్దసాని దామోదర్‌రెడ్డి తనయుడు, కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు కశ్యప్‌రెడ్డి హైదరాబాద్‌లో మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. తన తండ్రి దామోదర్‌రెడ్డి మరణానంతరం 2014లో ఆయన టీడీపీ అభ్యర్థిగా హుజూరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. అనంతరం ఆయన రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్‌ పార్టీలో చేరి ఇప్పటి వరకు ఆ పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు. హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ రాజీనామా చేయడంతో ఉపఎన్నిక రానున్న నేపథ్యంలో ఆయన టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరడం ప్రాధాన్యం సంతరించుకున్నది. టీఆర్‌ఎస్‌ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని బరిలో నిలపాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే సందర్భంలో  మాజీ ఐఏఎస్‌ అధికారి, ప్రస్తుత వేములవాడ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఉపాధ్యక్షులు పురుషోత్తంరెడ్డి పేరు టీఆర్‌ఎస్‌ పరిశీలిస్తున్నదని ప్రచారంలోకి వచ్చింది. ఈయన మాజీ మంత్రి దామోదర్‌రెడ్డికి సోదరుడు కాగా ప్రస్తుతం ఆయన కుమారుడు కశ్యప్‌ రెడ్డి కూడా టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశిస్తూ ఆ పార్టీలో చేరారు. అయితే ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి హరీశ్‌రావు ఎలాంటి హామీ మాత్రం ఇవ్వలేదని సమాచారం. టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరి నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషిచేయాలని హరీశ్‌రావు కశ్యప్‌రెడ్డికి సూచించినట్లు తెలిసింది. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఉన్న వివిధ మండ లాలకు ఇన్‌చార్జీలుగా బాధ్యతలు చేపట్టి పార్టీ శ్రేణులను సమన్వయపర్చడానికి కృషి చేస్తున్న జిల్లాకు చెందిన మంత్రులతో పాటు శాసనసభ్యులు సుంకె రవిశంకర్‌, బాల్క సుమన్‌, సీనియర్‌ నాయకులు పి రవీందర్‌రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 


Updated Date - 2021-06-22T06:54:31+05:30 IST