హుజురాబాద్ ఫలితంపై ఎంపీ అరవింద్ ఎమన్నారంటే...

ABN , First Publish Date - 2021-11-02T22:51:55+05:30 IST

అధికార పార్టీ ధనబలంపై హుజూరాబాద్ ప్రజలు విజయం సాధించారని ఎంపీ అరవింద్ వ్యాఖ్యానించారు.

హుజురాబాద్ ఫలితంపై ఎంపీ అరవింద్ ఎమన్నారంటే...

న్యూఢిల్లీ: అధికార పార్టీ ధనబలంపై హుజూరాబాద్ ప్రజలు విజయం సాధించారని ఎంపీ అరవింద్ వ్యాఖ్యానించారు. హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితంపై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలో పనిచేసిన బీజేపీ కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. ఇది కార్యకర్తల విజయమని, అధికార బలం, ధనబలంతో బీజేపీ కార్యకర్తలను భయబ్రాంతులకు గురిచేసినా భయపడకుండా కష్టపడి పనిచేశారని ప్రశంసించారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పతనం నేటి నుంచి ప్రారంభంమైందన్నారు. టీఆర్ఎస్ పార్టీలో త్వరలో ముసలం పుట్టబోతోందని జోస్యం చెప్పారు. హుజురాబాద్ ఎన్నిక తర్వాత కేసీఆర్ గౌరవంగా తప్పుకుంటే మంచిదన్నారు.


కేసీఆర్ అహంకారానికి హుజురాబాద్ ఫలితాలు చెంపపెట్టని అరవింద్ అన్నారు. రేపటి నుంచి తెలంగాణలో అన్ని నియోజకవర్గాల్లో దళితబంధు పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. అన్ని వర్గాలకు కూడా దళితబంధు  లాంటి పథకాలను అమలు చేసే వరకు బీజేపీ పోరాటాన్ని కొనసాగిస్తుందన్నారు. కేసీఆర్‌కు సిగ్గుంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి దళితుడిని సీఎం చేయాలన్నారు. నాగార్జున సాగర్‌లో అభ్యర్థి ఎంపిక తప్పిదం కాబట్టే అక్కడ ఓడిపోయామని అరవింద్ అన్నారు.

Updated Date - 2021-11-02T22:51:55+05:30 IST