స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక అనివార్యం
ABN , First Publish Date - 2021-11-27T05:16:29+05:30 IST
ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల రెండు ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ అనివార్యమయ్యింది.

- అధికార పార్టీ అభ్యర్థులకు తప్పని పోటీ
- 14 మంది అభ్యర్థుల ఉపసంహరణ
- పోటీలో 10 మంది అభ్యర్థులు
- టీఆర్‌ఎస్‌కు క్రాస్ ఓటింగ్ భయం
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల రెండు ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ అనివార్యమయ్యింది. ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థులు పోటీలో లేనందు వల్ల గత రెండు ఎన్నికల్లా ఈసారి కూడా ఏకగ్రీవం అవుతాయని అంతా భావించినప్పటికీ పోటీ తప్పలేదు. దీంతో ఈ ఎన్నికలు జిల్లావాసుల్లో ఉత్కంఠను రేపుతు న్నాయి. టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి అజ్ఞాతంలోకి వెళ్లిన ప్పుడే పోటీ తప్పదనే సంకేతాలు వెలువడ్డాయి. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయం తీసుకోక ముందే గురువారం పార్టీకి రాజీనామా చేశాడు. టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన సైదాపూర్ ఎంపీపీ సారాబుడ్ల ప్రభాకర్ రెడ్డితో పాటు మరికొందరు అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థు లుగా నామినేషన్లు దాఖలు చేశారు. శుక్రవారం నామినేషన్ల గడువు ముగిసే నాటికి 14 మంది అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకోగా, 10 మంది పోటీ పడుతున్నారు. అధికార టీఆర్ ఎస్ పార్టీకి చెందిన మండలి ప్రభుత్వ విప్ తానిపర్తి భానుప్రసాదరావు, మాజీ మంత్రి ఎలగందుల రమణ టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులుగా పోటీచేస్తుండగా, మరో 8 మంది స్వతంత్రులు పోటీ పడుతున్నారు. 2009లో జరిగిన ఉమ్మడి కరీంనగర్ స్థానిక సంస్థల కోటా కింద ఒక ఎమ్మెల్సీ స్థానమే ఉండగా, అప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీచేసిన భానుప్రసాదరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2016లో కరీంనగర్‌కు మరొక స్థానం పెరగడంతో భానుప్ర సాదరావుతో పాటు నారదాసు లక్ష్మణ్‌రావు టీఆర్‌ఎస్ నుంచి పోటీచేసి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈసారి అదే పరిస్థితి ఉంటుందని అంతా ఊహించినప్పటికీ సీన్ రివర్స్ అయ్యింది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి వల్లనే వాళ్లు తీవ్ర నిరాశనిస్పృహలతో ఉన్నారు. ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు ఎలాంటి నిధులు, విధులు లేకపోవడంతో కొందరు టీఆర్‌ఎస్‌కు చెందిన వాళ్లు కూడా పోటీలో నిలవడం గమనార్హం. ఏకగ్రీవం కాదని గమనించిన టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు రెండు రోజుల క్రితమే అధికార టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లను క్యాంపునకు తరలిం చిన విషయం తెలిసిందే. నామినేషన్లు వేసిన వారిలో జిల్లా కు చెందిన వాళ్లు నలుగురు ఉండగా, పెద్దపల్లి మండలం చీకురాయికి చెందిన సిలారపు సత్తయ్య, చీకురాయికి చెందిన మ్యాకల శ్రీనివాస్ తమ నామినేషన్లను ఉపసంహ రించుకున్నారు. టీఆర్‌ఎస్ నుంచి భానుప్రసాదరావు, మంథనికి చెందిన ఇనుముల సత్యనారాయణ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు.
టీఆర్‌ఎస్ పార్టీకి క్రాస్ ఓటింగ్ భయం
ప్రస్తుతం హైదరాబాద్‌లోని శామీర్‌పేటలోగల ఒక రిసా ర్ట్‌లో జరుగుతున్న క్యాంపును బెంగుళూరు, మైసూరులాంటి ప్రాంతాలకు తరలించాలని అధికార పార్టీ నేతలు భావిస్తు న్నారు. అందరిని ఒకే చోటికి గాకుండా రెండు గ్రూపులుగా విడదీసి వేర్వేరుచోట్ల క్యాంపులను నిర్వహించాలని ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తున్నది. రెండు రోజుల నుంచి క్యాంపు ను సీరియస్‌గా నిర్వహించక పోగా శనివారం నుంచి సీరి యస్‌గా క్యాంపును నిర్వహిం చేందుకు సన్నద్ధం అవుతు న్నారు. ఎవరిని బయటికి వెళ్లనీయకుండా కట్టుదిట్టం చేయాలని అనుకుంటున్నారు. ప్రతి ఒక్కరి కదలికలపై నిఘా ఏర్పాటు చేయవచ్చని తెలుస్తున్నది. ఇక్కడ రెండు స్థానాలకు ఒకే బ్యాలెట్‌పై ఎ న్నిక జరగనుండడంతో క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశాలున్నా యి. హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక మాదిరిగా ఓటర్లు హ్యాండ్ ఇస్తే పరిస్థితి తలకిందులు కావచ్చని అను కుంటున్నారు. ఇందులో ఒక్క సీటు జారినా పార్టీ ప్రతిష్టకు భంగం తప్పకపోవచ్చని తెలు స్తున్నది. ఇక్కడ ఉన్న ఓట ర్లలో అధికార టీఆర్‌ఎస్ పార్టీ ద్వారా 825 మంది గెలు పొందగా, ఎన్నికల అనంతరం పలువురు టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వారితో కలిపి 980 వరకు ఉండగా, అందరు క్యాంపులో లేరని తెలుస్తున్నది. ఒకే బ్యాలెట్‌లో ముందుగా టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థులిద్దరి పేర్లు, వాటికి ఎదురుగా వారి ఫోటోలు, ఆ తర్వాత స్వతంత్ర అభ్యర్థుల పేర్లు తెలుగు అక్షరమాలలో వరుసగా ఉంటా యి. ఇక్కడ ఓటర్లు ప్రాధాన్యత క్రమంలో ఓట్లు వేసే అవకాశం ఉంటుంది. రెండు స్థానాలకు ఎన్నిక జరుగు తుండడంతో తప్పనిసరిగా ఇద్దరికి మాత్రం ప్రాధాన్యత క్రమంలో ఓటు వేయాల్సి ఉంటుంది. ఒకరికి మాత్రమే ఓటు వేస్తే ఆ ఓటు చెల్లకుండా పోనున్నది. దీంతో ఈ ఎన్నిక డిసెంబర్ 10న జరిగే పోలింగ్ వరకు ఉత్కంఠను రేపనున్నది.