ఘనంగా క్రిస్మస్ వేడుకలు
ABN , First Publish Date - 2021-12-26T05:47:08+05:30 IST
ప్రత్యేక ప్రార్థనలు.. సందేశాలు... గీతాలతో శనివారం క్రిస్మస్ వేడుకలను జిల్లాలోని చర్చిలలో, క్రైస్తవుల గృహాల్లో ఘనంగా జరుపుకున్నారు.

కరీంనగర్ కల్చరల్, డిసెంబర్ 25: ప్రత్యేక ప్రార్థనలు.. సందేశాలు... గీతాలతో శనివారం క్రిస్మస్ వేడుకలను జిల్లాలోని చర్చిలలో, క్రైస్తవుల గృహాల్లో ఘనంగా జరుపుకున్నారు. కేక్‌లు కోసి సంబరాలు చేసుకున్నారు. హాపీ క్రిస్మస్, మేర్రీ క్రిస్మస్ అంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. గృహాలను, చర్చిలను అలంకరించుకున్నారు. బైబిల్‌ను పఠించారు.
సీఎస్‌ఐ వెస్లి కెథడ్రల్ చర్చిలో..
పోలీస్ కమిషనర్ నివాసానికి ఎదురుగా సీఎస్‌ఐ వెస్లి కెథెడ్రల్ చర్చిలో కరీంనగర్ అధ్యక్ష మండల పీఠాధిపతి, భిషప్ డాక్టర్ కె రూబెన్‌మార్క్ సందేశం ఇస్తూ క్రీస్తు చూపిన మార్గంలో ప్రజలంతా నడవాలని అన్నారు. యేసు లోకంలో జన్మించి శాంతి సమాధానంతో ప్రేమతో ప్రతి వ్యక్తి మెలిగే రీతిని తన జీవితం ద్వారా తెలిపారన్నారు. క్రైస్తవులు సామూహిక ప్రార్ధనలు చేశారు. క్వయర్ బృందంతో పాటు యువతీ యువకులు, విద్యార్థుల గీతాలు అలరించాయి. అతిథిగా సీపీ సత్యనారాయణ హాజరై ప్రార్థనల్లో పాల్గొని క్రిస్‌మస్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఫాస్టరేట్ కమిటీ చైర్మన్ కె శ్రీనివాస్‌నాయక్, ప్రెస్బిటర్ మధుమోహన్, సెక్రెటరీ అనిల్‌కుమార్, కోశాధికారి వినయ్‌సాగర్, సభ్యులతో పాటు క్రైస్తవులు పాల్గొన్నారు.
ఫ సీఎస్‌ఐ సెంటినరీ వెస్లీ చర్చిలో...
క్రిస్టియన్ కాలనీ సీఎస్‌ఐ సెంటినరీ వెస్లి చర్చిలో పాస్టరేట్ చైర్మన్ డాక్టర్ ఎస్ జాన్ ప్రత్యేక ప్రార్థనలను చేసి సందేశమిచ్చారు. యేసుక్రీస్తు చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలన్నారు. క్రీస్తు పాపాలను క్షమించి సన్మార్గంలో నడిపిస్తాడని అన్నారు. టి సాల్మన్‌రాజు బృందం ప్రత్యేక గీతాలు అలరించాయి. అతిథులుగా మంత్రి గంగుల కమలాకర్, మేయర్ సునీల్‌రావు, పలువురు కార్పోరేటర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్బిటర్ ప్రశాంత్, కార్యదర్శి నారాయణ, సుశీల్, దీనదయాళ్, కిరణ్, జి కృపాదానంతోపాటు క్రైస్తవులు పాల్గొన్నారు.
ఫ మతసామరస్యం, సమిష్ఠి కృషితో సర్వతోముఖాభివృద్ధి
- మంత్రి గంగుల
మతసామరస్యం, సమష్ఠి కృషితోనే సర్వతోముఖాభివృద్ధి సాధ్యమని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖామంత్రి గంగుల కమలాకర్ అన్నారు. వెస్లి చర్చ్‌లో ప్రార్థనల అనంతరం మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని కులాలు, మతాల వారికి సమ ప్రాధాన్యం, సంక్షేమ ఫలాలు దక్కుతున్నాయని చర్చిలు, మిషనరీ సేవాసంస్థలు విద్య, వైద్య రంగాల్లో సేవలందిస్తున్నాయని కేసీఆర్ అన్ని మతాల వారి విశ్వాసాలను గౌరవించి పెద్ద పీట వేస్తున్నారని అన్నారు. అందరూ కలసి మెలసి జీవించే చరిత్ర కరీంనగర్‌దని పేర్కొన్నారు. ప్రపంచమంతా జరుపకునే పండుగ క్రిస్మస్ అని క్రీస్తు ప్రభువు దయ రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.