క్షయ వ్యాధి నియంత్రణకు చర్యలు

ABN , First Publish Date - 2021-03-24T06:36:17+05:30 IST

క్షయ వ్యాధి (టీబీ) నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ ఆవుల సుమన్‌ మోహన్‌రావు పేర్కొన్నారు.

క్షయ వ్యాధి నియంత్రణకు చర్యలు
మాట్లాడుతున్న జిల్లా వైద్యాధికారి సుమన్‌ మోహన్‌రావు



వేములవాడ, మార్చి23: క్షయ వ్యాధి (టీబీ) నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు  జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ ఆవుల సుమన్‌ మోహన్‌రావు పేర్కొన్నారు. వ్యాధి నిర్ధారణకు ఉచిత పరీక్షలు, ఉచితంగా వైద్యం అందజేస్తున్నామని ఆయన వెల్లడించారు. జిల్లా టీబీ నివారణ అధికారి డాక్టర్‌ రేగులపాటి మహేశ్‌రావుతో కలిసి మంగళవారం వేములవాడలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 867 టీబీ కేసులు ఉన్నాయని తెలిపారు. టీబీ వ్యాధిగ్రస్తులకు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు పూర్తిగా నయమయ్యేంత వరకు ఉచితంగా మందులు అందజేస్తామని తెలిపారు. టీబీ బారిన పడిన వారు పూర్తిగా కోలుకోవడానికి క్రమం తప్పకుండా ఆరు నెలల పాటు పూర్తి కోర్సు మందులు వాడాల్సి ఉంటుందని, మధ్యలో వదిలేస్తే ఈ కోర్సు రెండేళ్ల పాటు వాడాల్సి ఉంటుందని అన్నారు. టీబీ వ్యాధి నిర్ధారణ అయిన వారికి నెలకు 500 రూపాయల చొప్పున, ఆరు నెలల పాటు ప్రభుత్వం వారి ఖాతాలో నేరుగా జమచేస్తుందని ఆయన వివరించారు. ఈ సమావేశంలో డాక్టర్‌ శ్రీరాములు, డాక్టర్‌ అనిల్‌, సీనియర్‌ లాబ్‌ టెక్నీషియన్‌ జయప్రకాశ్‌ నారాయణ, సూపర్‌వైజర్లు గంగాధర్‌, రాజకిషోర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-03-24T06:36:17+05:30 IST