కన్నులపండువగా.. మహారథోత్సవం
ABN , First Publish Date - 2021-10-21T06:21:08+05:30 IST
ఉప్పొంగిన భక్తి భావం.. నలుదిక్కుల గోవింద నామ స్మరణ మధ్య లక్ష్మీవేంకటేశ్వరస్వామి మహారథోత్సవం కన్నుల పండువగా సాగింది. మహారథంపై నుంచి స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. జిల్లా కేంద్రంలో లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధ వారం మహారథంపై స్వామివారి ఊరేగింపు నిర్వహిం చారు.

- సిరిసిల్లలో లక్ష్మీవేంకటేశ్వరుడి రథయాత్ర
- వేలాదిగా తరలివచ్చిన భక్తజనం
- భారీ బందోబస్తు
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
ఉప్పొంగిన భక్తి భావం.. నలుదిక్కుల గోవింద నామ స్మరణ మధ్య లక్ష్మీవేంకటేశ్వరస్వామి మహారథోత్సవం కన్నుల పండువగా సాగింది. మహారథంపై నుంచి స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. జిల్లా కేంద్రంలో లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధ వారం మహారథంపై స్వామివారి ఊరేగింపు నిర్వహిం చారు. అంతకుముందు ఉదయం 5 గంటలకు హోమం చేశారు. సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభమైన మహారథోత్సవం సుమారు 5.25 గంటల వరకు సిరిసిల్ల తిరువీధుల్లో సాగింది. వేంకటేశ్వరస్వామి దేవస్థానం చుట్టూ వీధుల్లో భక్తులకు శ్రీవారు విశేష అలంకరణలతో కనిపించారు. 160 సంవత్సరాల చరిత్ర కలిగిన తెలంగాణ జిల్లాల్లోనే అతిపెద్దదైన 30 అడుగుల ఎత్తు ఉన్న రథోత్సవాన్ని తిలకించేందుకు సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాలతోపాటు మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులు రథాన్ని లాగుతూ భక్తి భావాన్ని చాటుకున్నారు. మహిళలు మంగళహారతులతో తరలివచ్చారు. దాదాపు కిలో మీటరు దూరం వరకు మహిళలు బారులుదీరారు. రథంపై ఉన్న వేంకటేశ్వరుడిని దర్శిస్తే సుఖఃశాం తులతో ఉంటారని నమ్మకం. పురాతన కాలం నుంచి వేలాది మంది భక్తులు ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకోవడానికి, వీలుకాని వారికి ఆ భగవంతుడే బ్రహ్మోత్సవాల్లో రథంపై ఊరేగి దర్శనమిస్తాడని ఆర్యోక్తి. రథోత్సవం సందర్భంగా ముందు జాగ్రత్తగా విద్యుత్ తీగలను తొలగించారు. మహారథంపై ఉన్న స్వామి వారిని సిరిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళాచక్ర పాణి, వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, టీఆర్‌ఎస్ నాయకులు చీటినర్సింగరావు, గూడూరి ప్రవీణ్, మాజీ సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ, పట్టణ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, దేవస్థానం అధ్యక్షుడు ఉప్పుల విఠల్‌రెడ్డి, ఈవో శ్రీనివాస్, ధర్మకర్తలు మేర్గు లక్ష్మణ్, మామిడాల రమణ, కత్తెర సంతోషిణి, కోడం శ్రీనివాస్, అల్లాడి సరస్వతి దర్శించుకున్నారు.
జాతరతో సందడి
జాతరతో సిరిసిల్ల సందడిగా మారింది. లక్ష్మీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారి మహారథోత్సవాన్ని తిలకించడానికి చుట్టు పక్కల గ్రామాల ప్రజలతోపాటు సిద్దిపేట, కామారెడ్డి, మహారాష్ట్ర, ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తుల కోసం జాతరలో బొమ్మల దుకా ణాలు వెలిశాయి. చిరు వ్యాపారులు ఏర్పాటు చేసిన బొమ్మల దుకాణాలతో జాతరకు శోభ వచ్చింది. నిజా మాబాద్, హైదరాబాద్, వరంగల్, మెదక్, నాందేడ్ ప్రాంతాల నుంచి బొమ్మలు విక్ర యించే వ్యాపారులు వచ్చారు. జాతరలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.