లక్కు తేలింది
ABN , First Publish Date - 2021-11-21T05:41:17+05:30 IST
లక్కు తేలింది.. వైన్‌షాపుల లైసెన్స్‌ల కోసం 12 రోజుల ప్రక్రియ శనివారంతో ముగిసింది. లైసెన్స్‌ల కోసం దరఖాస్తు చేసిన వ్యాపారులు ఉత్కంఠతో ఇన్ని రోజులు గడిపారు.

- 93 వైన్‌షాపుల లైసెన్స్‌దారులు ఖరారు
- మొగ్ధుంపూర్ షాపు లాటరీ వాయిదా
- మహిళలకు 14 షాపులు
కరీంనగర్ క్రైం, నవంబరు 20: లక్కు తేలింది.. వైన్‌షాపుల లైసెన్స్‌ల కోసం 12 రోజుల ప్రక్రియ శనివారంతో ముగిసింది. లైసెన్స్‌ల కోసం దరఖాస్తు చేసిన వ్యాపారులు ఉత్కంఠతో ఇన్ని రోజులు గడిపారు. లాటరీలో షాపు లైసెన్స్ పొందిన వ్యాపారులు సంబరాలు జరుపుకుంటుండగా, అదృష్టం వరించని దరఖాస్తుదారులు నిరాశగా వెనుదిరిగారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్, అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ సమక్షంలో శనివారం నిర్వహించిన లాటరీ ప్రక్రియలో 93 వైన్‌షాపులకు లైసెన్స్‌దారులను ఎంపిక చేశారు. మొగ్ధుంపూర్ షాపు నం.46కు ఐదు దరఖాస్తులే రావడంతో ఆ షాపునకు లాటరీ నిర్వహించరాదని ఉన్నతాధికారుల ఆదేశాలతో నిలిపివేశారు. మిగతా 93 వైన్‌షాపులకు ప్రాధాన్య క్రమంలో షాపునకు వచ్చిన దరఖాస్తుదారుల నంబర్ కాయిన్‌లను ఒక డబ్బాలో వేసి లాటరీ విధానంలో కలెక్టర్ ఆ డబ్బాలో నుంచి ఒక కాయిన్ తీసి ఆ షాపునకు లైసెన్స్‌దారుడిని ఎంపిక చేశారు.
ఇలా కరీంనగర్ అర్బన్ ఎక్సైజ్ సర్కిల్‌లో 21 షాపులకు , కరీంనగర్ రూరల్ ఎక్సైజ్ సర్కిల్‌లోని 26 షాపులకు 25 మంది లైసెన్స్‌దారులను, తిమ్మాపూర్ ఎక్సైజ్ సర్కిల్‌లోని 14 షాపులకు, హుజురాబాద్ ఎక్సైజ్ సర్కిల్‌లోని 17 షాపులకు, జమ్మికుంట ఎక్సైజ్ సర్కిల్‌లోని 16 షాపులకు 16 మంది లైసెన్స్‌దారులను ఖరారు చేశారు. ఆరో నెంబరు షాపునకు ఒక దరఖాస్తుదారుడు గైర్హాజరుకాగా ఆ దరఖాస్తుదారుడి కాయిన్ లాటరీలో వేయవద్దని ఇతర దరఖాస్తుదారులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. నిబంధనల ప్రకారమే లాటరీ నిర్వహిస్తున్నామని కలెక్టర్ సర్దిచెప్పటంతో గొడవ సద్దుమనిగింది. లాటరీ ద్వారా 93 వైన్‌షాపులకు లైసెన్స్‌ల కేటాయింపే పారదర్శకంగా నిర్వహించామని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు.
జిల్లాలో 93 వైన్‌షాపులకు లైసెన్స్‌లు ఖరారుకాగా ఇందులో 14 లైసెన్స్‌లు మహిళల పేరిట ఖరారయ్యాయి. కరీంనగర్ అర్బన్‌లో 4, కరీంనగర్ రూరల్‌లో 3, తిమ్మాపూర్‌లో 1, హుజురాబాద్‌లో 4, జమ్మికుంటలో 2 షాపులల లైసెన్స్‌లు మహిళలకు దక్కాయి.
కరీంనగర్ రూరల్ ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని కరీంనగర్ రూరల్ మండలం మొగ్ధుంపూర్‌లోని షాపు నెంబరు 46కు లాటరీ నిర్వహించకుండా వాయిదా వేశారు. జిల్లాలోని 94 షాపులకు 1,694 దరఖాస్తులు రాగా ఇందులో మొగ్ధుంపూర్ షాపునకు ఐదు మంది మాత్రమే దరఖాస్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐదు దరఖాస్తులు వచ్చిన అన్ని షాపులకు లాటరీ వాయిదా వేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా మొగ్ధుంపూర్ వైన్‌షాపునకు లాటరీ వాయిదా వేసి 48 గంటల్లో విచారణ జరిపి నివేదిక అందించాలని కరీంనగర్ డిప్యూటీ కమిషనర్ కేఏబీ శాస్త్రికి రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ ఆదేశించారు. ఈ మేరకు మొగ్ధుంపూర్ షాపునకు లాటరీ నిర్వహించలేదు. అక్కడి వ్యాపారులు సిండికేట్‌గా మారి తక్కువ దరఖాస్తులు వేశారని అనుమానాలుండడంతో విచారణ నివేదిక అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాలతో చర్యలు తీసుకోనున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. మొగ్ధుంపూర్ షాపునకు రీ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలే అధికంగా ఉన్నట్లు సమాచారం.
ఆరోవంతు లైసెన్స్‌ఫీజు చెల్లింపు
జిల్లాలో 93 వైన్‌షాపులు ఎక్సైజ్ టాక్స్‌లో ఆరో వంతు డబ్బులు శనివారమే ఎస్‌బీఐ కౌంటర్‌లో చెల్లించి రశీదు పొందారు. జిల్లాలో మూడు కేటగిరీల్లో ఎక్సైజ్ టాక్స్ ఉండగా, ఏడాదికి 50 లక్షల షాపులు 15 ఉండగా ఇందులో 14 షాపులకు లైసెన్స్‌లు పొందిన వారు ఒక్కొక్కరు రెండేళ్లకు కలిపి 8,33,400 రూపాయల వంతున ఆరో వంతు చెల్లించారు. 55 లక్షల షాపులు 44 ఉండగా లైసెన్స్‌లు పొందిన వారు ఒక్కొక్కరు రెండేళ్లకు కలిపి 9,16,700 రూపాయల వంతున ఆరో వంతు చెల్లించారు. 65 లక్షల షాపులు 35 ఉండగా లైసెన్స్‌లు పొందిన వారు రెండేళ్లకు కలిపి 10,84,000 రూపాయల వంతున ఆరో వంతు చెల్లించారు. ఈ లాటరీ ప్రక్రియలో కరీంనగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె చంద్రశేఖర్, అసిస్టెంట్ సూపరింటెండెంట్ పి తాతాజీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏఈఎస్ నర్సింహారెడ్డి, సీఐలు కె విజయ్‌కుమార్, చంద్రమోహన్, ఇంద్రప్రసాద్, అక్బరుస్సేన్, దుర్గాభవాని, తిరుమలత, ఎస్‌ఐలు చిరంజీవి పాల్గొన్నారు.