కార్మిక హక్కులను కాలరాస్తే ఖబర్ధార్‌

ABN , First Publish Date - 2021-05-02T06:09:38+05:30 IST

కార్మికుల హక్కులను కాలరాస్తే ఖబర్ధార్‌ అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య హెచ్చరించారు.

కార్మిక హక్కులను కాలరాస్తే ఖబర్ధార్‌
ఏఐటీయూసీ జెండాను ఎగురవేస్తున్న రాష్ట్ర కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య

- జిల్లా కేంద్రంలో ఏఐటీయూసీ జెండా ఆవిష్కరించిన రాష్ట్ర కార్యదర్శి సమ్మయ్య

- ఘనంగా మేడే వేడుకలు

భగత్‌నగర్‌, మే 1: కార్మికుల హక్కులను కాలరాస్తే ఖబర్ధార్‌ అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య  హెచ్చరించారు. శనివారం ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని మేడే వేడుకలు జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో రాష్ట్ర కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య పతాకాన్ని అవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న కార్మికుల హక్కులను కాలరాస్తే కార్మికులు కన్నెర్ర చేయక తప్పదన్నారు.  బీజేపీ కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులకు భంగం కల్గించడంతోపాటు, చట్టాలను రద్దు చేస్తూ కార్మికులకు అన్యాయం చేస్తుందన్నారు. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ పేరుతో బహుళజాతీ కంపెనీలకు పెట్టుబడి దారులకు కార్పొరేట్‌ శక్తులకు అనుకూలంగా చట్టాలను మారుస్తున్నారన్నారు. 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్‌లుగా విభజించడాన్ని కార్మికులంతా వ్యతిరేకించాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించవద్దని, ప్రైవేట్‌ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కాంటాక్టు కార్మికులందరిని పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలనే డిమాండ్లపై పోరాటాలు ఉధృతం చేస్తామన్నారు. నగరంలోని ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాల అడ్డా వద్ద మార్బుల్‌ హమాలీ సంఘం ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు కటికరెడ్డి బుచ్చన్న యాదవ్‌, కూరగాయల మార్కెట్‌, ట్రాన్స్‌పోర్టు, రైల్వే, సిమెంట్‌ , ఫర్టిలైజర్స్‌ హమాలీ సంఘం, ప్రకాశం గంజ్‌ ట్రాలీ ఆటో యూనియన్‌ వద్ద జెండాలను అవిష్కరించారు.  కాళీదాసు, కసిరెడ్డి సురేందర్‌రెడ్డి, బూడిద సదాశివ, మణికంఠరెడ్డి, ఒర్సు కొమురయ్య, నలువాల సదానందం, పాల్గొన్నారు. 

జిల్లా వ్యాప్తంగా సీఐటీయూ ఆధ్వర్యంలో 186 గ్రామాలు, 223 సెంటర్లలో మేడ సందర్భంగా జెండాలను ఆవిష్కరించారు.  హమాలీ, భవన, రవాణా, మున్సిపల్‌, గ్రామ పంచాయతీ, రైస్‌మిల్లు ఆపరేటర్లు, ఆశ, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ, పవర్‌లూమ్‌, అంగన్వాడి, మధ్యాహ్న భోజన, డ్రైవర్లు, శాతవాహన యూనివర్సిటీ కార్మికులు, ప్రొఫెసర్‌ జయశంకర్‌ యూనివర్సిటీ, సివిల్‌ హాస్పిటల్‌, షాపింగ్‌, పెయింటర్‌, సెంట్రింగ్‌ కార్మికులు జెండాలను ఆవిష్కరించారు. అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాస్‌,  ఎడ్ల రమేష్‌, గీట్ల ముకుందరెడ్డి, బండారి శేఖర్‌, కొప్పుల శంకర్‌, పున్నం రవి,  సతీష్‌, శారద, మల్లారెడ్డి సమ్మయ్య, రాజమల్లు, మల్లయ్య మురళి, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-02T06:09:38+05:30 IST