నేతన్నలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత కేసీఆర్‌దే

ABN , First Publish Date - 2021-08-11T05:05:18+05:30 IST

చేనేత కార్మికులకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత కేసీఆర్‌దేనని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు.

నేతన్నలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత కేసీఆర్‌దే
హుజూరాబాద్‌లో మాట్లాడుతున్న మంత్రి గంగుల కమలాకర్‌

- టీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే అభివృద్ధిలో హుజూరాబాద్‌ ముందుకు పోతుంది

- మంత్రి గంగుల కమలాకర్‌

హుజూరాబాద్‌, ఆగస్టు 10 చేనేత కార్మికులకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత కేసీఆర్‌దేనని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. మంగళవారం హుజూరాబాద్‌లో పద్మశాలి కులస్థులకు భవనం కోసం కోటి రూపాయల నిధులతో పాటు ఎకరం స్థలాన్ని కేటాయిస్తూ జీవోను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ హుజూరాబాద్‌లో పద్మశాలీలు ఆత్మగౌరవ భవనం కోసం ఎన్నోసార్లు ఈటల వద్దకు వెళ్లి విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నేతన్నల చావులను చూసి చలించిన కేసీఆర్‌ వారి అభివృద్ధి కోసం పాటుపడుతున్నారన్నారు. గత ప్రభుత్వాల హయాంలో నేతన్నల ఆత్మహత్యలు, చావుకేకలు చేసుకునే పరిస్థితి ఉండేదన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ ఢిల్లీ పార్టీలని, టీఆర్‌ఎస్‌ తెలంగాణ ఇంటి పార్టీ అన్నారు. పద్మశాలి కులస్థులను అన్ని రకాలుగా ఆదుకున్నది తెలంగాణ ప్రభుత్వమన్నారు. నేతన్నలు సమాజంలో ముందుండాలని, నేసిన బతుకమ్మ చీరలను ప్రజలకు అందిస్తున్నారన్నారు. హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ అభివృద్ధి చేయలేక కేసీఆర్‌కు వెన్నుపోటు పోడిచి బీజేపీలో చేరారన్నారు. టీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే అభివృద్ధిలో హుజూరాబాద్‌ ముందుకు పోతుందన్నారు. సంక్షేమ పథకాలతో తెలంగాణ ముందుకెళ్తుండగా బీజేపీ పాలీత ప్రాంతాల్లో వెనుకబడి పోయిందన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఎల్‌ రమణ, ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌, మేయర్‌ సునీల్‌రావు, గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌, పద్మశాలి రాష్ట్ర నాయకులు, కులస్థులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-11T05:05:18+05:30 IST