అన్నదాతకు కాళేశ్వరం కన్నీరు

ABN , First Publish Date - 2021-01-20T05:59:26+05:30 IST

కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని అన్నారం బ్యారేజీ బ్యాక్‌ వాటర్‌ కారణంగా మంథని ప్రాంత అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

అన్నదాతకు కాళేశ్వరం కన్నీరు
ఆరెంద శివారులో నీట మునిగిన పొలాలు

- ‘అన్నారం’ బ్యాక్‌ వాటర్‌తో కష్టాలు

- పంపులు నడిచినప్పుడు, వర్షాలు పడినప్పుడు..

  పొలాలను ముంచెత్తుతున్న నీరు

- 400 ఎకరాలకుపైగా ముంపు ప్రాంతంగా గుర్తింపు

- భూసేకరణ, పరిహారం చెల్లింపులో తీవ్ర జ్యాపం

మంథని/మంథనిరూరల్‌, జనవరి 19: కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని అన్నారం బ్యారేజీ బ్యాక్‌ వాటర్‌ కారణంగా మంథని ప్రాంత అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. పంపుహౌస్‌లో మోటర్లను ఆన్‌ చేసినప్పుడు.. వర్షా కాలంలో రోజుల తరబడి కురిసే వర్షాలతో పలు గ్రామాలకు చెందిన వందలాది ఎకరాల్లోని పంట పొలాలు ముంపునకు గురవుతున్నాయి. బ్యాక్‌ వాటర్‌, వర్షం నీరు కారణంగా మూడేళ్లుగా అన్నదాతలు కష్టాలను ఎదుర్కొంటున్నారు. భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలోని గోదావరినదిపై నిర్మించిన అన్నారం(సరస్వతీ) బ్యారేజీ బ్యాక్‌ వాటర్‌  కారణంగా మంథని మండలంలోని గోదావరినది తీరాన ఉన్న ఆరెంద-మల్లారం, ఖాన్‌సాయిపేట, అమ్మగారిపల్లె(ఖానాపూర్‌) గ్రామాల్లో పంట పొలాలను అన్నారం బ్యారేజీ బ్యాక్‌ వాటర్‌ ముంచెత్తుతున్నాయి. అన్నారం బ్యారేజీ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 10.87 టీఎంసీలు(119 ఎఫ్‌ఆర్‌ఎల్‌ లెవల్స్‌) కాగా బ్యారేజిలో పూర్తి స్థాయి నీటి మట్టం ఉండే సమయంలో నీటి పంపుహౌస్‌లోకి పంపింగ్‌ చేసే క్రమంలో మండలంలోని పంట పొలాల్లో బ్యాక్‌వాటర్‌ కూడా క్రమేపి పెరుగుతోంది. గోదావరి ఒడ్డున దాదాపు 100-150 మీటర్ల మేర దూరంలో ఉన్న పొలాల్లోకి నీళ్లు చేరుతున్నాయి. దీంతో వేలాది రూపాయల పెట్టుబడులతో ఆరుగాలం కష్టించి పంటలు పండించే రైతుల పాలిట కాళేశ్వరం నీళ్లు కన్నీళ్లుగా మారుతున్నాయి. వరదనీటి ముంపుతో తమ పంటలు ఏటా దెబ్బతింటున్నాయని, నీటిలో నారు మునిగి ఉండటంతో పంట దిగుబడిపై కూడా అధిక ప్రభావం చూపి దిగుబడి తగ్గుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో జూలై, ఆగస్టు నెలల్లో, రబీ సీజన్‌లో ఫిబ్రవరి, మార్చి నెలల్లో సైతం ఇదే విధంగా అన్నారం బ్యారేజీ బ్యాక్‌ వాటర్‌ కారణంగా తమ పంట పొలాలు ముంపునకు గురై పంటలు నష్ట పోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

 20 లక్షల నష్టపరిహారం చెల్లించాలి..


ప్రతి సీజన్‌లో తాము పంటలు నష్టపోతున్నామని, ముంపునకు గురయ్యే తమ పొలాలు తీసుకొని ఎకరాకు రూ. 20 లక్షల చొప్పున నష్ట పరిహారం చెల్లించాలని ముంపు రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం మళ్లీ బ్యారేజీలో పంపింగ్‌ ప్రక్రియ జరుగుతుండటంతో రైతులు ఆందోళన బాట పట్టారు. అన్నారం పుంపుహౌస్‌లో 119 లెవల్స్‌తో నీరు నిల్వ ఉంటే ఆరెంద-మల్లారం గ్రామాల శివారులో సుమారు 350, ఖాన్‌సాయిపేట శివారులో 115 ఎకరాలు, అమ్మగారిపల్లె(ఖానాపూర్‌) గ్రామ శివారులో 69 ఎకరాలు అన్నారం బ్యారేజీ బ్యాక్‌ వాటర్‌ కారణంగా ముంపు గురయ్యే భూములుగా ఇంజనీర్లు, అధికారులు గుర్తించారు. అయితే వీటిని సర్వే చేసి భూసేకరణ చేయడంలో మాత్రం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. మూడేళ్లుగా ముంపు భూముల సర్వే, నష్ట పరిహారం కోసం ఎదురు చూస్తున్న మూడు గ్రామాల రైతులు ఆందోళనలకు దిగుతున్నారు. అధికారులు, రెవెన్యూ, ప్రాజెక్టు కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగి వేసారిపోయి ఈనెల 16న మంథని ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ముంపునకు గురయ్యే తమ పొలాలను భూసేకరణ చేసి ఎకరాకు రూ. 20 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు, కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్లు సకాలంలో స్పందించి ముంపు భూముల సర్వే, సరైనా నష్ట పరిహారం ఇప్పించాలని బాధిత రైతులు కోరుతున్నారు. 

Updated Date - 2021-01-20T05:59:26+05:30 IST