కాళేశ్వరం ప్రాజెక్టు 9వ ప్యాకేజీ పనుల్లో వేగం పెంచాలి
ABN , First Publish Date - 2021-02-07T04:47:30+05:30 IST
కాళేశ్వరం ప్రాజెక్ట్ 9వ ప్యాకేజీ పనుల్లో వేగం పెంచాలని, టన్నెల్‌లో రోజుకు 80 మీటర్ల మేర లైనింగ్ పనులు చేపట్టాలని సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు.

- టన్నెల్‌లో రోజుకు 80 మీటర్ల లైనింగ్ పనులు చేపట్టాలి
- అధికారులు, కాంట్రాక్టర్లు పర్యవేక్షించాలి
- సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
కాళేశ్వరం ప్రాజెక్ట్ 9వ ప్యాకేజీ పనుల్లో వేగం పెంచాలని, టన్నెల్‌లో రోజుకు 80 మీటర్ల మేర లైనింగ్ పనులు చేపట్టాలని సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. శనివారం ప్రత్యేక హెలికాప్టర్‌లో రాజన్న సిరిసిల్ల జిల్లాకు వచ్చారు. సిరిసిల్ల మిడ్ మానేరు బ్యాక్ వాటర్ నుంచి కోనరావుపేట మండలం మల్కపేట వరకు కాళేశ్వరం 9వ ప్యాకేజీ పనుల్లో భాగంగా చేపట్టిన మల్కపేట రిజర్వాయర్, సర్జిపూల్, పంప్‌హౌస్, టన్నెల్, సిరిసిల్ల కరకట్ట శివారులోని అప్రోచ్ చానల్, ముష్టిపల్లిలోని టన్నెల్ లైనింగ్ పనులను పరిశీలించారు. అనంతరం కోనరావుపేట మండలం మల్కపేట రిజర్వాయర్ వద్ద అధికారులు, కాంట్రాక్లర్లతో సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మిస్తున్న ప్యాకేజీ 9 పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. ప్రతి రోజూ 24 గంటలు పనిచేస్తూ పనుల పురోగతిలో వేగం పెంచాలన్నారు. మల్కపేట రిజర్వాయర్‌లోని అన్ని బండ్‌లలో స్టోన్ కట్టడంతోపాటు రెండో పంప్ డ్రైరన్ ఏప్రిల్ నెలాఖరు వరకు, మొత్తం పనులను మే నెలాఖరులోగా పూర్తి చేయాలన్నారు. ఎప్పటికప్పుడు పనుల పురోగతిపై సమీక్షిస్తానని, అధికారులు సంబంఽధిత కాంట్రాక్టర్లు క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండి పనుల్లో వేగం పెంచాలని అన్నారు. ముఖ్యమంత్రి కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో జరుగుతున్న పనుల పురోగతిని తెలుసుకుంటున్నారన్నారు. భూ సేకరణ, ఇతర రెవెన్యూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్‌కు సూచించారు. క్షేత్ర స్థాయిలో సమస్యలు ఉంటే తమకు తెలియజేయాలన్నారు.
మిషన్‌భగీరథ సమస్యలను పరిష్కరించాలి
జిల్లాలో మిషన్‌భగీరథ పనుల్లో క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చేపడుతున్న మిషన్‌భగీరథ పనుల పురోగతిపై సమీక్షించారు. ఇంట్రాలో భాగంగా ఇస్తున్న కనెక్షన్లు తదితర అంశాలపై చర్చించారు. మిషన్‌భగీరథ నీరు ప్రతీ ఇంటికి అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
మిడ్‌మానేరు బ్యాక్ వాటర్‌ను పరిశీలించిన సీఎంవో
జిల్లాలోని శ్రీరాజరాజేశ్వర మిడ్ మానేరు ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్‌ను సిరిసిల్ల కరకట్ట వద్ద టన్నెల్ కాలువతోపాటు పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్న ప్రాంతాన్ని సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ పరిశీలించారు. బోటును పరిశీలించి పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. ఆమె వెంట కలెక్టర్ కృష్ణభాస్కర్, అదనపు కలెక్టర్ సత్యప్రసాద్, అసిస్టెంట్ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఎస్పీ రాహుల్‌హెగ్డే, ఆర్డీవో శ్రీనివాసరావు, ఈఎన్‌సీ నల్ల వెంకటేశ్వర్లు, ఇరిగేషన్ సలహాదారుడు పెంటారెడ్డి, ఎస్‌ఈ సుధాకర్, ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు.