కాయ్‌ రాజా కాయ్‌..

ABN , First Publish Date - 2021-10-29T05:41:57+05:30 IST

హుజూరాబాద్‌ బాద్‌షా ఎవరు.. ఈటల రాజేందర్‌కు ప్రజలు పట్టం కడుతున్నారా.. గెల్లు శ్రీనివాస్‌ గెలిచి తీరుతారా.. ఎవరు గెలిస్తే ఎంత మెజార్టీ అన్న అంశాలపై జోరుగా బెట్టింగు సాగుతోంది.

కాయ్‌ రాజా కాయ్‌..

- జోరుగా బెట్టింగులు

- ఈటలపైనే అందరి దృష్టి

- ఎవరు గెలుస్తారు.. మెజార్టీ ఎంత?

- దేశవ్యాప్తంగా హుజూరాబాద్‌పైనే చర్చ

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

హుజూరాబాద్‌ బాద్‌షా ఎవరు.. ఈటల రాజేందర్‌కు ప్రజలు పట్టం కడుతున్నారా.. గెల్లు శ్రీనివాస్‌ గెలిచి తీరుతారా.. ఎవరు గెలిస్తే ఎంత మెజార్టీ అన్న అంశాలపై జోరుగా బెట్టింగు సాగుతోంది. జిల్లాలో కంటే వరంగల్‌, హైదరాబాద్‌, ఆంధ్రప్రాంతాల్లోనే బెట్టింగులు జోరుగా సాగుతున్నాయని తెలుస్తోంది. కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో కూడా రెండు, మూడు రోజులుగా పందేలు ప్రారంభమయ్యాయని తెలిసింది. ఆంధ్రా, మహారాష్ట్ర నుంచి  వచ్చి కొందరు పది రోజులుగా ఇక్కడ పర్యటించి ప్రచార సరళిని గమనించి గెలుపు ఓటములపై ఒక నిర్ధారణకు వచ్చి బుకింగ్‌లు ప్రారంభించినట్లు విశ్వసనీయ సమాచారం. హన్మకొండ కేంద్రంగా ప్రారంభమైన ఈ బెట్టింగ్‌ దందా ఆంధ్రాలోని పలు జిల్లాలకు, హైదరాబాద్‌ నగరానికి పాకినట్లు తెలుస్తున్నది. వివిధ ప్రాంతాలకు చెందినవారు కరీంనగర్‌ జిల్లాలో తమ బంధువులు, మిత్రులు, సన్నిహితులతో సంప్రదించి ఎవరు గెలుస్తున్నారు, ఏ రాజకీయ పార్టీ ఎలా ఉంది, అభివృద్ధి, సంక్షేమ పథకాల పట్ల ప్రజలు ఎలా స్పందిస్తున్నారు, డబ్బుల పంపిణీ తర్వాత ప్రజల మూడ్‌ ఎలా ఉంది అన్న అంశాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఎవరు గెలుస్తున్నారన్న ఆసక్తితో ఈ పరిశీలన చేసేవారు కొందరైతే బెట్టింగుల కోసమే సమాచారం సేకరిస్తున్నవారు మరికొందరు ఉన్నారని అంటున్నారు. బీజేపీ అభ్యర్థిగా ఉన్న ఈటల రాజేందర్‌ గెలుస్తాడని ఎక్కువ బెట్టింగ్‌ జరుగుతున్నట్లు సమాచారం. ఈటలపై 15,  20 రోజులుగా బెట్టింగ్‌ కొనసాగుతుండగా, గడిచిన ఐదు రోజుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌పై కూడా పెట్టుబడి పెట్టేవారు పెరిగారని తెలుస్తున్నది. బుధవారం ఓటర్లకు డబ్బుల పంపిణీ జరిగిన తర్వాత టీఆర్‌ఎస్‌ గెలుస్తుందని ఎక్కువ మంది బెట్టింగ్‌కు ముందుకు వచ్చారని, డబ్బులు అందలేదని ప్రజలు గొడవకు దిగడంతో బెట్టింగ్‌ చేసేవారు వెనక్కి తగ్గారని జిల్లాలో చర్చించుకుంటున్నారు. 

ఇప్పటికే వంద కోట్లకు పందెం

గత 20 రోజులుగా సాగుతున్న బెట్టింగ్‌ వ్యవహారంలో ఇప్పటికే వంద కోట్ల మేరకు పందెం కాసినట్లు అంచనా వేస్తున్నారు. ఈటల గెలుస్తాడని 10 వేల నుంచి 5 లక్షల వరకు కూడా పందెం కాశారని, అలాగే ఆయనకు 10 నుంచి 20 వేల మెజార్టీ వస్తుందని కూడా పందెం కాసినవారు ఉన్నారని సమాచారం. పందెం కాసినవారు చెప్పిన ఫలితం నిజమైతే పందెం సొమ్ముకు 10 రెట్ల సొమ్ము ఇచ్చేందుకు బుకీలు ఆఫర్‌ ఇస్తున్నారని, దీంతో జోరుగా బెట్టింగ్‌ సాగుతున్నట్లు సమాచారం. గెల్లు శ్రీనివాస్‌ గెలుస్తాడని, ఆయనకు కనీసం 10 వేల మెజార్టీ వస్తుందని బెట్టింగ్‌ కట్టినవారు కూడా ఉన్నారని సమాచారం. కాంగ్రెస్‌ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి, డిపాజిట్‌ దక్కుతుందా లేదా అన్న విషయంపై కూడా బుకీలు బెట్టింగ్‌కు ఆఫర్‌ ఇస్తున్నారని సమాచారం. కాంగ్రెస్‌ పార్టీకి 10 నుంచి 15 వేల ఓట్లు వస్తాయని బెట్టింగ్‌ కాసినవారు ఎక్కువగా ఉన్నారని సమాచారం.

లాడ్జీలు, రిసార్టుల్లో బుకీలు

 ప్రధానంగా లాడ్జీలు, రిసార్టులలో మకాం వేసి బుకీలు బెట్టింగ్‌ కొనసాగిస్తున్నారని, కొందరు ఈ వ్యవహారాన్ని వాట్సాప్‌లో, ఆన్‌లైన్‌లో కూడా కొనసాగిస్తున్నారని సమాచారం. రాష్ట్రంలో జరుగుతున్న ఏకైక ఉప ఎన్నిక కావడంతో అందరి దృష్టి ఇక్కడే ఉండడం, ఐదు నెలలుగా ప్రచారం జరుగుతూ దేశవ్యాప్తంగా హుజూరాబాద్‌ ఎన్నిక చర్చనీయాంశంగా మారడం, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థులు హోరాహోరీగా తలపడడం, కేసీఆర్‌ను ధిక్కరించి వచ్చిన వ్యక్తి తొలిసారిగా ఆయనను సవాల్‌ చేస్తూ ఎన్నిక ఎదుర్కోవడం, టీఆర్‌ఎస్‌ హుజూరాబాద్‌ ఎన్నికకు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి మంత్రులను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఇతర ముఖ్య నాయకులందరినీ కొద్ది నెలలుగా హుజూరాబాద్‌కు పంపించి ఎన్నికల పోరు హోరెత్తించడంతో దేశవ్యాప్తంగా ఇక్కడి గెలుపు పట్ల అందరిలో ఆసక్తి పెరిగింది. ఈ కారణంగానే జిల్లాలో, రాష్ట్రంలోనే కాకుండా పొరుగు రాష్ర్టాలవారు కూడా ఈ గెలుపుపై బెట్టింగ్‌లు కాసే స్థితి ఏర్పడింది. ప్రధానంగా బీజేపీ, టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు, రాజకీయ నాయకులు, అలవాటుగా బెట్టింగ్‌ కాసేవారు ఈ బెట్టింగులలో జోరుగా పాల్గొంటున్నారని సమాచారం. 


Updated Date - 2021-10-29T05:41:57+05:30 IST