మద్యం లైసెన్స్‌ల కోసం దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2021-11-10T05:32:39+05:30 IST

2021-23 ఎక్సైజ్‌ సంవత్సరానికిగాను(రెండు ఏళ్ళ కాలపరిమితి) జిల్లాలో మద్యం దుకాణాల లైసెన్స్‌ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తూ జిల్లా ఎక్సైజ్‌ సూపరిటెండెంట్‌(ఈఎస్‌) కె చంద్రశేఖర్‌ మంగళవారం షెడ్యూల్‌ విడుదల చేశారు.

మద్యం లైసెన్స్‌ల కోసం దరఖాస్తుల ఆహ్వానం
సమావేశంలో మాట్లాడుతున్న ఈఎస్‌ చంద్రశేఖర్‌

- 18వ తేదీ వరకు  స్వీకరణ

- 20న లాటరీ ద్వారా లైసెన్స్‌దారుల ఎంపిక

కరీంనగర్‌ క్రైం, నవంబరు 9: 2021-23 ఎక్సైజ్‌ సంవత్సరానికిగాను(రెండు ఏళ్ళ కాలపరిమితి) జిల్లాలో మద్యం దుకాణాల లైసెన్స్‌ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తూ జిల్లా ఎక్సైజ్‌ సూపరిటెండెంట్‌(ఈఎస్‌) కె చంద్రశేఖర్‌ మంగళవారం షెడ్యూల్‌ విడుదల చేశారు. ఈ మేరకు ఈస్‌ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మంగళవారం నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైందన్నారు. అన్ని పనిదినాల్లో (14వ తేదీ మినహా) ఉదయం 11 నుంచి 5 గంటల వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. దరఖాస్తు చేసుకునేందుకు 18వ తేదీ చివరి గడువుగా విధించారు. 20వ తేదీన లాటరీద్వారా షాపుల లైసెన్స్‌దారులను ఖరారు చేస్తారు. లైసెన్స్‌ ఫీజును ఆరు వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. ఎంపికైన లైసెన్స్‌దారులు 22వ తేదీలోగా మొదటి వాయిదా, ఎక్సైజ్‌ టాక్స్‌ చెల్లించాల్సి ఉంటుంది. లాటరీలో ఎంపికైన వైన్‌షాపులకు ఈ నెల 29న స్టాక్‌ కొనుగోలుకు అనుమతిస్తారు. డిసెంబరు 1న కొత్తగా వైన్‌షాపులను తెరవాల్సి ఉంటుంది. 2021 డిసెంబరు 1వ తేదీ నుంచి 2023 నవంబరు 30వ తేదీ వరకు లైసెన్స్‌ గడువు ఉంటుంది. కరీంనగర్‌ కలెక్టరేట్‌లోని లాండ్‌ ఆక్వేషన్‌ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ కార్యాలయ భవనంతోపాటు హైదరాబాద్‌లోని ఎక్సైజ్‌ కమిషనర్‌ కార్యాలయంలో గతంలో మాదిరిగానే 2 లక్షల రూపాయల డిడి లేదా చాలన్‌ జతచేసి దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఫ జిల్లాలో కొత్తగా ఏర్పాటైన వైన్స్‌

జిల్లాలో ఏడు వైన్స్‌ను కొత్తగా ఏర్పాటు చేశారు. కరీంనగర్‌ రూరల్‌ ఎక్సైజ్‌ సర్కిల్‌ పరిధిలోని రామడుగు మండలం గోపాల్‌రావుపేట గ్రామ పరిధిలో-1, హుజురాబాద్‌ ఎక్సైజ్‌ సర్కిల్‌ పరిధిలోని మొలంగూర్‌ పరిధిలో-1, సైదాపూర్‌ పరిధిలో-1, జమ్మికుంట ఎక్సైజ్‌ సర్కిల్‌ పరిధిలోని ఇల్లందకుంట పరిధిలో-1, వావిలాల పరిధిలో-1, తిమ్మాపూర్‌ ఎక్సైజ్‌ సర్కిల్‌ పరిధిలోని తిమ్మాపూర్‌ పరిధిలో-1, మానకొండూర్‌ మండలం అన్నారం పరిధిలో-1 వైన్స్‌ను ఏర్పాటు చేశారు. 

ఫ రిజర్వేషన్‌లుగా కేటాయించిన వైన్‌షాపుల వివరాలు...

జిల్లాలోని 94 వైన్‌షాపుల్లో ఎస్సీలకు తొమ్మిది, గౌడ కులస్థులకు 17 షాపులను రిజర్వ్‌ చేశారు. రేకుర్తి-1, కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని కొత్తపల్లి-1, కొత్తపల్లి మండలం ఆసిఫ్‌నగర్‌-1, గంగాధర మండలం మధురానగర్‌-1, చొప్పదండి-1, 2, చొప్పదండి మండలం ఆర్నకొండ-1, సైదాపూర్‌-1, జమ్మికుంటలోని గాంధీచౌక్‌-1 వైన్‌షాపులను ఎస్సీలకు రిజర్వ్‌ చేశారు. 

కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో జ్యోతినగర్‌ షాప్‌ నం.3, కార్ఖానగడ్డ షాప్‌ నం.3, మంకమ్మతోట షాప్‌ నం.2, షాప్‌ నం.3, అహ్మద్‌పుర షాప్‌ నం.2, షాప్‌ నం.4, కరీంనగర్‌ రూర్‌ మండలం దుర్శేడ్‌-1, కొత్తపల్లి మండలం ఆసిఫ్‌నగర్‌ షాప్‌ నం.3, ముగ్ధుంపూర్‌-1, తిమ్మాపూర్‌ మండలం అల్గునూర్‌-1, మానకొండూర్‌ మండలంలోని సదాశివపల్లి-1, చిగురుమామిడిలో షాప్‌ నం.2, హుజూరాబాద్‌లోని ఎస్‌డబ్ల్యూ కాలనీ షాప్‌ నం.3, శంకరపట్నం మండలం మొలంగూర్‌-1, జమ్మికుంటలోని గాంధీచౌక్‌ షాప్‌ నెం.3, వీణవంక షాప్‌ నం.1, జమ్మికుంట మండలం నాగంపేట్‌-1 వైన్‌షాపులను గౌడ కులస్థులకు రిజర్వ్‌ చేశారు. మిగతా 68 వైన్‌షాపులు జనరల్‌లో ఉన్నాయి. 

ఫ జిల్లాలోని 94 వైన్‌షాపులను జనాభాప్రాతిపదికన మూడు కేటగిరీలుగా విభజించారు. ఇందులో 50 లక్షల ఎక్సైజ్‌ టాక్స్‌ కింద 15, 55 లక్షల ఎక్సైజ్‌ టాక్స్‌ కింద 44, 65 లక్షల ఎక్సైజ్‌ టాక్స్‌ కింద 35 వైన్స్‌ ఉన్నాయి. 

ఫ 20న ఆడిటోరియంలో లాటరీ...

18వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా అందిన దరఖాస్తులకు 20వ తేదీ ఉదయం 11 గంటలకు కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో లాటరీ నిర్వహిస్తారు. కరీంనగర్‌, హైదరాబాద్‌లో వచ్చిన దరఖాస్తులన్నిటినీ ఒకచోట చేర్చిన తరువాత కలెక్టర్‌ సమక్షంలో ఒక్కోషాపునకు వచ్చిన దరఖాస్తులకు లాటరీ ద్వారా ఒకరిని ఎంపికచేస్తారు. దరఖాస్తుదారుల తరపున ఆథరైజ్‌డ్‌ పర్సన్‌లను కూడా అనుమతిస్తారు. 

ఫ వాక్‌ ఇన్‌ స్టోర్‌....

వైన్‌షాపుకు అదనంగా ఒక ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేసుకుని అందులో వివిధ రకాల మద్యం, మద్యానికి సంబంధించిన వస్తువులు పెట్టి అమ్మకాలు సాగించేందుకు మరో ఐదు లక్షల రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దీనినే వాక్‌ ఇన్‌ స్టోర్‌గా పిలుస్తారు. ఈ వాక్‌ ఇన్‌ స్టోర్‌లో గ్లాస్‌లు, ఐస్‌బకెట్స్‌, ఐస్‌టాంగ్స్‌, వైన్‌ కార్క్స్‌ స్కూృ, ట్రేస్‌ తదితర వస్తువులను విక్రయించేందుకు అనుమతిస్తారు. ఈ స్టోర్‌లోపలికి కస్టమర్లను అనుమతిస్తారు. ఈ విధంగా కరీంనగర్‌లో మూడు వైన్‌షాపులు వాక్‌ ఇన్‌ స్టోర్‌లను గత ఏడాది ఏర్పాటు చేశాయి. ఈ సారి కూడా దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ జారీ అయింది. 

Updated Date - 2021-11-10T05:32:39+05:30 IST