ఆంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

ABN , First Publish Date - 2021-02-26T05:30:00+05:30 IST

సైబరాబాద్‌ సీసీఎస్‌, ఎల్‌ఎండీ పోలీసులు సంయుక్తంగా కరుడుగట్టిన ఆంతర్రాష్ట్ర దొంగల ముఠాను కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లిలో శుక్రవారం ఉదయం పట్టుకున్నారు.

ఆంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
కొత్తపల్లి వద్ద పోలీసులు పట్టుకున్న పారీఽ్ధ అంతరాష్ట్ర దొంగల ముఠా సభ్యులు

- మరణాయుధాలు..సెల్‌ఫోన్‌లు, నగదు పట్టివేత

- సంచారజీవులుగా చెలామణి అవుతున్న దొంగల ముఠా

- పారిపోయిన వారి కోసం గాలిస్తున్న పోలీసులు

తిమ్మాపూర్‌, ఫిబ్రవరి 26 : సైబరాబాద్‌ సీసీఎస్‌, ఎల్‌ఎండీ పోలీసులు సంయుక్తంగా కరుడుగట్టిన ఆంతర్రాష్ట్ర దొంగల ముఠాను కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లిలో శుక్రవారం ఉదయం పట్టుకున్నారు. ఎల్‌ఎండీ ఎస్సై కృష్ణారెడ్డి, కొత్తపల్లి గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. దొంగతనాలు చేసేందుకు మధ్యప్రదేశ్‌ రాష్ట్రం నుండి వచ్చిన పార్థీ గ్యాంగ్‌ దొంగల ముఠా సంచార జీవులుగా పూసలు, ఇతర వస్తువులు అమ్ముకుంటూ దొంగతనాలకు పాల్పడి విలువైన వస్తువులను దోచుకోవడం, అవసరమైతే హత్యలు చేయడం తిరిగి అక్కడి నుండి పారిపోయి వేరే చోటికి మకాం మార్చడం వీరి ప్రవృత్తి.  దొంగిలించిన సొమ్మును వారి స్వస్థలాలకు తీసుకువెళ్లి అక్కడ అమ్ముకుని తిరిగి వచ్చి మళ్లీ దొంగతనాలకు పాల్పడటం వీరికి అలవాటు. ఈ ముఠా హైదరాబాద్‌ పరిసర ప్రాంతాలలో దొంగతనాలకు పాల్పడి తప్పించుకు తిరుగుతున్నారు.  వీరు బుధవారం రాత్రి తిమ్మాపూర్‌ మండలం కొత్తపల్లి గ్రామ శివారులో హుస్నాబాద్‌ రహదారిలో ఐకేపీ కొనుగోలు కేంద్రంలో కుటుంబ సమేతంగా వచ్చి గుడారాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. వారి సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ అధారంగా పార్ధీ ముఠా కోసం గాలిస్తున్న సైబారాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు గురువారం రాత్రి కొత్తపల్లి గ్రామానికి చేరుకున్నారు. శుక్రవారం ఉదయం ఎల్‌ఎండీ ఎస్సై కృష్ణారెడ్డి సహకారంతో సీసీఎస్‌ సీఐ మహేష్‌ సంయుక్తంగా వారి సిబ్బందితో కలిసి, కొత్తపల్లి గ్రామస్ధులు, యువకుల సహకారంతో దొంగల ముఠాను చుట్టు ముట్టారు. ముఠాలోని ఒక సభ్యుడు పక్కనే ఉన్న మోయతుమ్మెద కాలువలోకి దూకి పారిపోయేందుకు ప్రయత్నించగా స్థానిక యువకులు, కాలువలో దూకి దొంగను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. మరికొందరు దొంగలు తప్పించుకొని పారిపోయారు. దొంగల ముఠా వద్ద నుండి మరణాయుఽధాలు, నగదు, సెల్‌ఫోన్‌లు, ఆభరణాలు, ఎర్ర చందనం దుంగలు, ఒక స్పోర్ట్స్‌ సైకిల్‌, పలు వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు, పారిపోయిన ముఠా సభ్యుల కోసం గాలిస్తున్నట్లు ఎల్‌ఎండి ఎస్సై కృష్ణారెడ్డి తెలిపారు. దొంగలను సైబరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు హైదారాబాద్‌ తీసుకొని వెళ్లారు. దీంతో దొంగలకు సంబంధించిన కుంటుంబ సభ్యులు మహిళలు వారి పిల్లలను తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోయారు. వీరు ఎక్కడి వెళ్లారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పోలీసులు చాకచక్యంతో పట్టుకోవడం అభినందనీయమని లేకపోతే కరీంనగర్‌ చుట్టు పక్క ప్రాంతాలలో ఈ ముఠా దొంగతనాలకు పాల్పడి ఉండేదని కొత్తపల్లి గ్రామస్థులు పేర్కొన్నారు. కాగా దొంగల ముఠాను పట్టుకునేందుకు సహకరించిన యువకులను, గ్రామస్ధులను ఎల్‌ఎండీ ఎస్సై కృష్ణారెడ్డి అభినందించారు.

స్వస్థలాలకు దొంగల ముఠాలోని మహిళలు, పిల్లలు : 

కుటుంబ సభ్యులతో కలిసి గుడారాలు ఏర్పాటు చేసుకున్న పార్థీ అంతర్రాష్ట్ర దొంగల ముఠా ఐదుగురు సభ్యులను  పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వారి కుంటుంబ సభ్యులు మహిళలు పిల్లలను తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోయారు. కొత్తపల్లి నుండి ఆర్‌టీసీ బస్సులో కరీంనగర్‌ బస్‌స్టేషన్‌కు చేరుకొని కొద్దిసేపు అక్కడే ఉండి తిరిగి ఆటోలు మాట్లాడుకుని  కరీంనగర్‌ రైల్వే వేస్టేషన్‌కు వెళ్లారు. అక్కడ కొద్ది సేపు ఉండి ట్రైన్‌ వచ్చేవేళ కాలేదని తెలుసుకుని తిరిగి కరీంనగర్‌ బస్‌స్టాండ్‌కు చేరుకున్నారు. అక్కడ మంచిర్యాల బస్‌ ఎక్కి రామగుండం టికెట్‌ తీసుకొని వెళ్లారు. రామగుండం నుండి వారు ట్రైన్‌ ద్వారా వారి స్వస్థలాలకు వెళ్లిపోతారా? లేదా ఎక్కడికైనా వెళతారా అని పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. 

Updated Date - 2021-02-26T05:30:00+05:30 IST