కోల్‌బెల్ట్‌లో పెరుగుతున్న కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-03-21T05:35:33+05:30 IST

కోల్‌బెల్ట్‌లో కరోనా మళ్లీ పంజా విసురుతోంది. సెకండ్‌ వేవ్‌ కరోనా ప్రారంభం కావడంతో క్రమంగా కేసులు పెరుగుతున్నాయి.

కోల్‌బెల్ట్‌లో పెరుగుతున్న కరోనా కేసులు

-సింగరేణిలో పలువురు అధికారులు, కార్మికులు, కుటుంబ సభ్యులకు పాజిటివ్‌

- ఏరియా ఆసుపత్రి ఐసోలేషన్‌లో 10మంది బాధితులు..

గోదావరిఖని, మార్చి 20: కోల్‌బెల్ట్‌లో కరోనా మళ్లీ పంజా విసురుతోంది. సెకండ్‌ వేవ్‌ కరోనా ప్రారంభం కావడంతో క్రమంగా కేసులు పెరుగుతున్నాయి. నాలుగు రోజుల క్రితం రామగుండం ఓసీపీ-1లో ఇద్దరు అధికారులు, నలుగురు కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు కరోనా సోకడంతో కార్మికుల్లో ఆందోళన మొదలైంది. కరోనా తగ్గుముఖం పట్టడంతో చాలామంది తగిన జాగ్రత్తలు తీసుకోకుండా బయట తిరుగుతుండడంతో కేసులు ఉదృతమవుతున్నాయి. సింగరేణి ఏరియా ఆసుపత్రిలో పది మంది ఐసోలేషన్‌లో చికిత్స పొందుతుండగా, పలువురు ఇంటి వద్దనే హోమ్‌ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. శనివారం ఆర్‌జీ-1లో ముగ్గురికి, ఆర్‌జీ-3లో ఐదుగురికి కరోనా పాజిటివ్‌ రాగా, గోదావరిఖని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోజుకు రెండు నుంచి మూడు కేసులు నమోదు అవుతున్నాయి. గనులు, ఓపెన్‌కాస్టుల్లో గుంపులు గుంపులుగా కార్మికులు ఉండడం, ఒకే చోట పనిచేయడంతో కరోనా సోకినవారు కూడా ఉద్యోగాలకు రావడంతో తొందరగా కరోనా విస్తరిస్తోందని వైద్య సిబ్బంది పేర్కొంటున్నారు. గోదావరిఖని ప్రభుత్వాసుపత్రిలో రోజుకు 50మందికి టెస్టులు చేస్తుండగా, అందులో మూడు నుంచి నాలుగు కేసులు నమోదవుతున్నాయి. అర్బన్‌ హెల్త్‌సెంటర్‌, అడ్డగుంటపల్లి, లక్ష్మీపూర్‌, అల్లూరు, ఫైవింక్లయిన్‌ సెంటర్లలో కూడా రోజుకు రెండు మూడు పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. చాలామంది టెస్టులు చేయించుకోకుండానే అనుమానంతో వైద్యుల సలహాలు, సూచనలు తీసుకుంటూ ఇంట్లోనే చికిత్స పొందుతున్నారు. 

మాస్క్‌లు ధరించకుండానే విచ్చలవిడిగా రోడ్లపైకి...

చాలామంది కరోనాను లెక్కచేయకుండా మాస్క్‌లు ధరించకుండానే రోడ్లపైకి వస్తూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం లేదు. రోడ్లపై ఎక్కడచూసినా చాలా మంది మాస్క్‌లు ధరించకుండానే తిరుగుతున్నారు. మొదట పాటించిన స్థాయిలో జాగ్రత్తలు పాటించడం లేదు. శానిటైజర్లు, మాస్క్‌లను వాడకపోవడంతో సెకండ్‌ వేవ్‌ కరోనా త్వరగా విస్తరిస్తోందని వైద్యులు చెబుతున్నారు. 


Updated Date - 2021-03-21T05:35:33+05:30 IST