గజ గజ

ABN , First Publish Date - 2021-12-19T06:18:11+05:30 IST

వాతావరణంలో మార్పులు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఎండలు దంచికొట్టాయి. వర్షాలు భయపెట్టాయి. శీతాకాలం చలి చంపేస్తోంది.

గజ గజ
సిరిసిల్లలో తెల్లవారుజామున కురుస్తున్న మంచు

 -  పెరిగిన చలి తీవ్రత

- జిల్లాలో 10.7 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రత 

- మొదలైన చలిగాలుల ప్రభావం

- వృద్ధులు, పిల్లలు జాగ్రత్త 

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

వాతావరణంలో మార్పులు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఎండలు దంచికొట్టాయి. వర్షాలు భయపెట్టాయి. శీతాకాలం  చలి చంపేస్తోంది.  మూడు రోజులుగా చలి తీవ్రత పెరుగుతోంది. జిల్లాను పొగమంచు కమ్మేస్తోంది.  శనివారం గరిష్ఠ ఉష్ణోగ్రత 30.5 డిగ్రీలు  ఉండగా కనిష్ఠ ఉష్ణోగ్రత 10.7 డిగ్రీలకు పడిపోయింది. చలికి తోడు ఈదురు గాలులతో జనం బెంబేలెత్తిపోతున్నారు. డిసెంబరు చివరి వారంలోనే చలి తీవ్రత పెరగడంతో జనవరిలో మరింత ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. తగ్గుతున్న ఉష్ణోగ్రతతో వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఉదయం వేళల్లో మంచుతీవ్రత ఎక్కువగా ఉండడంతో చలి మంటలు మొదలయ్యాయి. ప్రధానంగా అటవీ ప్రాంతాల్లోని గ్రామాల్లో చలితీవ్రత ఎక్కువగా ఉంది. మరో నాలుగు రోజులపాటు చలిగాలులు, చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. 

 ఉన్ని దుస్తుల అమ్మకాల జోరు 

 చలి నుంచి రక్షణకు జనం  నూలు వస్త్రాలు కొనుగోలు చేస్తున్నారు.  రాజస్థాన్‌, మహారాష్ట్ర నుంచి వచ్చిన చిరువ్యాపారులు అంబేద్కర్‌ చౌరస్తా వద్ద ప్రత్యేక గుడారాలు వేసుకొని దుకాణాలను ఏర్పాటు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చే జనం మంకీ క్యాప్‌లు, సాక్స్‌లు, జర్కీన్‌లు, స్వెటర్‌లు, టోపీలు, మప్లర్లతో చలిని ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ సారి ధరలు కొంత పెరిగినా ఆకర్షణీయమైన రంగుల్లో స్వెటర్లు అందుబాటులో ఉన్నాయి.  చిన్న పిల్లల క్యాపులు రూ.50 నుంచి రూ.100 వరకు, సాక్స్‌లు రూ.25 నుంచి రూ.100 వరకు, జర్కీన్‌లు రూ.100 నుంచి రూ.700 వరకు, పెద్దలకు స్వెటర్లు రూ.200 నుంచి రూ.1000 వరకు టోపీలు రూ.50 నుంచి రూ.150 వరకు, జర్కీన్‌లు రూ.500 నుంచి రూ.1500 వరకు, చెవుల క్యాపులు రూ.50 నుంచి రూ.100 వరకు, మహిళల క్యాపులు రూ.30 నుంచి రూ.110 వరకు, మప్లరు రూ.75 నుంచి రూ.200 వరకు విక్రయిస్తున్నారు. 

శ్వాసకోశ సమస్యలుంటే జాగ్రత్త

ఫ చలికాలంలో అస్తమా ఉన్న వారు నిత్యం వాడే మందులను  సిదంగా ఉంచుకోవాలి.

ఫ సిగరేట్‌ అలవాటు ఉన్నవారు మానివేయాలి. ఫ దుమ్ము, ధూళీ పనులకు దూరంగా ఉండాలి. ఫ చల్లని గాలికి ఎక్కువగా తిరగవద్దు. శ్వాసనాళాలు మూసుకుపోకుండా  మందులు వాడాలి.

ఫఇన్‌హేలర్‌, నెబ్లయిజర్‌ వంటి వాటిని వాడాలి. ముక్కుభాగంలో ఇన్‌ ఫెక్షన్‌ ఎక్కువై తెమడ పేరుకుపోయి ఇబ్బంది పడే వారు సిరప్‌లు వాడాలి.

ఫ చలికాలంలో ద్విచక్రవాహనంపై ప్రయాణించే వారు హెల్మెట్‌ తప్పనిసరిగా ఉపయోగించాలి. స్వెట్టర్‌లను ధరించాలి. 


గుండెజబ్బులుంటే..

ఫ చలికాలంలో గుండెజబ్బు ఉన్నవారు, గుండె ఆపరేషన్‌ చేయించుకున్నవారు వాకింగ్‌ చేయవద్దు. 

ఫ చలిలో ఎక్కువగా తిరగడంతో రక్తనాళాలు సంకోచించి గుండెకు సంబంఽదించిన సమస్యలు వస్తాయి. బీపీ, షుగర్‌ ఉన్న వారు కూడా ఈ జాగ్రత్తలు పాటించాలి. 

ఫ ఉన్నఫలంగా ఛాతీలో నొప్పి, నడవలేకపోవడం, చెమటలు పట్టడం వంటి సమస్యలు వచ్చినప్పుడు డాక్టర్లను సంప్రదించాలి.


పిల్లలపై దృష్టిసారించాలి 

ఫ చలికాలంలో చిన్నారులకు జబ్బులు రాకుండా జాగ్రత్తలు పడాలి.

 ఫ చలి నుంచి రక్షణ కోసం స్వెట్టర్‌లను తొడిగించాలి. వేడినీటితో స్నానం చేయించాలి. ప్రయాణాలు తగ్గించుకోవడం మంచిది. 

ఫ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. పిల్లలకు ఇచ్చే ఆహారంలో ఆకు కూరలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.

ఫ సీతాఫలాలు, ఐస్‌క్రీమ్‌లు, చాక్‌లేట్లు తినిపించవద్దు. జలుబు, జ్వరం వస్తే డాక్టర్లను సంప్రదించాలి. 

చర్మ సమస్యలు బాధిస్తాయి

ఫ చలి కాలంలో చర్మ సమస్యలు బాధిస్తాయి.    మాయిశ్చరైజర్లు. క్రీమ్‌బెస్డ్‌ మాయిశ్చరైజర్లను ఉపయోగించాలి. ముఖానికి, చేతులకు, కాళ్లకు రాసుకోవడంతో చర్మం మృధువుగా, కోమలంగా ఉంటుంది.

 ఫ ఎన్నో రకాల మాయిశ్చరైజర్లు అందుబాటులో ఉన్నాయి. రోజు పడుకునే ముందు, నిద్రలేవగానే మాయిశ్చరైజర్లు రాసుకోవాలి. 

ఫ చలికాలంలో వేధించే మరో సమస్య పెదాలు పగిలి రక్తం కారడం. అందుకే పెదాలకు వ్యాజిలిన్‌, లిప్‌బామ్‌ వంటివి రాసుకోవాలి. 

ఫ పాదాలు పగలడం ఎక్కువగా ఉంటుంది. ఉప్పు నీరు కలిపిన గోరువెచ్చని నీటిలో పాదాలను పది నిమిషాలు ఉంచాలి. ప్రతీరోజు పడుకునే ముందు ఇలా చేయాలి. నీటిలో ఉంచిన తరువాత సబ్సుతో శుభ్రంగా కడుక్కుని పొడి గుడ్డతో శుభ్రంగా తుడవాలి. పగిలిన చోట మాయిశ్చరైజర్‌ రాయాలి. విటమిన్‌- ఇ క్రీమ్‌ రాస్తే మంచిది. 

ఫ  చర్మం తెల్లగా పొడిబారకుండా ఉండడానికి గ్లిజరిన్‌ సోప్‌ వాడాలి. స్నానం సోప్‌ కూడా ఆయిల్‌ బేస్డ్‌తో ఉన్నది మంచిది. అప్పుడే చర్మం మృధువుగా ఉంటుంది.

ఫ సబ్బుతో చర్మాన్ని ఎక్కువ సేపు రుద్దకుండా ఉండాలి. స్నానానికి ముందు ఆలీవ్‌ ఆయిల్‌, కొబ్బరినూనెతో మసాజ్‌ చేసుకొని తలస్నానం చేయాలి. 

ఫ చలికాలం అనగానే బాగా వేడి నీటితో స్నానం చేస్తే చలిపోతుందని అనుకుంటారు. కానీ అలా చేయడంతో చర్మం పొడిబారుతుంది. గోరువెచ్చని నీటితోనే స్నానం చేయాలి. 

ఫ చలికాలం బకెట్ల కొద్దీ స్నానం చేస్తారు. దాని వల్ల చర్మంపై ఉండే కణాలు దెబ్బతింటాయి. చర్మం ముడతలు బారుతోంది. వయస్సు పైబడినట్లు కనిపిస్తుంది. గోరువెచ్చని నీటితో పది నిమిషాలు స్నానం చేస్తే సరిపోతుంది. 

ఫ చలికాలంలో రాత్రి వేళ పనులు ముగించుకొని ఇంటికి వెళ్లేవారు, పనుల నిమిత్తం బయటకు వచ్చే వారు ఊలు దుస్తులు ధరించాలి. 

ఫ నాసిరకం ఊలు దుస్తులతో అలర్జీ వంటివి వచ్చే అవకాశం ఉంది. బ్రాండెడ్‌ దుస్తులు వినియోగించాలి. 

ఫ  బైక్‌లపై వెళ్లే వారు మంకీక్యాప్‌, కాళ్లకు షూ, తలకు హెల్మెట్‌ చేతులకు గ్లౌజ్‌ ధరించాలి. 


చలిమంటలు.. జాగ్రత్తలు

చలికాలం అనగానే తెల్లవారుజామునే ఆరుబయట మంటలు వేసుకోవడం అలవాటు. మంటలు వేసుకునే సమయంలో చిన్నారులను దగ్గరకు వెళ్లకుండా చూసుకోవాలి. మహిళలు చీర కొంగులను జాగ్రత్తగా గమనించాలి. మంట వద్ద పరాచకాలు ఆడడం కూడా ప్రమాదానికి దారితీస్తుంది. Updated Date - 2021-12-19T06:18:11+05:30 IST