ఉపాధి పనుల్లో కూలీల సంఖ్య పెంచాలి
ABN , First Publish Date - 2021-05-21T05:35:54+05:30 IST
ఉపాధిహామీ పనుల్లో కూలీల సంఖ్యను పెంచాలని కలెక్టర్ కె శశాంక అధికారులను ఆదేశించారు.

- కలెక్టర్ కె శశాంక
కరీంనగర్, మే 20 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఉపాధిహామీ పనుల్లో కూలీల సంఖ్యను పెంచాలని కలెక్టర్ కె శశాంక అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుంచి అన్ని మండలాల ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీడీవోలు, ఈఎల్‌పీవోలతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధిహామీ పనుల్లో భాగంగా హరితహారం, నర్సరీలు, వైకుంఠధామాలు, సెగ్రిగేషన్ షెడ్లు, పల్లె ప్రగతి వనాలు, శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డుల నిర్మాణాలను ఎక్కువ మంది కూలీలతో త్వరగా పూర్తి చేయాలని అన్నారు. ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలు రెండు గ్రామాల చొప్పున బాధ్యత తీసుకని కూలీల సంఖ్యను పెంచడంపై దృష్టిపెట్టాలని ఆదేశించారు. పనులు చేస్తున్న వారందరికీ జాబ్ కార్డులను గిట్టుబాటు వేతనం వచ్చేలా చూడాలన్నారు. కూలీలకు సకాలంలో చెల్లింపులు చేయాలని తెలిపారు. కూలీలకు లక్ష్యం మేరకు ఉపాధి పనులను కల్పించని అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని మండలాల అధికారులు పనులన్నీ సకాలంలో పూర్తయ్యే విధంగా చూడాలన్నారు. హరితహారం నర్సరీలకలు వాచ్‌మెన్‌లను నియమించుకోవాలని, మొక్కలకు నీరందించి వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీలత, జడ్పీ సీఈవో రమేశ్, జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య, డీఎల్పీవో హరికిషన్, ఏపీడీ మంజులాదేవి పాల్గొన్నారు.