కాంగ్రెస్ గెలిస్తే టీఆర్‌ఎస్, బీజేపీని నిలదీస్తుంది
ABN , First Publish Date - 2021-10-28T05:35:34+05:30 IST
హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిస్తే బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీలను నిలదీస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు.

- టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి
హుజూరాబాద్ రూరల్, అక్టోబరు 27: హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిస్తే బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీలను నిలదీస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. బుధవారం హుజూరాబాద్‌లో ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రచారసభలో ఆయన మాట్లాడారు. ఆత్మ బలిదానాలతో తెచ్చుకున్న తెలంగాణలో మొదటి శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమరవీరుల కుటుంబాలకు ఇచ్చిన హామీలు ఇప్పటికి నెరవేర్చలేదన్నారు. తెలంగాణ కోసం 1569మంది ప్రాణ త్యాగం చేస్తే వారి కుటుంబాలను ఆదుకోవాలని ఈటల రాజేందర్ ఏ రోజైనా అడిగారా అని ప్రశ్నించారు. ఈటల రాజేందర్, హరీష్‌రావు తోడు దొంగలన్నారు. బల్మూరి వెంకట్‌ను కొందరు అనామకుడని అంటున్నారని, ఈ అనామకుడిని చూసి టీఆర్‌ఎస్, బీజేపీ నాయకులకు లాగులు తడుస్తున్నాయన్నారు. టీఆర్‌ఎస్ తరుపున గాడిదను పెట్టి గెలిపిస్తామని ఓ నాయకుడు అన్నాడని, ఇప్పుడు టీఆర్‌ఎస్ పెట్టిన వ్యక్తి గాడిద అన్నట్లే కదా అని, ఆ గాడిదకు ఓటు ఎలా వేస్తారో ఆలోచించాలన్నారు. ఈ ఉప ఎన్నిక నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల భవిష్యత్‌పై ఆధారపడి ఉందన్నారు. 60 వేల మంది నిరుద్యోగ యువత నిలదీస్తారని మొఖం చెల్లకే కేసీఆర్ సభ పెట్టలేదన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, దామోదర రాజనర్సింహ, మాజీ ఎంపీ పొన్నంప్రభాకర్, ఎమ్మెల్యే సీతక్క, జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్, ఆది శ్రీనివాస్, సంగీతం శ్రీనివాస్ పాల్గొన్నారు.