నేను గొంతెత్తితేనే హరీష్‌రావుకు మంత్రి పదవి

ABN , First Publish Date - 2021-10-08T05:02:37+05:30 IST

‘నేను గొంత్తెతితేనే నా మిత్రుడు హరీష్‌రావుకు రెండోసారి మంత్రి పదవి వచ్చింది’ అని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ అన్నారు.

నేను గొంతెత్తితేనే హరీష్‌రావుకు మంత్రి పదవి
సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్‌

 48గంటల్లో దళిత బంధు పైసలు ఇవ్వాలి 

 మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ 


జమ్మికుంట, అక్టోబరు 7: నేను గొంత్తెతితేనే నా మిత్రుడు హరీష్‌రావుకు రెండోసారి మంత్రి పదవి వచ్చింది’ అని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ అన్నారు. గురువారం ఆబాది జమ్మికుంటలో దళిత మోర్చా సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ  హరీష్‌రావు తన అంతరాత్మ సాక్షిగా అవమానాలు జరిగాయా లేదో చెప్పాలన్నారు. 2018లో కాంగ్రెస్‌ అభ్యర్ధికి డబ్బులు ఇచ్చి తనను ఓడించాలని చూశారన్నారు. కేటీఆర్‌, హరీష్‌రావు సీఎం సీటుకు ఎసరు పెట్టి తనపై నెపం నెట్టారన్నారు. తన ప్రచారంలో డప్పులు కొట్టే వారికి, వెంట తిరిగే వాళ్లకు దళితబంధు ఇవ్వమని బెదిరించడం బాధాకరం అన్నారు. దళిత బంధు ఆన్‌ గోయింగ్‌ స్కీమ్‌ అని ఎన్నికల కమిషన్‌ చెప్పిందని, 48 గంటల్లో అందరికీ దళిత బంధు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అర్హులందరికీ దళిత బంధు డబ్బులు వచ్చే వరకు పోరాటం చేసే బాధ్యత తనది అన్నారు. మాజీ మంత్రి బాబుమోహన్‌ మాట్లాడుతూ కేసీఆర్‌ కుటుంబం అంతా దళిత వ్యతిరేకులే అని మాజీ మంత్రి బాబుమోహన్‌ అన్నారు. తాను గడుప గడుపకు తిరిగి ప్రచారం చేస్తానన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి చంద్రశేఖర్‌, మాజీ ఎంపీలు వెంకటస్వామి, మునుస్వామి, మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ హజరయ్యారు. 


 మతం, కులం ఆధారంగా పేదరికం ఉండదు 


జమ్మికుంట రూరల్‌: మతం, కులం ఆధారంగా పేదరికం ఉండదని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ అన్నారు. గురువారం పట్టణంలోని స్వాతి గార్డేన్‌లో ఏర్పాటు చేసిన మైనార్టీ మోర్చా సమావేశంలో ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ ముస్లింలకు కూడా ముస్లింబంధు కింద పది లక్షలు ఇవ్వాలన్నారు. మైనార్టీలకు ఇచ్చే ఎకనామికల్‌ సపోర్ట్‌ స్కీమ్స్‌ అన్నింటికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేయాలన్నారు. 


 హుజూరాబాద్‌ మండలంలో..


హుజూరాబాద్‌ రూరల్‌: మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ గురువారం మండలంలోని కందుగుల, ధర్మరాజుపల్లి గ్రామాల్లో  ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై అసత్య ఆరోపణలు చేస్తూ, తప్పుడు ప్రచారం చేస్తున్న నాయకులకు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

Updated Date - 2021-10-08T05:02:37+05:30 IST