హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఎఫెక్ట్.. మరికొన్ని వరాలు!

ABN , First Publish Date - 2021-08-22T05:56:20+05:30 IST

ఉప ఎన్నిక పుణ్యమా అని..

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఎఫెక్ట్.. మరికొన్ని వరాలు!

వరాల వాన..

హుజూరాబాద్ నేతలకు మరికొన్ని పదవులు

తెరపైకి పలువురి పేర్లు


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌): ఉప ఎన్నిక పుణ్యమా అని హుజూరాబాద్‌ నాయకులను అదృష్టం వరిస్తోంది. టీఆర్‌ఎస్‌ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జిల్లా నాయకులు పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. వారెవరికీ పదవీ యోగం లేకున్నా హుజూరాద్‌ నేతలకు మాత్రం అడగకున్నా పదవులు వస్తున్నాయి. ఒకటి, రెండు నెలల్లో ఇక్కడ ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఇక్కడ విజయం సాధించేందుకు ప్రయత్నిస్తున్న టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం ప్రతి చిన్న అవకాశాన్ని వినియోగించుకుంటున్నది. టీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌పైన, ఆయన విధానాలపైన, ఆయన అనుసరిస్తున్న వైఖరిపైన విమర్శనాస్ర్తాలు ఎక్కుపెట్టి కొరకరాని కొయ్యగా తయారయ్యారు.


ఈటల రాజేందర్‌ విజయం సాధిస్తే బీజేపీ  ప్రత్యామ్నాయ పార్టీ తమదేనని చెప్పుకుంటుందని టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం భావిస్తున్నది. కాంగ్రెస్‌ను కకావికలం చేసిన తమకు ఎంతోకొంత బీజేపీ నుంచి ప్రమాదం ఉన్నదని ఆ పార్టీ నేతలు అనుకుంటున్నారు. హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌ను, బీజేపీని మట్టికరిపించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ మార్గదర్శకత్వంలో మంత్రి హరీశ్‌రావు వ్యూహరచన చేస్తున్నారు. వాటిని జిల్లా ఇన్‌చార్జి మంత్రి గంగుల కమలాకర్‌ క్షేత్రస్థాయిలో అమలు చేస్తూ కేడర్‌ను కాపాడుతూ వస్తున్నారు. టీఆర్‌ఎస్‌ నుంచి ఈటల వెంట వెళ్లిన వారందరిలో 90 శాతానికిపైగా తిరిగి పార్టీలోకి తీసుకురాగలిగారు. ప్రస్తుతం ఈటల వెంట ఎవరెవరు ఉన్నారో వారిపై కూడా దృష్టిసారించి గ్రామాల్లో ఆయన తరపున ఓటు అడగడానికి, పోలింగ్‌ ఏజెంట్లుగా ఉండడానికి ఎవరు ఉండవద్దనే లక్ష్యతో ఎత్తుగడలు వేస్తున్నారు. 


ఈటల సన్నిహితులపై దృష్టి

రెండేళ్లుగా అదుగో ఇదుగో అంటూ ఊరిస్తూ వస్తున్న నామినేటెడ్‌ పదవులను ఈ సందర్భంగా ఎరచూపుతూ పార్టీ నేతలను కట్టడి చేయడంలో టీఆర్‌ఎస్‌ కొంత విజయం సాధిస్తున్నది. ఇప్పటికే ఈటలకు దగ్గర వ్యక్తిగా భావించే బండ శ్రీనివాస్‌ను ఆయనవైపు వెళ్లకుండాచూసి ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవిని అప్పగించింది. ఇప్పుడు మరికొందరికి కూడా పదవులు కట్టబెట్టాలని చూస్తున్నది. 


ఈటల సామాజికవర్గానికే చెందిన పింగిలి రమేశ్‌ ఈ ఎపిసోడ్‌లో ఈటలకు అండగా ఉంటూ వస్తున్నారు. ఆయన గతంలో జమ్మికుంట మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా, విలాసాగర్‌ సర్పంచ్‌గా పనిచేశారు. ఆయన భార్య రమాదేవి ప్రస్తుతం విలాసాగర్‌ సర్పంచ్‌గా ఉన్నారు. పింగిలి రమేశ్‌ను ఈటల నుంచి దూరం చేసి తిరిగి టీఆర్‌ఎస్‌లోకి రప్పించుకోవడానికి ఆయనకు ఫిషరీస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవిని ఇవ్వనున్నట్లు తెలుస్తున్నది. రెండు, మూడు రోజులుగా ఈ విషయం పార్టీ నేతల్లో జోరుగా ప్రచారం సాగుతున్నది. గడిచిన నెల 15 రోజులుగా పింగిలి రమేశ్‌పై ఆకర్ష్‌ వలలు విసిరి మంత్రి హరీశ్‌రావు ఆయనకు నచ్చజెప్తున్నట్లు సమాచారం. హరీశ్‌రావు మంత్రాంగంతోనే రమేశ్‌ నెల రోజులుగా ఈటల వెంట తిరగకుండా దూరంగా ఉంటున్నారు. ఇప్పటికీ ఆయన టీఆర్‌ఎస్‌లోనూ తిరగడం లేదు. ఒకటి రెండు రోజుల్లో ఆయనకు ఫిషరీస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవిని ప్రకటిస్తారని, అంతకుముందే ఆయన టీఆర్‌ఎస్‌ కండువాను కప్పుకుంటారని తెలుస్తున్నది. 


జమ్మికుంట మాజీ సర్పంచ్‌, ప్రస్తుత కౌన్సిలర్‌ పొనగంటి మల్లయ్య కూడా ఈటల రాజేందర్‌పై పోటీ చేయడానికి టీఆర్‌ఎస్‌ నుంచి టికెట్‌ ఆశించారు. ఆయన కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. ఆయన భార్య శారద మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌. అడ్తిదారుగా, వ్యవసాయదారుగా నియోజకవర్గంలోని రైతులతో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్‌ కాపు సామాజికవర్గం ఓట్లను చీల్చడానికి కొండా సురేఖ పేరును తెరపైకి తేవడంతో తనకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. ఇక్కడ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ పేరును ప్రకటించడంతో రాష్ట్రస్థాయి పదవి ఏదైనా తనకు కట్టబెట్టాలని మల్లయ్య కోరుతున్నట్లు తెలిసింది. జిల్లా మంత్రి గంగుల కమలాకర్‌, నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్న మంత్రి హరీశ్‌రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ ఆశీస్సులు  ఆయనకు ఉన్నాయని చెబుతున్నారు. ఆయనకు కూడా రాష్ట్రస్థాయి కార్పొరేషన్‌ పదవి లభిస్తుందని ప్రచారం జరుగుతున్నది.


ఇక్కడి నుంచే టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశించిన బీసీ కమిషన్‌ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్‌రావు  పదవిపై ఆశలు పెట్టుకున్నారని సమాచారం. అసెంబ్లీ టికెట్‌ గెల్లు శ్రీనివాస్‌కు ఖాయమైన నేపథ్యంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న బీసీ కమిషన్‌ చైర్మన్‌ పదవి ఆయనకు దక్కనున్నదని ప్రచారం జరుగుతున్నది. 


మాజీ మండల పరిషత్‌ అధ్యక్షుడు చుక్క రంజిత్‌, ఈటల వెంట ఉండి ఢిల్లీకి వెళ్లి వచ్చిన తర్వాత బీజేపీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరిన తుమ్మేటి సమ్మిరెడ్డి కూడా రెడ్డి సామాజికవర్గం నుంచి తనకు రాష్ట్రస్థాయి పదవిని కట్టబెట్టాలని కోరుకుంటున్నట్లు తెలిసింది.

 

ఇతర నియోజకవర్గాల్లో అసంతృప్తి

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో ఆ నియోజకవర్గానికే చెందిన నేతలు ఎందరికి పదవులు కట్టబెడతారన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఇద్దరు లేక ముగ్గురికి ఇక్కడ పదవులు ఇవ్వవచ్చని విశ్వసనీయంగా తెలుస్తుండగా మరోవైపు జిల్లావ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి రేకెత్తుతున్నది. హుజూరాబాద్‌కే అన్ని పదవులు కట్టబెడితే రెండేళ్లుగా పదవుల కోసం ఎదురుచూస్తున్న తమ మాటేమిటని జిల్లాలోనే కాకుండా పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల నేతలు కూడా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఫిషరీస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవిని ఆశించినవారిలో పిట్టల రవీందర్‌ హుజూరాబాద్‌ నియోజకవర్గానికి చెందిన వీణవంక మండలవాసినే. ఆయనకు ఎమ్మెల్సీ పదవిగాని, ఫిషరీస్‌ చైర్మన్‌ పదవినిగాని ఇస్తారని ప్రచారం జరిగింది. ఈ పదవిని కరీంనగర్‌కు చెందిన కొలిపాక మల్లికార్జున్‌ కూడా ఆశించారు. ఆయనకు రాజ్యసభ్య సభ్యుడు సంతోష్‌కుమార్‌, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ ఆశీస్సులు ఉన్నాయని అప్పట్లో ప్రచారం జరిగింది.


ఉప ఎన్నిక నేపథ్యంలో రమేశ్‌ పేరు తెరపైకి రావడంతో వీరిద్దరు కూడా అసంతృప్తికి గురవుతున్నారని సమాచారం. మైనార్టీ వర్గానికి చెందిన ముజాహిద్‌ తనకు ఎమ్మెల్సీ పదవిగాని, రాష్ట్రస్థాయి కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవినిగాని కట్టబెట్టాలని కోరుతున్నట్లు సమాచారం. నియోజకవర్గ పరిధిలోని మసీద్‌ కమిటీల పెద్దలను, మైనార్టీ పెద్దలను, ఉద్యోగుల ప్రతినిధులను పెద్ద ఎత్తున హైదరాబాద్‌కు తీసుకొని వెళ్లి టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఆయన ఇటీవల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీనికి టీఆర్‌ఎస్‌ పెద్దలు వచ్చి ప్రసంగించి వెళ్లారు. ఆ సందర్భంలోనే టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం పెద్దల నుంచి, హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ నుంచి హామీ లభించినట్లు తెలిసింది. మైనార్టీలకు అటు జిల్లాలోగాని, హుజూరాబాద్‌ నియోజకవర్గంలోగాని నామినేటెడ్‌ పదవులు అందుబాటులోకి రాలేదు. ఆ వర్గంలోనూ ఇప్పుడు ఈ విషయంలో కొంత అసంతృప్తి ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది.


టీఆర్‌ఎస్‌ పార్టీలోని ఏ సామాజికవర్గంలోనూ అసంతృప్తి లేదని, దీనిని బూచిగా చూపి పదవులు పొందాలని కొందరు ప్రచారం చేస్తున్నారనే అభిప్రాయం కూడా పార్టీలో కొందరు వ్యక్తం చేస్తున్నారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో నామినేటెడ్‌ పదవులు ఆశిస్తున్నవారు ఇప్పుడైనా తమకు మోక్షం లభిస్తుందేమోనని ఆశగా ఎదురుచూస్తున్నారు.  హుజూరాబాద్‌ నేతలకు మాత్రమే పదవులు కట్టబెట్టి జిల్లాలో ఎవరికీ ఇవ్వని పక్షంలో ఆ ప్రభావం ఉప ఎన్నికలో తప్పకుండా చూపించే ప్రమాదం లేకపోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

Updated Date - 2021-08-22T05:56:20+05:30 IST