వేడెక్కుతున్న హుజూరాబాద్‌ రాజకీయాలు.. రంగంలోకి హరీష్‌రావు

ABN , First Publish Date - 2021-08-11T05:00:59+05:30 IST

హుజూరాబాద్‌ రాజకీయాలు రసకందాయంలో..

వేడెక్కుతున్న హుజూరాబాద్‌ రాజకీయాలు.. రంగంలోకి హరీష్‌రావు

గరంగరం..

పార్టీ శ్రేణులతో ప్రత్యేక సమావేశం 

26 గ్రామాల్లో మహిళా సంఘ భవనాలు 


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌): హుజూరాబాద్‌ రాజకీయాలు రసకందాయంలో పడుతున్నాయి. టీఆర్‌ఎస్‌ ట్రబుల్‌ షూటర్‌ హరీష్‌రావు రంగంలోకి దిగుతున్నారు. నియోజకవర్గంలో జరుగనున్న ఉప ఎన్నికల ఇన్‌చార్జి బాధ్యతను ముఖ్యమంత్రి కేసీఆర్‌ హరీష్‌రావుకు అప్పగించిన తర్వాత ఆయన తొలిసారిగా పర్యటనకు వస్తున్నారు. ఇంతకాలం నియోజకవర్గానికి చెందిన టీఆర్‌ఎస్‌ నేతలతోపాటు వివిధ పార్టీల నేతలు, ఇతర రంగాల ప్రముఖులు, ప్రజలపై ప్రభావం చూపగలిగే వారిని సిద్దిపేటకే పిలిపించుకొని చర్చించారు. ఆయన ఇప్పుడు నేరుగా నియోజకవర్గంలో అడుగు పెడుతునున్నారు. ఈనెల 16న లక్ష మందితో నిర్వహించనున్న దళితబంధు సభకు సీఎం కేసీఆర్‌ హాజరుకానున్న నేపథ్యంలో హరీష్‌రావు హుజురాబాద్‌లో పర్యటించడం ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది. పార్టీ నేతల్లో, శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపి ఎక్కడైనా చిన్నచిన్న లోపాలు ఉంటే వాటిని సవరించి అందరిని సమన్వయ పరిచేందుకు ఆయన నేరుగా రంగంలోకి దిగుతున్నారని చెబుతున్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరి పోటీ చేయనుండడంతోపాటు ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌కే సవాల్‌ విసురుతున్నారు. 


నేడు సీఎం సభ ఏర్పాట్ల పరిశీలన

ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతను హరీష్‌రావుకు అప్పగించడంతో ఈటల అటు కేసీఆర్‌తోపాటు ఇటు హరీష్‌రావును నియోజకవర్గంలో పర్యటిస్తున్న జిల్లాకు చెందిన మంత్రులను టార్గెట్‌ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. రాజేందర్‌ ఎన్ని విమర్శలు చేస్తున్నా నియోజకవర్గంలో పట్టుబిగించడంపైనే దృష్టి సారించారు. పార్టీశ్రేణులను జారి పోకుండా చూడడంతోపాటు ఇతర పార్టీల నేతల మద్దతు కూడగట్టి పలువురిని పార్టీలోకి ఆహ్వానించడం లాంటి కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. కొద్దిరోజులుగా  తన స్వరాన్ని పెంచి విమర్శలను తిప్పికొడుతూ వస్తున్న హరీష్‌రావు ఇప్పుడు నేరుగా హుజూరాబాద్‌లో ఎంట్రీ ఇస్తున్నారు. దీనితో హుజూరాబాద్‌ రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయని భావిస్తున్నారు. అటు మంత్రి గంగుల, ఇటు కొప్పుల ఈశ్వర్‌ నిత్యం నియోజకవర్గంలో పర్యటిస్తుండగా అడపాదడపా ఇతరశాఖల మంత్రులు కూడా ఏదో ఒక కార్యక్రమాన్ని పెట్టుకొని నియోజకవర్గానికి వస్తున్నారు. ఇప్పుడునియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు తన పర్యటనలకు శ్రీకారం చుడుతున్నారు.


కార్యకర్తలతో సమావేశం

బుధవారం హరీష్‌రావు హుజురాబాద్‌కు వచ్చి శాలపల్లి-ఇందిరానగర్‌ గ్రామాల మధ్య దళితబంధు సభకోసం చేస్తున్న ఏర్పాట్లను పరిశీలిస్తారు. అనంతరం ఆయన ఇల్లందకుంటకు వెళ్తారు. ఈ సందర్భంగా జమ్మికుంట అయ్యప్ప ఆలయం నుంచి ఇల్లందకుంట వరకు భారీ బైక్‌ ర్యాలీతో కార్యకర్తలు హరీష్‌రావును ఇల్లందకుంటకు తీసుకువెళ్తారు. ఇల్లందకుంటలోని సీతారాంచంద్రస్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం మంత్రి హరీష్‌రావు అక్కడ ఏర్పాటు చేసిన పార్టీ ముఖ్యనాయకులు, కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతారు.  ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో విజయం సాధించేందుకు ఉన్న పరిస్థితులు చేపట్టాల్సిన చర్యలు అలాగే వివిధ మండలాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, పెండింగ్‌లో ఉన్న పనులు, చేపట్టాల్సిన పనుల విషయాలను ఆరా తీసి అవసరమైన ఆదేశాలు జారీ చేస్తారని చెబుతున్నారు. 


వీణవంకలో మహిళలకు వడ్డీ రాయితీ పంపిణీ

తర్వాత ఆయన వీణవంక మండల కేంద్రానికి వెళ్తారు. అక్కడ మహిళా సాధికారిత సాధన లక్ష్యంలో భాగంగా ఏర్పాటు చేసిన మహిళా సమావేశంలో ఆయన పాల్గొంటారు. అక్కడ మహిళా సంఘాలకు 3.55 కోట్ల బ్యాంకు రుణాల వడ్డీ రాయితీని, 1.83 కోట్ల శ్రీనిధి వడ్డీ రాయితీని మహిళా సంఘాలకు పంపిణీ చేస్తారు. 10 కోట్ల బ్యాంకు రుణాలను, కోటి శ్రీనిధి రుణాలను మంజూరు చేస్తూ సంబంధిత పత్రాలను మహిళలకు అందజేస్తారు. వీణవంక మండలంలోని 26 గ్రామ పంచాయతీలలో 26 మహిళా సంఘభవనాలు నిర్మించేందుకు మంజూరు పత్రాలను అందజేస్తారు. హరీష్‌రావుతోపాటు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా పర్యటనలో పాల్గొంటారు. హరీష్‌రావు ఉప ఎన్నిక ముగిసే వరకు నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రత్యక్ష రాజకీయాలు నిర్వహిస్తారని చెబుతున్నారు. 

Updated Date - 2021-08-11T05:00:59+05:30 IST