ఊరిస్తున్న నామినేటెడ్ పదవులు
ABN , First Publish Date - 2021-12-31T05:39:24+05:30 IST
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పలు కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రభుత్వం నామినేట్ చేస్తుండడంతో పలు పదవులపై జిల్లాలోని అధికార టీఆర్ ఎస్ పార్టీకి చెందిన నాయకులు ఆశలు పెంచుకున్నారు.

- కార్పొరేషన్ పదవులను భర్తీ చేస్తున్న ప్రభుత్వం
- పలువురు నేతల ఆశలు
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పలు కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రభుత్వం నామినేట్ చేస్తుండడంతో పలు పదవులపై జిల్లాలోని అధికార టీఆర్ ఎస్ పార్టీకి చెందిన నాయకులు ఆశలు పెంచుకున్నారు. గతంలో పోలిస్తే జిల్లాకు చెందిన తక్కువ మంది నాయకులకు మాత్రమే కార్పొ రేట్ పదవులు దక్కాయి. గత నాలుగు మాసాల నుంచి సీఎం కేసీఆర్ ఒక్కొక్కటిగా నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తూ పోతున్నారు. తెలం గాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత తొలిసారిగా అధికారంలోకి వచ్చి టీఆర్ ఎస్ ప్రభుత్వం మొదటి దఫాలో జిల్లాలోని రామగుండంకు చెందిన కోలేటి దామోదర్‌ను పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ పదవి వరించింది. ఆయన ఐదేళ్లుగా ఆ పదవిలో కొనసాగుతున్నారు. ఆయనకు ఆ పదవి వరించడంతో రామగుండంలో పోలీస్ కమిషనరేట్ కార్యాలయంతో పాటు గోదావరిఖని వన్ టౌన్ భవన నిర్మాణం, పోలీస్ గెస్ట్‌హౌస్‌ల నిర్మాణాలు పూర్తి కావచ్చాయి. పెద్దపల్లి నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత ఈద శంకర్‌రెడ్డికి టీఎస్ ఐడీసీ చైర్మన్ పదవి దక్కడంతో ఆయన తన సొంత మండలమైన కాల్వశ్రీరాంపూర్‌లో రాయదండి నుం చి 10 గ్రామాలకు సాగునీటిని అందించేందుకు గాను సుమారు రూ.22 కోట్ల రూపాయలతో ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి శరవేగంగా పూర్తి చేయించి భూములకు సాగు నీరందేలా చేశారు. ఆయన పదవీకాలం పూర్తికావడంతో ఆయనకు సీఎం కేసీఆర్ మరే పదవిని ఇవ్వలేదు. పెద్దపల్లి పట్టణానికి చెందిన టీఎస్‌టీఎస్ చైర్మన్‌గా విద్యార్థి ఉద్యమ నాయకుడు డాక్టర్ చిరుమల్ల రాకేశ్ కుమార్‌ను నియమించారు. ఆయన పదవీ కాలం కూడా పూర్తయ్యింది. మంథని ప్రాంతానికి చెందిన సీనియర్ జర్నలిస్టు అల్లం నారాయణకు ప్రెస్ అకాడమీ చైర్మన్ పదవిని కట్టబెట్టగా, ఆయనను ఆ పదవిలో కొనసా గిస్తున్నారు. గోదావరిఖని ప్రాంతానికి చెందిన మల్లేపల్లి లక్ష్మయ్య బుద్ధవనం ప్రాజెక్టు ప్రత్యేక అధికారిగా నామినేటెడ్ పదవిలో కొనసాగు తున్నారు. గత ప్రభుత్వ హయాంలో జిల్లాకు చెందిన ఐదుగురికి నామినేటెడ్ పదవులను ఇచ్చి, అందులో ముగ్గురిని కొనసాగి స్తుండగా, ఇద్దరి నాయ కుల పదవీ కాలం పూర్తి కావడంతో వారిని తిరిగి కొనసాగించలేదు. రెండుమాసాల క్రితం జరిగిన హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల సంద టర్భంగా ఆ నియోజకవర్గానికి చెందిన ఇరువురు నేతలకు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, బీసీ కమిషన్ చైర్మన్ పదవులను ఇచ్చారు. అంతకు ముందు జిల్లా కేంద్రానికి చెందిన టీఆర్‌ఎస్ పార్టీ మహిళా నాయకు రాలు కఠారి రేవతిరావుకు రాష్ట్ర మహిళా కమిషన్ మెంబర్‌గా పదవి దక్కింది.
పదవులపై ఆశలు..
ఇటీవల ప్రభుత్వం టీఎస్‌టీఎస్, బేవరేజేస్ కార్పొరేషన్, వుమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్, తెలంగాణ షీప్ అండ్ గోట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ల చైర్మన్ల పదవులను ఇతర జిల్లాలకు చెందిన నాయకులకు కట్టబెట్టిన విషయం తెలిసిందే. దీంతో జిల్లాకు చెందిన పలువురు నాయకులు ఆయా కార్పొరేషన్ల పదవులపై ఆశలు పెంచుకున్నారు. సుల్తానాబాద్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు, గోదావరిఖనికి చెందిన పిట్టల రవీందర్, కన్నాలకు చెందిన పీట్ల గోపాల్, రామగిరికి చెందిన గంట వెంకటరమణారెడ్డి, కమాన్‌పూర్‌కు చెందిన ఎనగంటి రామారావు తదితరులు పలు నామినేటెడ్ పోస్టులను ఆశిస్తున్నారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన పిట్టల రవీందర్‌కు రెండు నెలల క్రితం జరిగిన హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఆ నియోజకవర్గ టిక్కెట్ ఇవ్వవచ్చని అంతా భావించారు. కానీ అనివార్య కారణాల వల్ల ఆ టిక్కెట్‌ను గెల్లు శ్రీనివాస్‌కు అందించారు. అలాగే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఇతరులకు అవకాశం కల్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా పెద్దపల్లి జిల్లాలో గోదావరి నదిపై సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలను నిర్మించడంతో పాటు మూడు పంప్‌హౌస్‌లను నిర్మించారు. ధర్మపురి నుంచి మేడిగడ్డ వరకు గోదావరిలో నీటి నిల్వ ఉండడంతో చేపల ఉత్పత్తి పెద్దఎత్తున పెరి గింది. ఈక్రమంలో చేపల ఉత్పత్తిని మరింత పెంచి ఈ ప్రాంతాన్ని ఫిష్ హబ్‌గా మార్చేందుకు ఎన్నో అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి ఖాళీగా ఉన్న ఫిషరీస్ కార్పొరేషన్ డెవలప్‌మెంట్ చైర్మన్ పదవిని పిట్టల రవీందర్‌కు ఇవ్వవచ్చనే ఊహాగానాలు వెలువడు తున్నాయి. సీఎంకు సన్నిహితుడైన బిరుదు రాజమల్లు సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి గానీ, మెంబర్ పదవి గానీ దక్కవచ్చని తెలు స్తున్నది. ఇతర నేతలు కూడా కార్పొరేషన్ పదవులను ఆశిస్తుండడంతో ఎవరికి దక్కుతాయో వేచి చూడాల్సిందే.