ఏడేళ్ల పాలనలో చరిత్రాత్మక నిర్ణయాలు

ABN , First Publish Date - 2021-05-31T05:23:45+05:30 IST

కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి నేటితో ఏడేళ్లు గడిచాయని, ఈ కాలంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నో చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ అన్నారు.

ఏడేళ్ల పాలనలో చరిత్రాత్మక నిర్ణయాలు
ఆక్సిజన్‌ కాన్సట్రేటర్లను ప్రారంభిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌

 -  ఆక్సీజన్‌ కాన్సంట్రేటర్లను ప్రజలు వినియోగించుకోవాలి

-  మోదీ హయాంలో ఎంపీగా కొనసాగడం అదృష్టం

- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు,  ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ 

కరీంనగర్‌ టౌన్‌, మే 30: కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి నేటితో ఏడేళ్లు గడిచాయని,  ఈ కాలంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నో చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. మోదీ నేతృత్వంలోని బీజేపీ పాలన ఏడేళ్ళు పూర్తిచేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా సేవా హి సంఘటన్‌ కార్యక్రమాలను నిర్వహించాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా పిలుపు ఇచ్చారు. ఈ మేరకు ఆదివారం కరీంనగర్‌లోని పార్లమెంట్‌ కార్యాలయంలో ఉచిత ఆక్సీజన్‌ కాన్సంట్రేటర్లను బండి సంజయ్‌ అందుబాటులోకి తెచ్చారు. ఈ సందర్భంగా సంజయ్‌ మాట్లాడుతూ కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ప్రజలు తమ ఆరోగ్య అవసరాలకు ఈ ఆక్సీజన్‌ కాన్సంట్రేటర్లను వినియోగించుకోవాలని కోరారు. కరోనాపై ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. బీజేపీ ఏడేళ్ల పాలన పూర్తయిన సందర్భంలో కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని లాక్‌డౌన్‌ నిబంధనల మేరకు ప్రజలకు ఉపయోగకరమైన సేవా కార్యక్రమాలను చేపడుతున్నామని చెప్పారు.  370 ఆర్టికల్‌ రద్దు, సీఐఏ, త్రిపుల్‌ తలాక్‌ అయోధ్య రామ మందిరం విషయంలో అనేక సాహసోపేత నిర్ణయాలు తీసుకున్న గొప్ప వ్యక్తి నరేంద్రమోదీ అని ప్రశంసించారు.    దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంటే, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఆత్మనిర్భర్‌ భారత్‌ పేరిట 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని నరేంద్రమోదీ ప్రకటించారని అన్నారు. అనేక మందికి ఉపాధి కల్పించి చిన్నమధ్యతరగతి పరిశ్రమలను ప్రోత్సహించే విధంగా ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించిందని చెప్పారు. బీజేపీ ఏడేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా కరోనాతో తల్లిదండ్రులు చనిపోయి అనాఽథలుగా మిగిలిన చిన్నారులకు అండగా ఉండేందుకు మోదీ తీసుకున్న నిర్ణయం అభినందనీయమని అన్నారు. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు 18 సంవత్సరాలు పూర్తయ్యే వరకు 10 లక్షలు డిపాజిట్‌ చేయడం, వారికి ఉచిత విద్యతోపాటు ఆయుష్మాన్‌ భారత్‌ పేరుతో ఉచిత వైద్యం అందించడం,  18 సంవత్సరాల తర్వాత ఐదేళ్లు స్టైఫండ్‌ ఇవ్వడం వంటి గొప్పపథకానికి అంకురార్పరణ చేయడం సంతోషకరమని సంజయ్‌ పేర్కొన్నారు. ఇలాంటి  గొప్ప నిర్ణయాలు తీసుకున్న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ  నేతృత్వంలో  పార్లమెంట్‌ సభ్యుడిగా పని చేయడం గొప్ప అవకాశంగా భావిస్తున్నానన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్‌, శివరామకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - 2021-05-31T05:23:45+05:30 IST