ధాన్యం..దైన్యం
ABN , First Publish Date - 2021-11-21T05:56:52+05:30 IST
ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. జిల్లాలో గతంలో ఎన్నడూ లేనంతగా ధాన్యం దిగుబడి వచ్చింది. కొనుగోళ్లు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి

- కల్లాలో పేరుకుపోతున్న రాశులు
- కొనుగోలు కేంద్రాల వద్ద తిప్పలు
- రాత్రింబవళ్లు పడిగాపులు
- అకాల వర్షాలకు తడుస్తున్న ధాన్యం
- ఆగ్రహంతో రోడ్డెక్కుతున్న అన్నదాతలు
- జిల్లాలో 265 కేంద్రాలకు 231 కేంద్రాల్లో తూకం
- ఇప్పటి వరకు 65,739 మెట్రిక్ టన్నుల సేకరణ
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. జిల్లాలో గతంలో ఎన్నడూ లేనంతగా ధాన్యం దిగుబడి వచ్చింది. కొనుగోళ్లు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. దీంతో అన్నదాతలు కేంద్రాల వద్ద రాత్రింబవళ్లు పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు అకాల వర్షాలతో ధాన్యం తడుస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు. కొనుగోళ్లలో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆవేదనను వినిపించడానికి ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్‌లో సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. ముస్తాబాద్‌లో ధాన్యం తగలబెట్టి నిరసన తెలిపారు. తంగళ్లపల్లి మండలం సారంపల్లిలో వరి ధాన్యానికి నిప్పుపెట్టి రాస్తారోకో నిర్వహించారు. జిల్లాలో 265 కొనుగోలు కేంద్రాలకు 252 ప్రారంభించారు. 231 కేంద్రాల్లో ఽతూకం వేసి 65,739 మెట్రిక్ టన్నులు సేకరించారు. ఐకేపీ ద్వారా 15,093 మెట్రిక్ టన్నులు, సింగిల్ విండోల ద్వారా 47,762 మెట్రిక్ టన్నులు, డీసీఎంఎస్ ద్వారా 1672 మెట్రిక్ టన్నులు, మెప్మా ద్వారా 494 మెట్రిక్ టన్నులు, మార్కెట్ యార్డుల ద్వారా 717 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగింది. ఇప్పటి వరకు రూ.128.85 కోట్ల విలువైన ధాన్యాన్ని 8,476 మంది రైతుల నుంచి కొనుగోలు చేశారు. జిల్లాలో ఈసారి వానాకాలం సీజన్‌లో 2.43 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయగా అత్యధికంగా 1.73 లక్షల ఎకరాల్లో వరి వేశారు. 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేసి 3.50 లక్షల మెట్రిక్ టన్నులు పౌరసరఫరాల శాఖ కొనుగోలు లక్ష్యంగా పెట్టుకుంది. కొనుగోళ్లు నామమాత్రంగా సాగుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తూకం వేసిన ధాన్యం తరలింపులోనూ సమస్యలు తలెత్తుతున్నాయి. కొనుగోలు కేంద్రాల్లో స్థలంలేక రోడ్లపై ధాన్యం ఆరబోసి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తూకంలో నష్టాలు
ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడంలో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చినా అనేక కొర్రీలతో నష్టపోతున్నారు. ధాన్యం తూకంలో క్వింటాల్‌కు 4 కిలోల వరకు అదనంగా తూకం వేస్తున్నారు. కేవలం కిలో అదనపు తూకం వేస్తే సరిపోతుందని ఎక్కువ తూకం వేయడంతో నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మాయిశ్చరైజ్ లేదని మిల్లు యజమానులు ధాన్యంలో కోత విధించి రైతులపైనే భారం వేస్తున్నారు. మరోవైపు జిల్లాలోని కొనుగోలు కేంద్రాలను కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ నాయకులు పరిశీలిస్తున్నారు. రైతులకు భరోసా కల్పిస్తున్నారు.
కొనుగోలు కేంద్రం వద్దనే ఉంటున్నాం
- బండారి నారాయణ, రైతు పెద్దలింగాపూర్
ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి 25 రోజులు అవుతోంది. తూకం వేయకపోవడంతో ఇక్కడే ఉంటున్నాం. వర్షంతో ధాన్యం తడిసిపోయింది. ఆరబెట్టడానికి ఇబ్బందవుతోంది. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలి.
పట్టించుకునే వారు లేరు
- గాదె మధు, రైతు పెద్దలింగాపూర్
రాజకీయం చేసే నాయకులే ఎక్కువయ్యారు. రైతుల సమస్యలు పట్టించుకునే వారు కరువయ్యారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం పోసి 36 రోజులు అవుతోంది. కేంద్రం ప్రారంభించినప్పటి నుంచి కేవలం 700 బస్తాలు తూకం వేశారు.
కొనుగోళ్లు వేవంతం చేయాలి
- బద్దం భాస్కర్‌రెడ్డి, రైతు మూడపల్లి.
కొనుగోలు కేంద్రానికి ధాన్యం తెచ్చి 15 రోజులు ఆవుతోంది. ధాన్యం కొనుగోలు మందకొడిగా సాగు తోంది. వర్షం వచ్చినప్పుడు ధాన్యం తడిసి పోతోంది. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం విక్రయం కోసం పడిగాపులు కాయల్సి వస్తోంది.
మబ్బులు కమ్ముకుంటున్నాయ్..
- బాణల రవీందర్ రెడ్డి, ,రైతు మూడపల్లి
కొనుగోలో కేంద్రాల్లో ధాన్యం తూకం వేయడంలో జాప్యం అవుతోంది. ఆకాశంలో మబ్బులు కమ్ముకురావడంతో వర్షంతో ధాన్యం తడిసి పోతుందని ఆందోళన చెందుతున్నాం. ధాన్యం తూకంలో జాప్యం జరుగకుండా వేగవంతం చేయాలి.
కల్లంలో పోసి నెల కావస్తోంది
- గొనె ఆనంతరెడ్డి, రైతు, నిలోజిపల్లి
ధాన్యాన్ని కల్లంలో పోసి నెల దగ్గరకొచ్చింది. ఇప్పటివరకు ధాన్యం తూకం వేయలేదు. వడ్లను తూర్పార పట్టిన. కొనుగోలు చెయ్యడం లేదు. ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటున్నాయి. తూకం వేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.