రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు

ABN , First Publish Date - 2021-05-20T05:50:01+05:30 IST

ఈ యాసంగిలో జిల్లా రైతాంగం రికార్డు స్థాయిలో వరి పండించింది.

రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు


- ఉమ్మడి జిల్లాలో 8.73 లక్షల మెట్రిక్‌ టన్నుల సేకరణ

- సేకరించిన ధాన్యం విలువ రూ. 1,649 కోట్లు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

ఈ యాసంగిలో జిల్లా రైతాంగం రికార్డు స్థాయిలో వరి పండించింది.  ఇదే ఒరవడి ధాన్యం కొనుగోలులోనూ కొనసాగింది. ఉమ్మడి జిల్లా పరిధిలో  ఏప్రిల్‌ 15 నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. కరోనా పరిస్థితులను అధిగమించి ప్రభుత్వ యంత్రాంగం కొనుగోళ్లను ముమ్మరం చేసింది.


రాష్ట్రంలో ఐదో వంతు ఇక్కడి రైతుల నుంచే..


 రాష్ట్రంలో ఇప్పటి వరకు కొనుగోలు చేసిన 45.18 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యంలో ఐదో  వంతు ధాన్యం ఉమ్మడి జిల్లా పరిధిలోనే సేకరించారు. ఇప్పటివరకు కరీంనగర్‌, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో 8,73,586 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 80 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించి ఎఫ్‌సీఐకి ఇవ్వడానికి ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నది. ఇప్పటివరకు 8,522 కోట్ల రూపాయల విలువచేసే 45.18 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో సేకరించారు. ఇందులో 1,649 కోట్ల రూపాయల విలువచేసే ధాన్యం ఉమ్మడి జిల్లాదే కావడం విశేషం. 

- కరీంనగర్‌ జిల్లాలో 352 కొనుగోలు కేంద్రాల ద్వారా 2,36,426 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. 26,529 మంది రైతులకు చెందిన ఈ ధాన్యం విలువ 446 కోట్ల 35 లక్షలు.

- జగిత్యాల జిల్లాలో 421 కొనుగోలు కేంద్రాల ద్వారా 36,160 మంది రైతులకు చెందిన 2,85,613 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేరించారు. ఈ ధాన్యం విలువ 539 కోట్ల 18 లక్షలు. 

- పెద్దపల్లి జిల్లాలో 292 కొనుగోలు కేంద్రాల ద్వారా 2,15,371 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. 26,417 మంది రైతులకు చెందిన ఈ ధాన్యం విలువ 406 కోట్ల 36 లక్షలు. 

- రాజన్న సిరిసిల్ల జిల్లాలో 235 కొనుగోలు కేంద్రాల ద్వారా 19,526 మంది రైతులకు చెందిన 1,36,176 మెట్రిక్‌ టన్నుల వరిధాన్యం కొనుగోలు చేశారు. ఈ వరిధాన్యం విలువ 257 కోట్ల 10 లక్షలు ఉంది. 


 రైస్‌ మిల్లులకు చేరిన ధాన్యానికి డబ్బు చెల్లింపు


ఇప్పటికే కొనుగోలు చేసిన ధాన్యం విలువలో రైస్‌ మిల్లులకు చేరిన ధాన్యానికి డబ్బులు చెల్లించారు. 1,649 కోట్ల రూపాయలకుగాను 50 శాతం సొమ్ము ఇప్పటికే రైతుల ఖాతాల్లో జమ అయినట్లు అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్‌ 15న కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాగా మే మాసాంతం వరకు లక్ష్యం మేరకు ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆలస్యంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కావడంతోపాటు కరోనా వేగంగా విస్తరించడంతో ధాన్యం కొనుగోలులో కొంత ఆలస్యమయింది. మేలో కరోనాను కూడా లెక్కచేయకుండా రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించి విక్రయిస్తున్నారు. నైరుతి రుతుపవనాలు జూన్‌ ఆరంభంలోనే వచ్చే అవకాశాలున్నాయని వాతావరణ శాస్త్రజ్ఞులు ప్రకటించారు. వరుసగా అల్ప పీడనాలు ఏర్పడుతూ అకాల వర్షాలు కురుస్తుండడంతో వీలైనంత త్వరగా ధాన్యాన్ని అమ్ముకోవాలని రైతులు భావిస్తున్నారు. వేగవంతంగా ధాన్యం సేకరణను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో నెలాఖరు వరకు ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యే అవకాశం ఉంది.


Updated Date - 2021-05-20T05:50:01+05:30 IST