అంచెలంచెలుగా రాజన్న ఆలయ అభివృద్ధి

ABN , First Publish Date - 2021-12-19T06:20:38+05:30 IST

వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానం అభివృద్ధి కోసం అంచెలంచెలుగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని వేములవాడ టెంపుల్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ వైస్‌ చైర్మన్‌ ముద్దసాని పురుషోత్తమరెడ్డి అన్నారు

అంచెలంచెలుగా రాజన్న ఆలయ అభివృద్ధి
వేములవాడలో గుడి చెరువు ప్రాంతాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌, వీటీడీఏ వైస్‌ చైర్మన్‌ పురుషోత్తమరెడ్డి

-వీటీడీఏ వైస్‌ చైర్మన్‌ ముద్దసాని పురుషోత్తమరెడ్డి

వేములవాడ, డిసెంబరు 18 : వేములవాడ  రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానం అభివృద్ధి కోసం అంచెలంచెలుగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని వేములవాడ టెంపుల్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ వైస్‌ చైర్మన్‌ ముద్దసాని పురుషోత్తమరెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానం అభివృద్ధి పనుల పురోగతిపై స్థానిక శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్‌తో కలిసి ఆలయ కార్యాలయంలో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కారణంగా అభివృద్ధి పనులకు ఆటంకం కలిగిందన్నారు. 160 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గుడి చెరువు అభివృద్ధికి రూ.90 కోట్లు మంజూరయ్యాయనీ, 50 కోట్ల పనులు పూర్తయ్యాయనీ,   వీటిలో రూ.30 కోట్ల రూపాయలతో 30 ఎకరాలు సేకరించామనీ తెలిపారు.   కల్యాణకట్ట, పుష్కరిణి, శివకల్యాణం చూసే విధంగా స్టేడియం, 2 వేల మందికి అన్నదాన సత్రం నిర్మిస్తామన్నారు. రూ.23 కోట్లతో బస్టాండ్‌ నిర్మాణానికి 23 ఎకరాల స్థల సేకరించనున్నట్లు చెప్పారు. త్వరలో 120 మీటర్ల పొడవుతో స్నానఘట్టాలు తయారుకానున్నాయన్నారు. రూ.15 కోట్లతో మిడ్‌ మానేరు నుంచి 365 రోజులు పుష్కలంగా నీళ్లు ఉండే విధంగా ఏర్పాటు చేసుకున్నామని, బద్దిపోచమ్మ ఆలయ విస్తరణ పనులు త్వరలో చేపట్టనున్నామని తెలిపారు. ప్రస్తుతం రెండు గుంటలలో ఉన్న ఆలయాన్ని ఒక ఎకరంలో విస్తరించడానికి స్థలాన్ని సేకరిస్తున్నట్లు చెప్పారు. ఇందులో షట్టర్లు కోల్పోయిన వారికి షట్టర్లు ఇస్తామనీ, ఆలయంలో ఉపాధి కల్పిస్తామనీ, గజానికి 30 వేలు పరిహారం ఇస్తామనీ తెలిపారు. స్థలం కోల్పోయేవారు సహకరించాలన్నారు. బ్రిడ్జి నుంచి పోలీస్‌ స్టేషన్‌ వరకు రెండు బిట్లుగా 80 అడుగుల వెడల్పుతో రోడ్ల వెడల్పు చేపడతామని, ఇందుకు సంబంధించిన ప్లాన్‌ కూడా సిద్ధమైందని అన్నారు. బతుకమ్మత తెప్ప వద్ద బ్రిడ్జి నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. రెండో బ్రిడ్జి పనులు ప్రారంభమయ్యాయన్నారు. ఆలయ, పట్టణ అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. సమావేశంలో వీటీడీఏ కార్యదర్శి భుజంగరావు, ఆలయ ఈవో కృష్ణప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-19T06:20:38+05:30 IST