నిరుపేదలకు అండగా ప్రభుత్వం

ABN , First Publish Date - 2021-08-20T05:51:37+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు అండగా నిలుస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు.

నిరుపేదలకు అండగా ప్రభుత్వం
మాట్లాడుతున్న మంత్రి గంగుల

- మంత్రి గంగుల కమలాకర్‌

- జిల్లా ఆసుపత్రిలో సీటీ స్కాన్‌ సేవలు ప్రారంభం

సుభాష్‌నగర్‌, ఆగస్టు 19: రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు అండగా నిలుస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో 2.15 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన సీటీ స్కాన్‌ యంత్రాన్ని గురువారం మంత్రి ప్రారంభించారు. అనంతరం జిల్లా ఆసుపత్రిలో జడ్పీ చైర్‌పర్సన్‌ కనమల్ల విజయ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా ఆసుపత్రి అభివృద్ధి సలహా కమిటీ సమావేశంలో మంత్రి పాల్గొని అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిరుపేద ప్రజలకు ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. సీటీ స్కానింగ్‌ మిషన్‌ ప్రస్తుతం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేస్తుందని పేర్కొన్నారు. సెప్టెంబరు 1 నుంచి ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 గంటల వరకు రెండు షిఫ్టుల్లో సేవలను అందించనున్నట్లు మంత్రి తెలిపారు. ఇందుకోసం ఒక రేడియాలజిస్టును, ఒక టెక్నీషియన్‌, ఒక అటెండర్‌ను అదనంగా నియమించి రెండు షిఫ్టుల్లో పనిచేసేలా చూడాలని  వైద్యాధికారులను మంత్రి ఆదేశించారు. తెల్ల రేషన్‌కార్డు కలిగిన రోగులకు ఉచితంగా సిటీ స్కాన్‌ పరీక్షలు నిర్వహిస్తారని,  మిగతావారికి 500 రూపాయలు చార్జీగా తీసుకుని స్కానింగ్‌ చేస్తారని తెలిపారు. 

29,975 మందికి కేసీఆర్‌ కిట్లు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కేసీఆర్‌ కిట్‌లను ఇప్పటి వరకు 29,975 మందికి అందజేశామని తెలిపారు. 2017వ సంవత్సరం నుంచి ఇప్పటివరకు 34 వేల ప్రసవాలు జరుగగా, ఇందులో 10,995 సాధారణ ప్రసవాలు అని తెలిపారు. 23,600 శస్త్ర చికిత్సలు నిర్వహించి ప్రసవాలు చేశారని మంత్రి తెలిపారు. అమ్మాయి పుట్టిన 16,262 మందికి 13 వేలు, మగ శిశువు జన్మించిన 13,725 మందికి 12 వేల చొప్పున అందజేశామన్నారు. ఇందుకోసం ప్రభుత్వం 10 కోట్లు ఖర్చు చేసిందని అన్నారు. రక్త పరీక్షలు చేసేందుకు జిల్లా ఆసుపత్రిలో ఆధునిక లాబొరేటరీలను ఏర్పాటు చేశామన్నారు. మొదటిదశ కొవిడ్‌ను జిల్లాలో సమర్థవంతంగా అడ్డుకున్నామని అన్నారు. ప్రస్తుతం జిల్లా  ఆసుపత్రిలో 79 మంది కొవిడ్‌ రోగులు చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. మూడో దశ కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి తెలిపారు. వర్షాకాలం పాతనీరు వెళ్లి కొత్త నీరు వచ్చినందున అంటువ్యాధులు, డెంగ్యూ జ్వరాలు సోకకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.  సమావేశంలో  కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, మేయర్‌ వై సునీల్‌రావు, జడ్పీటీసీ పిట్టల కరుణ, ఎంపీపీ రాణి, ఆసుపత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రత్నమాల, ఆర్‌ఎంవో జ్యోతి, రేడియాలజిస్టు రవీందర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-20T05:51:37+05:30 IST