ఆసుపత్రుల్లో మోసగాళ్లు
ABN , First Publish Date - 2021-05-20T05:46:18+05:30 IST
ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనాను మించిన ప్రమాదకరమైన మోసగాళ్లు తయారయ్యారు. రెమ్‌డిసివిర్ ఇంజక్షన్‌కు డిమాండ్ పెరగడంతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న సిబ్బందే అటు రోగులు, ఇటు యాజమాన్యం కళ్లుగప్పి ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు.

రోగులకు ఇవ్వకుండా రెమ్‌డిసివిర్ ఇంజక్షన్లు మాయం
వాటిని బ్లాక్‌లో అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్న వైనం
సిబ్బంది అక్రమాలను పట్టించుకోని యాజమాన్యాలు
మూడు కేసుల్లో 12 మంది నిందితుల అరెస్టు
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనాను మించిన ప్రమాదకరమైన మోసగాళ్లు తయారయ్యారు. రెమ్‌డిసివిర్ ఇంజక్షన్‌కు డిమాండ్ పెరగడంతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న సిబ్బందే అటు రోగులు, ఇటు యాజమాన్యం కళ్లుగప్పి ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు.
ఇంజక్షన్లకు బదులు సెలైన్ వాటర్
కరోనా రోగికి తొలి డోసు కింద ఒకేరోజు రెండు ఇంజక్షన్లు ఇవ్వాల్సి ఉండగా ఒకే ఇంజక్షన్ ఇచ్చి ఒకటి మాయం చేస్తున్నారు. ఇంజక్షన్లకు బదులు సెలైన్ వాటర్ ఇస్తున్నారు. ఆ ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్‌కు తరలించి అడ్డగోలు ధరలకు అమ్ముకుంటున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ల్యాబ్ టెక్నీషియన్లు, రిసెప్షనిస్టులు, కాంపౌండర్లుగా పనిచేస్తున్నవారు, అంబులెన్స్ డ్రైవర్లు, వారి స్నేహితులు రెమ్‌డిసివిర్ ఇంజక్షన్లకు ఉన్న డిమాండ్‌ను ఆసరాగా చేసుకొని తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఆసుపత్రుల నుంచే ఇంజక్షన్లను మాయం చేస్తూ ఒక్కో ఇంజక్షన్‌ను 30 వేల రూపాయల వరకు విక్రయిస్తున్నారు. కొన్ని ఆసుపత్రులకు చెందిన యజమానులే హాస్పిటల్ పేరిట ఎక్కువ ఇంజక్షన్లు తెప్పించి ప్రైవేట్ మెడికల్ షాపులకు తరలించి బ్లాక్‌లో అమ్మిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలకు ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లభించకపోయినా మూడు సందర్భాల్లో ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేసే సిబ్బంది చేసే దందా వెలుగులోకి వచ్చింది. రెమ్‌డిసివిర్ ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్‌కు తరలించి విక్రయిస్తున్న మూడు కేసుల్లో జిల్లా టాస్క్‌ఫోర్స్ పోలీసులు 12 మంది నిందితులను అరెస్టు చేసి 35 ఇంజక్షన్లను, 44,300 రూపాయల నగదును, ఐదు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
డిమాండ్‌ను బట్టి ధర
తాజాగా నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్, రిసెప్షనిస్టు, కాంపౌండర్ ఒక టీంగా ఏర్పడి చేస్తున్న రెమ్‌డిసివిర్ బ్లాక్ దందా బట్టబయలయింది. ఆసుపత్రుల్లో కరోనా చికిత్స పొందుతున్నవారికి రెమ్‌డిసివిర్ ఇంజక్షన్ అవసరంకాగా తమకు తెలిసినవారి నుంచి తెప్పిస్తామని బాధితుల బంధువుల నుంచి 30 వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. ఆ రోజు ఉన్న డిమాండ్‌ను బట్టి ఇంజక్షన్ ధరను పెంచుతూ పోతున్నట్లు తెలిసింది.
టాస్క్‌ఫోర్స్ టీం స్టింగ్ ఆపరేషన్‌తో ఆటకట్టు
ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేసే సిబ్బంది బ్లాక్ దందా వ్యవహారం సీపీ కమలాసన్‌రెడ్డి దృష్టికి రావడంతో కరీంనగర్ టాస్క్‌ఫోర్స్ టీం స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి నక్క శ్రీకాంత్, పర్వతం సాయికృష్ణ, నారెడ్ల మధూకర్, ఎనుగుర్తి మమత, కనుపర్తి వంశీధర్‌రావును బుధవారం పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 10 రెమ్‌డిసివిర్ ఇంజక్షన్లు, ఐదు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
- ఏప్రిల్ 23వ తేదీన కిసాన్‌నగర్‌లో ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు 18 ఇంజక్షన్లను 40 వేల నగదును స్వాధీనం స్వాధీనం చేసుకున్నారు. వీరు మరణించిన వారి పేరిట తెప్పించిన ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్‌కు తరలించి విక్రయించారు.
- మే 13న నలుగురిని ఇదే బ్లాక్ దందాలో అరెస్టు చేసిన పోలీసులు ఏడు ఇంజక్షన్లు, 4,300 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా కరోనా రోగులకు సెలైన్ ఇచ్చి ఒరిజినల్ ఇంజక్షన్లను బయటకు తరలించి బ్లాక్‌లో అమ్ముకున్నారని సమాచారం. ఆసుపత్రుల యాజమాన్యాలు ఏమాత్రం పట్టించుకోకపోవడం వల్లే ఆయా ఆసుపత్రుల్లో పనిచేసే సిబ్బంది తమ చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నారని భావిస్తున్నారు.
బాధితుల అవసరాలను ఆసరాగా చేసుకుని..
ఇవ్వాల్సిన మోతాదులో ఇంజక్షన్లను ఇవ్వకుండా, సెలైన్ మాత్రమే ఇవ్వడంతో రోగుల ప్రాణాలు పోయే ప్రమాదం ఉన్నది. ఇలాంటి వారిపై ఆసుపత్రుల యాజమాన్యాలు, పోలీసులు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. రెమ్‌డిసివిర్ ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నవారితోపాటు ప్లాస్మా దానం చేస్తానని మోసం చేసిన ఒక వ్యక్తి కూడా జిల్లాలో పోలీసులకు చిక్కాడు. ఆక్సిజన్ సిలిండర్లు ఇప్పిస్తామని 10,500 రూపాయలు తీసుకొని మోసం చేసిన మరో వ్యక్తి కూడా పోలీసు వలలో చిక్కాడు. ఆక్సిజన్ సిలిండర్లను అక్రమంగా నిల్వ చేసి సొమ్ము చేసుకుంటున్నవారు కూడా ఉంటున్నారనే విమర్శలు ఉన్నాయి. అలాంటి ఒకరిని జిల్లా టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. కరోనా ప్రమాదకరంగా మారి ఎందరినో బలిగొంటుంటే మానవత్వం మరిచి ఈ పరిస్థితులను ఆసరాగా చేసుకొని సొమ్ము చేసుకోవడానికి కొందరు నీచాతినీచంగా వ్యవహరిస్తున్నారు. సమాజానికి కరోనా కంటే ప్రమాదకరంగా మారిన ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు.