పోడు భూములకు.. పరిష్కారం లభించేనా?
ABN , First Publish Date - 2021-10-25T06:12:08+05:30 IST
పోడు భూముల సమస్యకు పరిష్కారం లభిస్తుందనే ఆశలు గిరిజనుల్లో మళ్లీ మొదలయ్యాయి. రెవెన్యూ, అటవీ శాఖ సమన్వయంతో సమస్య పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలెక్టర్ అనురాగ్ జయంతి సమీక్ష సమావేశం కూడా నిర్వహించారు.

- దృష్టి సారించిన ప్రభుత్వం
- కలెక్టర్లకు ముఖ్యమంత్రి మార్గనిర్దేశం
- గిరిజనుల్లో మళ్లీ ఆశలు
- గతంలో 308 మంది లబ్ధిదారులకు ఆర్వోఎఫ్ పట్టాలు
- జిల్లాలో కలెక్టర్ అనురాగ్ జయంతి సమీక్ష
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
పోడు భూముల సమస్యకు పరిష్కారం లభిస్తుందనే ఆశలు గిరిజనుల్లో మళ్లీ మొదలయ్యాయి. రెవెన్యూ, అటవీ శాఖ సమన్వయంతో సమస్య పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలెక్టర్ అనురాగ్ జయంతి సమీక్ష సమావేశం కూడా నిర్వహించారు. రెవెన్యూ రికార్డుల మేరకు సర్వే చేపట్టి భూ సమస్య పరిష్కరించడానికి సూచనలు చేశారు. దీంతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు రోజుల క్రితం భూ సమస్యల పరిష్కారం, అటవీ భూముల పరిరక్షణ, హరితహారం వంటి అంశాలపై కలెక్టర్లతో ప్రత్యేక సమావేశం కూడా నిర్వహించారు. దీంతో పోడు భూముల సమస్యకు ప్రభుత్వం పరిష్కార మార్గాన్ని చూపుతుందని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట, చందుర్తి, కోనరావుపేట, మండలాల్లో గిరిజనులు ఆశగా ఎదురు చూస్తున్నారు. తరచూ పోలీసుల సహాయంతో అటవీ శాఖ సిబ్బంది తమ భూములంటూ స్వాధీనం చేసుకోవడానికి రావడం, మొక్కలు నాటడం వంటివి గోడవలకు దారి తీస్తున్నాయి. ప్రధానంగా వీర్నపల్లి, కోనరావుపేట మండలాల్లో పోడు సమస్య తీవ్రంగా ఉంది. పోడు భూముల సమస్య పరిష్కారం కోసం వామపక్ష పార్టీలతోపాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా సమస్య పరిష్కరించాలని గిరిజన రైతులతో కలిసి జిల్లాలో ఆందోళన చేసిన పరిస్థితులు ఉన్నాయి. గతంలో జిల్లాలో కొంత మందికి హక్కు పత్రాలను అందించారు. జిల్లాలో 379.14 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అటవీ భూమి ఉంది. జిల్లాలోని 587 ఎకరాల్లో పోడు భూములకు సంబంధించి 380 మంది రైతులకు హక్కు పత్రాలను అందించారు. ఇందులో చందుర్తి మండలంలో 11.29 ఎకరాలు, గంభీరావుపేట 94.14, వీర్నపల్లి 199.32, ఎల్లారెడ్డిపేట 551, తంగళ్లపల్లిలో 127 ఎకరాలకు సంబంధించి లబ్ధిదారులకు అటవీ హక్కు భూ పత్రాలను అందజేశారు. ఇంకా అనేకమంది గిరిజనులు హక్కు పత్రాల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
2018 కటాఫ్ డేట్‌గా ఉండబోతోందా?
పోడు భూముల సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం 2018 కటాఫ్ తేదీని నిర్ణయిస్తుందనే చర్చ కొనసాగుతుంది. పొరుగున ఉన్న ఆంధ్రా రాష్ట్రంలో 2018ని కటాఫ్ తేదీగా నిర్ణయించారు. 2014, 2018 ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పోడు భూముల సమస్యకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. దీనిపై కలెక్టర్లు, డీఎఫ్‌వోలు, రెవెన్యూ, ఆర్డీవోల చేత సమగ్రంగా రికార్డులను కూడా పరిశీలింపజేస్తున్నారు. పోడు భూముల సమస్యకు ఇప్పటికైనా శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నారు.