కేసీఆర్‌ గారూ.. ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేయండి

ABN , First Publish Date - 2021-02-07T04:45:13+05:30 IST

‘కేసీఆర్‌ గారూ. ఫెడరల్‌ ఫ్రంట్‌ పెట్టండి.. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలతో ఈ దేశానికి మేలు జరగదు. మీరే చొరవ తీసుకొని దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్య నాయకులందరినీ ఏకం చేసి ఫెడరల్‌ ఫ్రంట్‌ పెట్టండి’ అని ప్రముఖ సినీ నటుడు ఆర్‌.నారాయణమూర్తి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో ‘ఆహా హెల్పింగ్‌ హాండ్స్‌’ సంస్థ ఆధ్వర్యంలో శనివారం కవులు, కళాకారులు, సమాజ సేవకులు, కరోనా కష్టకాలంలో పేదలకు అన్నదానం చేసిన సేవామూర్తులకు అవార్డులు ప్రదానం చేశారు.

కేసీఆర్‌ గారూ.. ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేయండి
మాట్లాడుతున్న ఆర్‌.నారాయణమూర్తి

- కవులు, కళాకారులు రైతులకు మద్దతుగా నిలవాలి 

- ధనవంతులకు అనుకూలంగా కేంద్ర బడ్జెట్‌

- సినీ నటుడు ఆర్‌.నారాయణమూర్తి

వేములవాడ, ఫిబ్రవరి 6 : ‘కేసీఆర్‌ గారూ. ఫెడరల్‌ ఫ్రంట్‌ పెట్టండి.. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలతో ఈ దేశానికి మేలు జరగదు. మీరే చొరవ తీసుకొని దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్య నాయకులందరినీ ఏకం చేసి ఫెడరల్‌ ఫ్రంట్‌ పెట్టండి’ అని ప్రముఖ సినీ నటుడు ఆర్‌.నారాయణమూర్తి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో ‘ఆహా హెల్పింగ్‌ హాండ్స్‌’ సంస్థ ఆధ్వర్యంలో శనివారం కవులు, కళాకారులు, సమాజ సేవకులు, కరోనా కష్టకాలంలో పేదలకు అన్నదానం చేసిన సేవామూర్తులకు అవార్డులు ప్రదానం చేశారు. హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రకుమార్‌తో కలిసి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నారాయణమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి అన్నం పెట్టే రైతన్న చేస్తున్న ఆందోళనకు ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలని, కవులు, కళాకారులు, సామాజిక కార్యకర్తలు రైతుకు అండగా ఉండాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌ పేదలకు ఏమాత్రం మేలు చేసేదిగా లేదని, పేదవాడిని మరింత పేదవాడిగా, దనవంతుడిని మరింత ధనవంతుడిగా మార్చేందుకు మాత్రమే ఈ బడ్జెట్‌ సహకరిస్తుందని అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు సమానంగా నిధులు కేటాయించాల్సిన కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రాంతాలపై ప్రేమ, మరికొన్ని ప్రాంతాలపై పక్షపాతం చూపించినట్లు కనిపిస్తోందని, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు పూర్తిగా మొండిచేయి చూపించిందని అన్నారు. త్వరలో ఎన్నికలు జరుగనున్న తమిళనాడు రాష్ట్రానికి భారీగా నిధులు కే టాయించిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు మొండి చేయి చూపించిందని విమర్శించారు. ఇది కేవలం ఎన్నికల ఓటు బ్యాంకు బడ్జెట్‌ అన్నారు. ఇప్పటికైనా కేంద్రంలో కాంగ్రెస్‌, బీజేపీలకు ప్రత్నామ్నాయంగా ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని, ఇందుకు సీఎం కేసీఆర్‌ చొరవ తీసుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలు పూర్తిగా రైతు వ్యతిరేకమని, దేశంలో ఎక్కడైనా పంట అమ్ముకునే హక్కు కల్పించడంతో దళారులకు మాత్రమే మేలు జరుగుతుందని అన్నారు. ప్రస్తుతం ఉన్న కనీస మద్దతు ధర, ఆహార ఉత్పత్తుల ధరల నియంత్రణ విఽఽధానం కొనసాగించాల్సిందేనని, వ్యవసాయ రంగంలో స్వామినాథన్‌ కమిషన్‌ చేసిన సిఫార్సులను కచ్చితంగా అమలు చేయాలని కోరారు. కవులు, కళాకారులు ప్రభుత్వానికి వంత పాడకుండా ప్రజలకు, రైతులకు అండగా ఉండాలని, ప్రజా ఉద్యమాలకు తమ మద్దతునివ్వాలని కోరారు.   రిటైర్డు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రకుమార్‌, గిన్నీస్‌ బుక్‌ రికార్డు హోల్డర్‌, పర్వతారోహకురాలు మలావత్‌ పూర్ణ, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రామతీర్థపు మాధవి రాజు, కవులు జయరాజ్‌, మిట్టపల్లి సురేందర్‌, మున్నూరు కాపు పటేల్స్‌ రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మధు రాజేందర్‌, టిఆర్‌ఎస్‌ నాయకులు ఏనుగు మనోహర్‌రెడ్డి, ఆహా హెల్పింగ్‌ హాండ్స్‌ వ్యవస్థాపకుడు పీర్‌ మహ్మద్‌, అధ్యక్షుడు ఎం.డీ రఫీక్‌, కళాకారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-07T04:45:13+05:30 IST