మిల్లర్లు మోసం చేస్తున్నారని రైతుల రాస్తారోకో

ABN , First Publish Date - 2021-05-09T04:47:50+05:30 IST

రుద్రంగి మండల కేంద్రంలో బస్తాకు 3 కిలోలు అదనంగా తూకం వేయాలని మిల్లర్లు పేర్కొనడంతో ఆగ్రహించిన రైతులు శనివారం రాస్తారోకో చేశారు.

మిల్లర్లు మోసం చేస్తున్నారని రైతుల రాస్తారోకో
రుద్రంగిలో రాస్తారోకో చేస్తున్న రైతులు

రుద్రంగి, మే 8:  రుద్రంగి మండల కేంద్రంలో బస్తాకు 3 కిలోలు అదనంగా తూకం వేయాలని మిల్లర్లు పేర్కొనడంతో ఆగ్రహించిన రైతులు శనివారం రాస్తారోకో చేశారు. మండల కేంద్రంలోని ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో తాలు, తప్ప శుభ్రం చేసిన ధాన్నాన్ని బస్తాకు 41 కిలోలు తూకం వేసి లారీ లోడ్‌ను రైస్‌మిల్‌కు పంపించారు. తాలు, తప్ప పేరుతో ఒక్కో బస్తాకు అదనంగా 3 కిలోలు, క్వింటాల్‌కు సుమారు 8 కిలోల వరకు తూకం వేయనున్నట్లు  రైస్‌మిల్లర్లు చెప్పడంతో  రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని కోరుట్ల - వేములవాడ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా జనార్దన్‌ అనే రైతు మాట్లాడుతూ రెండు రోజుల కింద తాలు, తప్ప పట్టిన తర్వాత  బస్తాకు 41 కిలోల చొప్పున ధాన్యాన్ని అధికారులు కొనుగోలు చేశారని,  మొత్తం 450 బస్తాల ధాన్యాన్ని  రైస్‌మిల్లుకు  తరలించారని తెలిపాడు. రైస్‌మిల్లర్‌లు  బస్తాల్లో తాలు, తప్ప అధికంగా ఉందన్నారని,  క్వింటాల్‌కు 10 కిలోల చొప్పన కట్‌ చేస్తామన్నారని పేర్కొన్నాడు.   10 క్వింటాళ్ల వరకు నష్ట పోతానాని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.  అనంతరం రాస్తారోకో   విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని డీఆర్డీవో కౌటిల్యారెడ్డితో ఫోన్‌లో మాట్లాడించారు.  రైస్‌మిల్లర్లతో మాట్లాడి బస్తాకు 41 కిలోల చొప్పున అన్‌లోడ్‌ చేయించడంతో  రాస్తారోకో విరమించారు.  

Updated Date - 2021-05-09T04:47:50+05:30 IST