మహాశివరాత్రి జాతరకు విస్తృత ఏర్పాట్లు
ABN , First Publish Date - 2021-02-27T05:01:10+05:30 IST
వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రంలో మహాశివరాత్రి జాతర ఉత్సవాలకు 1.80 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ అన్నారు.

- కరోనా పరీక్షలు చేసుకోవాలని భక్తులను కోరుతాం
- దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్
- రాజన్న సన్నిధిలో ఏర్పాట్ల పరిశీలన
వేములవాడ, ఫిబ్రవరి 26 : వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రంలో మహాశివరాత్రి జాతర ఉత్సవాలకు 1.80 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ అన్నారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వరస్వామి క్షేత్రంలో మహాశివరాత్రి జాతర ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, వసతి గృహాలు, పార్కింగ్ స్థలాలు పరిశీలించి భక్తులతో మాట్లాడారు. జాతర ఏర్పాట్లపై ఆలయ అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోనే అతిపెద్దదైన వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రంలో మహాశివరాత్రి జాతర మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇందుకోసం కోటి 80 లక్షల రూపాయలు వెచ్చించామని, గతేడాది జాతరలో ఎదురైన ఇబ్బందులు, జరిగిన పొరపాట్లను గుర్తించి వాటిని అధిగమించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. తాగునీటి సరఫరా, పరిశుభ్రతకు తగిన ప్రాధాన్యం ఇస్తామన్నారు. కరోనా మహమ్మారి ఇంకా పూర్తి స్థాయిలో తగ్గనందున భక్తులు జాగ్రత్తగా ఉండాలన్నారు. కొవిడ్ కారణంగా ధర్మగుండం ఇప్పటికీ తెరవలేదని, భక్తులు తగిన దూరం పాటించే విధంగా అవసరం మేరకు బాత్ షవర్లు ఏర్పాటు చేస్తామని అన్నారు. కరోనా నిర్ధారణ పరీక్షలు తప్పనిసరి కాకపోయినా జాతరకు వచ్చే భక్తులు నిర్ధారణ పరీక్షలు చేసుకొని వస్తే అందరికీ మంచిదన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా పరీక్షలు చేసుకోవాలనే అంశంపై విస్తృత ప్రచారం చేస్తామన్నారు. జాతరలో కరోనా నిబంధనలు పాటించే విధంగా తగిన ఏర్పాట్లు చేస్తామన్నారు. ఆలయ ఈవో కృష్ణప్రసాద్, ఏఈవో ఎస్.హరికిషన్, ఈఈ రాజేశ్, డీఈ మధు రఘునందన్, డి.శేఖర్, సూపరింటెండెంట్లు ఎస్.శ్రీరాములు, ఎన్.మహేశ్ తదితరులు ఉన్నారు.
రాజన్న సేవలో..
మహాశివరాత్రి జాతర ఏర్పాట్ల కోసం శుక్రవారం వేములవాడకు వచ్చిన సందర్భంగా రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈవో కృష్ణప్రసాద్ ప్రసాదం అందజేశారు. ఛత్తీస్‌ఘడ్‌లోని ధమ్‌తారి జిల్లా వినియోగదారుల కమిషన్ అధ్యక్షుడు, న్యాయాధికారి శైలేష్ కుమార్ కేతారప్ కుటుంబసమేతంగా రాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ సూపరింటెండెంట్ నాగుల మహేశ్ ప్రసాదం అందజేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ ఉన్నారు.