ఉపాధ్యాయుల సర్దుబాటుకు కసరత్తు

ABN , First Publish Date - 2021-08-20T05:37:39+05:30 IST

విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను సర్దుబాటు ప్రక్రియ ప్రారంభమైంది.

ఉపాధ్యాయుల సర్దుబాటుకు కసరత్తు

- రేషనలైజేషన్‌ జీవోను విడుదల చేసిన ప్రభుత్వం

- జిల్లాలో 230 వరకు మిగలనున్న ఉపాధ్యాయ పోస్టులు

- ఖాళీ స్థానాల్లో సర్దుబాటు చేయనున్న విద్యా శాఖ

- జీవోలో కొన్ని అంశాలపై స్పష్టత కరువు

- ఉపాధ్యాయ సంఘాల్లో ఆందోళన

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను సర్దుబాటు ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర విద్యా శాఖ మంగళవారం జారీ చేసిన జీవో మేరకు జిల్లా విద్యా శాఖాధికారులు, సిబ్బంది కసరత్తును మొదలుపెట్టారు. గత విద్యా సంవత్సరంలో ఆయా పాఠశాలల్లో ఉన్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పోస్టులను సర్దుబాటు చేయాలని విద్యా శాఖ పేర్కొన్నది. దీంతో జిల్లాలో 230 నుంచి 260 పోస్టుల వరకు మిగిలే అవకాశాలున్నట్లు అంచనా వేస్తున్నారు. 

పోస్టులు మిగిలే అవకాశాలు..

జిల్లాలో 104 ఉన్నత పాఠశాలలు, 83 ప్రాథమికోన్నత పాఠశాలలు, 375 ప్రాథమికోన్నత పాఠశాలలున్నాయి. జిల్లాకు మంజూరైన ఉపాధ్యాయ పోస్టులు 2480 కాగా, ప్రస్తుతం 2229 మంది పనిచేస్తున్నారు. ఇంకా 251 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న పాఠశాలల్లో కొన్ని ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులు లేక అందులో పనిచేసే ఉపాధ్యాయులను ఇతర పాఠశాలల్లో సర్దుబాటు చేశారు. గతంలో ప్రతి ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు ఉండగా, కొత్తగా జారీ చేసిన జీవో ప్రకారం 19మంది విద్యార్థులున్న పాఠశాలల్లో ఒక ఉపాధ్యాయుడినే కొనసాగించాలని పేర్కొన్నారు. దీంతో ఆయా పాఠశాలల్లో చాలావరకు ఎస్జీటీ పోస్టులు మిగిలే అవకాశాలున్నాయి. వారిని విద్యార్థుల సంఖ్యకు తగ్గట్లుగా ఉపాధ్యాయులు లేని పాఠశాలల్లో సర్దుబాటు చేయనున్నారు. 50కి లోపు విద్యార్థులున్న ఆంగ్ల మాధ్యమం ఉన్నత పాఠశాలల విద్యార్థులు సమీప పాఠశాలల్లో విలీనం చేయాలని పేర్కొనడంతో ఆ పాఠశాలల్లో విద్యాబోధన చేస్తున్న ఉపాధ్యాయులను మరో పాఠశాలలో సర్దుబాటు చేయనున్నారు. రేషనలైజేషన్‌ అనంతరం మిగులు పోస్టులను ఇతర పాఠశాలలకు సర్దుబాటు చేసిన తర్వాత కూడా కొన్ని పోస్టులు మిగిలే అవకాశాలున్నాయి. 150కి పైగా విద్యార్థులున్న పాఠశాలల్లోనే ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎం పోస్టులను కొనసాగించాలని పేర్కొనగా, ఆలోపు విద్యార్థులున్న పాఠశాలల ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎంలను ఎస్జీటీలుగా పరిగణించనున్నారు. ఒకే ఆవరణలో రెండు ఉన్నత పాఠశాలలు గానీ, రెండు ప్రాథమిక పాఠశాలలు గానీ, రెండు ప్రాథమిక పాఠశాలలు ఉన్న పాఠశాలలను ఒకటిగా విలీనం చేయాలని పేర్కొన్న మేరకు జిల్లాలో ఆ మేరకు పాఠశాలలు లేవని విద్యా శాఖ అధికారులు తెలిపారు. రేషనలైజేషన్‌ ప్రక్రియతో జిల్లాకు మంజూరైన పోస్టుల ప్రకారం ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ ప్రక్రియ మూడేళ్ల వరకు చేపట్టే అవకాశాలు లేకుండాపోయాయి.

కొన్ని అంశాలపై స్పష్టత కరువు.. 

రేషనలైజేషన్‌ చేపట్టేందుకు విద్యాశాఖ జారీ చేసిన జీవోలో కొన్ని అంశాలపై స్పష్టత కొరవడిందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు వాపోతున్నారు. కొత్త జిల్లాల ప్రాతిపదికన మాత్రమే రేషనలైజేషన్‌ ప్రక్రియ చేపడుతుండడంతో అనంతరం మిగులు ఉపాధ్యాయులను సర్దుబాటు చేసిన తర్వాత కూడా మిగిలే ఉపాధ్యాయులను ఎక్కడికి పంపించాలనే విషయమై జీవోలో పేర్కొనలేదని చెబుతున్నారు. గడిచిన 2020-21 విద్యా సంవత్సరంలో ఆయా పాఠశాలల్లో నమోదైన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగానే పోస్టులను సర్దుబాటు చేయాలని చెప్పారని, కరోనా నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య పెరిగిందని అంటున్నారు. ఈ విద్యా సంవత్సరం ప్రకారమే రేషనలైజేషన్‌ చేపడితే విద్యార్థులకు నష్టం జరగదనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది విద్యా సంవత్సరంలో విద్యార్థులు తాత్కాలికంగా మూతపడిన ప్రాథమిక పాఠశాలలు ఈ విద్యా సంవత్సరంలో తెరుచుకున్నాయి. ఉదాహరణకు పెద్దపల్లి మండలం మేరపల్లి ప్రాథమిక పాఠశాలలో 20 మంది వరకు విద్యార్థులు చేరారు. గత ఏడాది యూడైస్‌లో మాత్రం ఇక్కడ విద్యార్థులు లేనట్లుగా ఉంటుంది. ఇలాంటి పాఠశాలలను పరిగణనలోకి తీసుకుని సర్దుబాటు చేస్తారా, లేదా అనే అంశంపై స్పష్టతలేదని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. తాత్కాలికంగా మూతపడిన పాఠశాలలను కొనసాగించడమా, యధాతథంగా మూసివేయడమా అనే విషయమై జీవోలో స్పష్టత లేకపోవడం గమనార్హం. ప్రభుత్వం జారీ చేసిన రేషనలైజేషన్‌ జీవో శాస్త్రీయంగా లేదని, ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండే విధంగా చర్యలు తీసుకుని జీవోను సవరించాలని, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించిన తర్వాతే రేషనలైజేషన్‌ చేపట్టాలని వివిధ ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాయి. ఈనెల 24న జిల్లా కేంద్రాల్లో, సెప్టెంబర్‌ 18న రాష్ట్ర స్థాయిలో ధర్నాలకు పిలుపునిచ్చాయి. 

Updated Date - 2021-08-20T05:37:39+05:30 IST