ఉపసంహరణపై ఉత్కంఠ

ABN , First Publish Date - 2021-11-26T06:06:44+05:30 IST

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పర్వం ఉత్కంఠకు తెరతీసింది

ఉపసంహరణపై ఉత్కంఠ

- రవీందర్‌సింగ్‌ చుట్టూ చర్చలు

- బుజ్జగింపులు లేవు, వేటే అంటున్న టీఆర్‌ఎస్‌

- పార్టీకి రాజీనామా చేసిన సింగ్‌

- ఊటీ, బెంగుళూరుకు తరలనున్న క్యాంపులు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పర్వం ఉత్కంఠకు తెరతీసింది. నామినేషన్ల ఉపసంహరణకు శుక్రవారం సాయంత్రం వరకే గడువు ఉండడంతో చర్చనీయాంశంగా మారింది. అన్ని రాజకీయ పార్టీల్లోనూ రవీందర్‌సింగ్‌ పోటీలో ఉంటున్నాడా.. ఉపసంహరించుకుంటున్నాడా.. అన్న విషయంలో జోరుగా చర్చలు సాగుతున్నాయి. శామీర్‌పేట లియోమెరిడియన్‌ రిసార్ట్స్‌లో ఉన్న అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో కూడా రవీందర్‌సింగ్‌ కేంద్ర బిందువుగా చర్చలు సాగినట్లు సమాచారం. అయితే గురువారం రాత్రి రవీందర్‌సింగ్‌ టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఒక సుదీర్ఘమైన లేఖ రాసి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో పోటీ అనివార్యమని తేలిపోయింది. టీఆర్‌ఎస్‌ అధిష్టానవర్గం కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా పరిధిలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు టి భానుప్రసాదరావు, ఎల్‌ రమణ పేర్లను ఖరారు చేసింది. మొదటి నుంచి ఎమ్మెల్సీ టికెట్‌ ఆశిస్తూ వస్తున్న టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, కరీంనగర్‌ మాజీ మేయర్‌ రవీందర్‌సింగ్‌ అధిష్టానవర్గం నుంచి తన పేరు ప్రతిపాదనకు రాకపోవడంతో చివరి రోజున ఇండిపెండెంట్‌గా నామినేషన్‌ వేశారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఆయనను బలపర్చినవారిలో ఉన్నారు. నామినేషన్‌ వేయకముందు ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు, వేసిన తర్వాత రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ రవీందర్‌సింగ్‌తో సంప్రదింపులు జరిపి అధిష్టానవర్గం చెప్పిన అభ్యర్థులకే మద్దతు ప్రకటించి సీనియర్‌ నాయకునిగా సహకరించాలని కోరినట్లు తెలిసింది. అయితే తనకు రెండుసార్లు ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారని, కరీంనగర్‌  జిల్లా టీఆర్‌ఎస్‌ రాజకీయాల్లో తన ప్రాధాన్యతను తగ్గించి, ఉనికినే గుర్తించడం లేదని, అలాంటి పరిస్థితుల్లో తాను ఎందుకు పోటీ నుంచి ఉపసంహరించుకోవాలని రవీందర్‌సింగ్‌ వారిని ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ ఇద్దరు అగ్రనేతల సంప్రదింపుల తర్వాత రెండు రోజులు ఉపసంహరణకు గడువు ఉండడంతో రవీందర్‌సింగ్‌ బుజ్జగింపులకు మెత్తబడి నామినేషన్‌ను ఉపసంహరించుకుంటారనే అందరూ భావించారు. అయితే అలాంటి సూచనలేమీ కనిపించకపోవడంతో ఆయనపట్ల, అలాగే పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా నామినేషన్‌ వేసిన వారిపట్ల, మద్దతు ప్రకటించిన వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని, వారిని వెంటనే పార్టీ నుంచి బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే నామినేషన్ల ఉపసంహరణకు శుక్రవారం సాయంత్రం 3 గంటల వరకు గడువు ఉండడంతో అప్పటి వరకు వేచి చూసి రవీందర్‌సింగ్‌ నామినేషన్‌ ఉపసంహరించుకోకపోతే వేటు వేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. రవీందర్‌సింగ్‌ కూడా ఈ విషయంలో ఏమాత్రం తగ్గేదే లేదని, పార్టీలో తన ఆత్మగౌరవానికి భంగం కలుగుతున్న తరుణంలో అందులో కొనసాగే కంటే పోటీచేసి బయటపడడమే మంచిదనే నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. గురువారం రాత్రి ఆయన టీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. దీంతో జిల్లాలోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవులకు పోటీ అనివార్యమని తేలిపోయింది.

 రెండు స్థానాలకు 27 నామినేషన్లు 

ఉమ్మడి జిల్లా పరిధిలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు 27 మంది నామినేషన్లు వేయగా అందులో ఇద్దరు అధికార పార్టీకి చెందినవారు, రవీందర్‌సింగ్‌ రెబల్‌ అభ్యర్థిగా ఉన్నారు. మిగతా 24 మంది టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు చెందినవారు, స్వతంత్రులు ఉన్నారు. స్ర్కూటీనిలో ముగ్గురి నామినేషన్లను తిరస్కరించగా 24 మంది రంగంలో ఉన్నారు. రవీందర్‌సింగ్‌ పోటీలో ఉండడానికే నిర్ణయించుకోవడంతో ప్రధానంగా అధికార పార్టీకి చెందిన ఇద్దరు అభ్యర్థులు ఆయన మధ్యే పోటీ ఉంటుందని భావిస్తున్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు నిధులు, విధులు లేని కారణంగా ప్రభుత్వ విధానాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ముఖ్యంగా ఎంపీటీసీలైతే ఆ పదవుల్లో కొనసాగడం ఎందుకు అనే భావనతో ఉన్నారని చెబుతున్నారు. వీరంతా ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తితో రెబల్‌గా పోటీలో నిలిచిన సింగ్‌కు రెండవ ఓటు వేసే అవకాశం లేకపోలేదనే భావన వ్యక్తమవుతున్నది. ఇప్పుడు ఓటర్లుగా ఉన్న స్థానిక సంస్థల ప్రతినిధుల్లో పలువురు గతంలో కూడా సభ్యులుగా ఉన్నారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో భానుప్రసాదరావు స్థానిక సంస్థల నుంచే పోటీ చేసి ఎన్నిక ఏకగ్రీవమైన తర్వాత ఓటర్లుగా ఉన్న ప్రతినిధులను ఏమాత్రం పట్టించుకోలేదని, ఆర్థికంగా ఆదుకుంటానని ఇచ్చిన హామీని కూడా నెరవేర్చలేదని వారు కినుకతో ఉన్నట్లు తెలుస్తున్నది. అలాంటివారు ఇప్పుడు కొంత అసంతృప్తితో వ్యవహరించే అవకాశం లేకపోలేదని చర్చించుకుంటున్నారు.

ఉమ్మడి జిల్లా పరిధిలో 1,324 మంది ప్రజాప్రతినిధులు

 మొత్తం ఉమ్మడి జిల్లా పరిధిలో 1324 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఓటర్లుగా ఉన్నారు. వీరిలో 996 మంది అధికార పార్టీకే చెందినవారు కాగా, 328 మందిలో కాంగ్రెస్‌, బీజేపీ, ఇతర పార్టీలకు చెందినవారు ఉన్నారు. రెండు స్థానాలను సునాయసంగా గెల్చుకునే సంపూర్ణ మెజార్టీ టీఆర్‌ఎస్‌ పార్టీకి ఉన్నా మూడవ అభ్యర్థి పోటీలో ఉంటే అసంతృప్తివాదులు క్రాస్‌ ఓటింగ్‌ చేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అందుకే స్పష్టమైన మెజార్టీ ఉన్నా టీఆర్‌ఎస్‌ పార్టీ నామినేషన్ల ఘట్టం పూర్తికాగానే తమ ఓటర్లందరినీ హైదరాబాద్‌ క్యాంపునకు తరలించింది. ఉపసంహరణ నాటికి పరిస్థితులు సర్దుకుంటాయని భావించినా రవీందర్‌సింగ్‌ పోటీలో ఉండాలని నిర్ణయించుకోవడంతో 26 తేదీతో ముగించాలనుకున్న క్యాంపులను పోలింగ్‌ వరకు కొనసాగించాలనే నిర్ణయం తీసుకున్నారని సమాచారం. మంత్రులు గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌, జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్‌ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ఇతర ముఖ్య నాయకులు గురువారం లియోమెరిడియన్‌ రిసార్ట్‌లో సమావేశమై ఎమ్మెల్సీ ఎన్నికలపై సుదీర్ఘంగా చర్చించి 26 సాయంత్రం మరోసారి సమావేశమై క్యాంపులను బెంగుళూరు, ఊటీలకు తరలించే విషయమై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ మేరకు సూత్రప్రాయంగా ఒక అవగాహనకు వచ్చి స్థానిక ప్రజాప్రతినిధులందరికీ అందుకు మానసికంగా సిద్ధంగా ఉండాలని సూచించారని తెలిసింది. టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన కొందరు ఇండిపెండెంట్లుగా నామినేషన్లు వేసిన వారిలో ఉన్నారు. వారు నామినేషన్లు ఉపసంహరించుకునే అవకాశం ఉన్నది. రవీందర్‌సింగ్‌ నామినేషన్‌ ఉపసంహరించుకుంటే ఇతర పార్టీలకు చెందినవారిని కూడా సంప్రదింపులు జరిపి విత్‌డ్రా చేయించుకోవాలని భావించారని, అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకపోవడంతో ఎవరిని కూడా సంప్రదించాల్సిన అవసరం లేదని టీఆర్‌ఎస్‌ నాయకత్వం భావిస్తున్నట్లు తెలిసింది. దీంతో ఆర్థికంగా లబ్ధి పొందడానికి నామినేషన్లు వేసిన వారు తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురవుతున్నట్లు సమాచారం. వారిలో కొందరు నామినేషన్‌ వేసేందుకు మద్దతు పలికిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు 50 వేల రూపాయల చొప్పున డబ్బు ఇచ్చి, మరో 50 వేలకు తర్వాత ఇస్తామనే హామీ ఇచ్చారని, ఇప్పుడు బేరసారాలు లేకపోవడంతో పెట్టుబడిగా పెట్టిన డబ్బు నష్టపోవాల్సి వస్తుందని దిగాలు పడుతున్నారని తెలిసింది. గత ఎన్నికల సందర్భంలో పోటీలో ఉన్న ఇండిపెండెంట్లకు పదేసి లక్షల రూపాయల చొప్పున ఇవ్వడంతో ఈసారి కూడా అంతకంటే ఎక్కువే డిమాండ్‌ చేయవచ్చని 5 నుంచి 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి కొందరు నామినేషన్లు వేసి ఇప్పుడు ఇరుకున పడ్డారు. 

Updated Date - 2021-11-26T06:06:44+05:30 IST