మార్పు కోసం అందరం కృషి చేయాలి

ABN , First Publish Date - 2021-11-09T05:30:00+05:30 IST

సమాజంలో మంచి మార్పు రావడం కోసం అందరం కృషి చేయాలని జిల్లా జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌ ఎంజీ ప్రియదర్శిని అన్నారు.

మార్పు కోసం అందరం కృషి చేయాలి
కార్యక్రమంలో మాట్లాడుతున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రియదర్శిని

- జిల్లా జడ్జి ఎంజీ ప్రియదర్శిని

కరీంనగర్‌ లీగల్‌, నవంబరు 9: సమాజంలో మంచి మార్పు రావడం కోసం అందరం కృషి చేయాలని జిల్లా జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌ ఎంజీ ప్రియదర్శిని అన్నారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవంలో భాగంగా జాతీయ న్యాయ సేవల దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయ సేవాధికారి సంస్థ భవన్‌లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా జడ్జి ప్రియదర్శిని మాట్లాడుతూ 1987 సంవత్సరంలో లీగల్‌ యాక్ట్‌ స్థాపించారని, నవంబరు 9,  1995 నుంచి జాతీయ న్యాయ సేవల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌ ప్రకారం అంటరానితనం నేరమని, దీన్ని రూపుమాపేందుకు ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.  నేరస్తులకు శిక్ష పడేందుకు ప్రజలు సాక్ష్యం చెప్పడానికి భయపడుతున్నారని, వారిలో భయం తొలగించేందుకు అవగాహన కల్పించాలన్నారు. చట్టాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తేనే కోర్టుక కేసులు తగ్గుతాయని తెలిపారు. కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ మాట్లాడుతూ చిన్న చిన్న తగాదాలను వారికి వారే పరిష్కారం చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. చట్టాలు, హక్కులపై ప్రజలకు అవగాహన కల్పించి చైతన్యవంతులను చేయాలని తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి సుజయ్‌ మాట్లాడుతూ పాన్‌ ఇండియా అవేర్‌నెస్‌ అండ్‌ ఔట్‌ రీచ్‌ కార్యక్రమంలో భాగంగా అక్టోబరు 2 నుంచి నవంబరు 14 వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ మారుమూల గ్రామాల ప్రజలకు న్యాయసేవలు, సలహాలు, అందిస్తున్నామని అన్నారు. డిసెంబరులో జాతీయ లోక్‌ అదాలత్‌ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఏసీపీ జి మదన్‌లాల్‌, బార్‌ అసోసియేషన్‌ కార్యదర్శి జూపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-09T05:30:00+05:30 IST