ఇంటర్‌ విద్యార్థులకు న్యాయం చేయాలి

ABN , First Publish Date - 2021-12-19T06:25:44+05:30 IST

ఇంటర్మీడియెట్‌ ఫస్టియర్‌ ఫలితాలలో సాంకేతిక లోపాలను సవరించాలని, ఉచితంగా రీవాల్యుయేషన్‌ చేపట్టి విద్యార్థులకు న్యాయం చేయాలని ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్‌ కో కన్వీనర్‌ మారవేణి రంజిత్‌కుమార్‌ అన్నారు.

ఇంటర్‌ విద్యార్థులకు న్యాయం చేయాలి
డీఐఈవో కార్యాలయాన్ని ముట్టడించిన ఏబీవీపీ నాయకులు

- ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్‌ కో కన్వీనర్‌ మారవేణి రంజిత్‌కుమార్‌

- డీఐఈవో కార్యాలయం ముట్టడి

సిరిసిల్ల ఎడ్యుకేషన్‌, డిసెంబరు 18: ఇంటర్మీడియెట్‌ ఫస్టియర్‌ ఫలితాలలో సాంకేతిక లోపాలను సవరించాలని,  ఉచితంగా రీవాల్యుయేషన్‌ చేపట్టి విద్యార్థులకు న్యాయం చేయాలని ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్‌ కో కన్వీనర్‌ మారవేణి రంజిత్‌కుమార్‌ అన్నారు. శనివారం ఏబీవీపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ జిల్లా ఇంటర్మీడియెట్‌ విద్యాధికారి కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా రంజిత్‌కుమార్‌ మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితుల్లో  ప్రభుత్వం విద్యారంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసిందని, నేడు ఇంటర్మీడియెట్‌ విద్యార్థుల ఫలితాల్లోనూ గందరగోళానికి తెరలేపిందని అన్నారు.  లక్షల మంది విద్యార్థులు మానసిక క్షోభకు గురవుతున్నారని, ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియెట్‌ సిలబస్‌ పూర్తి చేయకుండానే   పరీక్షలు నిర్వహించడంతో అయోమయంతో విద్యార్థులు   నష్టపోయారన్నారు. మునుపెన్నడూ లేనంతగా కేవలం 49శాతం ఉత్తీర్ణత సాధించడం, ప్రతిభ కలిగిన అనేక మంది విద్యార్థులు ఫెయిలవడం వంటివి  గమనిస్తే పేపర్‌ వాల్యూయేషన్‌, అదేవిధంగా సాంకేతిక పరమైన లోపాలున్నట్లు స్పష్టమవుతోందన్నారు. పేపర్‌ వాల్యుయేషన్‌లో జరిగిన అవకతవకలతో విద్యార్థులు నష్టపోయి ఆందోళనలో పడ్డారని,  విద్యార్థులందరికీ మరోసారి ఉచితంగా రీ వాల్యుయేషన్‌ నిర్వహించాలని ఏబీవీపీ తెలంగాణ శాఖ తరపున డిమాండ్‌ చేస్తున్నామన్నారు. వేలాది మంది విద్యార్థులు సింగిల్‌ డిజిట్‌ మార్కులకే పరిమితమయ్యారంటే గతంలో జరిగిన విధంగానే మరోసారి సాంకేతిక లోపాలున్నట్లు  స్పష్టమవుతోందని అన్నారు.   ప్రభుత్వం ఫలితాలను పున:పరిశీలించాలని, పారదర్శకంగా ఫలితాలు ప్రకటించి విద్యార్థులకు న్యాయం చేయాలని అన్నారు.  విద్యార్థులు ఉద్వేగానికి లోనుకాకుండా ధైర్యంగా ఉండాలని ఫలితాల్లో జరిగిన లోపాలను సరిచేసేంత వరకు ఏబీవీపీ అందగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సామనపెల్లి ప్రశాంత్‌, ఎస్‌ఎఫ్‌ఎస్‌ కన్వీనర్‌ మోతుకు వినయ్‌, ఎస్‌ఎఫ్‌డీ కన్వీనర్‌ లోపెల్లి రాజు, చర్లపల్లి వినయ్‌, సమ్యాల్‌ దిలీప్‌, నవీన్‌, అర్జున్‌, ప్రేమ్‌, చందు, నాగరాజు, మధు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-19T06:25:44+05:30 IST