అదును దాటుతోంది

ABN , First Publish Date - 2021-12-26T04:50:03+05:30 IST

కళ్ల ఎదుట సాగు జలాలు.. పొంగుతున్న బోర్లు. సర్కారు మాత్రం యాసంగిలో వరి వద్దంటోంది. ఆరుతడి పంటలే మేలని ప్రచారం చేస్తోంది. మరోవైపు యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని స్పష్టం చేయడంతో అన్నదాతల్లో స్తబ్ధత నెలకొంది.

అదును దాటుతోంది
ఎల్లారెడ్డిపేటలో సాగు లేకుండా బీడుగా ఉన్న భూమి

- యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలపై అనాసక్తి 

-  ఎటూ తేల్చుకోలేక పోతున్న  రైతులు 

-  ఈ యాసంగిలో 1995 ఎకరాల్లో సాగు 

- 272 ఎకరాల్లో వరి

- 1723 ఎకరాల్లో  ఇతర పంటలు

(ఆఽంధ్రజ్యోతి సిరిసిల్ల)

కళ్ల ఎదుట సాగు జలాలు.. పొంగుతున్న బోర్లు.  సర్కారు   మాత్రం యాసంగిలో వరి వద్దంటోంది. ఆరుతడి పంటలే మేలని ప్రచారం చేస్తోంది.  మరోవైపు యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని స్పష్టం చేయడంతో అన్నదాతల్లో స్తబ్ధత నెలకొంది.  ఇప్పటికే యాసంగిలో పంటల సాగు చివరి దశకు చేరుకోవాల్సిన పరిస్థితి ఉండగా కేవలం 2 వేల ఎకరాల విస్తీర్ణం కూడా దాటలేదు. గత యాసంగిలో జిల్లాలో రైతులు 1.73 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు  వేయగా అందులో 1.67 లక్షల వరకు వరిసాగు చేశారు. ఈ సారి ఇంకా యాసంగి పంటల వేగం పెరగలేదు. 

రైతుల్లో అనాసక్తి 

ఈ సారి యాసంగి ధాన్యం కొనుగోలుకు కేంద్రం సుముఖంగా లేకపోవడంతో  అన్నదాతలను పంట మార్పిడి వైపు మళ్లించే ప్రయత్నం చేస్తున్నా ఆసక్తి కనబర్చడం లేదు. అవగాహన కల్పించడంలో అలసత్వంతో ఆరుతడి పంటలపై రైతులు దృష్టి సారించకముందే అదును దాటిపోయింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పొద్దు తిరుగుడు, నువ్వులు, పెసర, మినుములు, జొన్నల సాగుకు మాత్రం అనుకూలంగా ఉంది.  వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనల మేరకు వేరుశనగ సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి నవంబరు 30 లోగా విత్తుకోవాల్సి ఉంటుంది. శనగ అక్టోబరు ఒకటో తేదీ నుంచి 15 వరకు, అవాలు అక్టోబరు ఒకటో తేదీ నుంచి నవంబరు 15 వరకు, ఆముదం సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి నవంబరు 15 వరకు విత్తుకోవాల్సి ఉండగా  సమయం గడిచిపోయింది. ప్రస్తుతం నువ్వులు, పెసర, మినుములు, పొద్దుతిరుగుడ, జొన్న రకాలు మాత్రమే వేసుకునే అవకాశం ఉంది. మినుములు, పొద్దుతిరుగుడు, జొన్నలు పెసర డిసెంబరు 10 నుంచి 31 వరకు, నువ్వులు జనవరి 15 నుంచి ఫిబ్రవరి వరకు వేసుకునే వీలు ఉంది. జిల్లాలో ఇప్పటి వరకు వరి 272 ఎకరాలు, జొన్న 38.31, సామలు 5, గోధుమలు 15.23, చెరకు 4, పశుగ్రాసం 6.23, ఆముదం 3.27, పారా గ్రాస్‌ 3, వేరు శనగ 204.15, ఆవాలు 25.10, కుసుమ 37.23, నువ్వులు 17.05, పొద్దు తిరుగుడు 253.14, శనగ 443.23, మినుములు 65.21, బబ్బెర్లు 46.16, పెసర 85.33, కందులు 18.16, ఉలవలు 8.16 ఎకరాల్లో ఇప్పటి వరకు విత్తుకున్నారు.


బీడుగానే భూములు 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో  సమృద్ధిగా వర్షాలు, కాళేశ్వరం జలాలతో భూగర్భ జలాలు పెరగడంతో వానాకాలం సాగులో 2.43 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేసుకున్నారు. యాసంగిలో కూడా పంట సాగు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వ ఆంక్షలతో రైతులు పంటల సాగుపై అయోమయంలో పడ్డారు. కొందరు రైతులు పంట మార్పిడికి ముందుకొచ్చినా మరికొందరు భూములను బీడుగానే ఉంచారు. ప్రస్తుతం ఉన్న భూమి తీరును బట్టి మరికొందరు వరిసాగుకే సిద్ధమై నారుమడులు వేసుకున్నారు. 272 ఎకరాల్లో ఇప్పటికే నాట్లు పడ్డాయి. వ్యవసాయ అధికారులు పంట మార్పిడిపై చెబుతున్నా రైతులు మాత్రం ఇతర పంటలపై అంతంత మాత్రంగానే స్పందిస్తున్నారు. 

Updated Date - 2021-12-26T04:50:03+05:30 IST